ప్రలోభపెట్టే అభ్యర్థుల్ని తిరస్కరిద్దాం!

by Ravi |   (  Updated:2025-12-14 00:45:37  IST  )

స్వాతంత్య్ర అనంతరం మన దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కొరకు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన

ప్రలోభపెట్టే అభ్యర్థుల్ని తిరస్కరిద్దాం!
X

స్వాతంత్య్ర అనంతరం మన దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కొరకు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. మన దేశంలో గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ అని అంబేద్కర్ చెప్పాడు. ప్రజలంతా భవిష్యత్ పునర్నిర్మానానికి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించు కోవాల్సిన సందర్భం ఇది.

ఓటు మార్కెట్‌లో బలి

తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండవ, మూడవ దశ ఎన్నికలు జర గనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివిధ కులాల దళారి నాయకులు తమ కులం ఓట్లు మీకేనని అభ్యర్థులకు చెబుతూ డబ్బుల వసూలు చేస్తూ కులాన్ని తాకట్టు పెడు తున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓటు ఒక వేలంపాటగా మారిపోయింది. అమాయక దళిత, బహు జనుల్ని ఓటు మార్కెట్‌లో బలిచేస్తున్నారు.

నోటుతో ఓటు పొందడం డేంజర్

ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే.. నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతోంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోబాలకు గురై అంధ కారంలోకి వెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజాసేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతోంది. స్వార్థ రాజకీయాలతో ఈర్ష, ద్వేషం, పగ, ప్రతికారాలు పెచ్చరిల్లుతున్నాయి.

రోజుకు రూపాయి విలువ కాదు..

నేటికీ గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తించు కోవాలి. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు రోజుకు ఒక రూపాయి విలువ కూడా కాదు. కావున ఓటర్లు యాచకులుగా మారవద్దు. క్వార్టర్ సీసాకి, బిర్యానికి మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అసలు ప్రలోభ పెట్టే నాయకుడు ఎప్పటికీ ప్రజానేత కాదు. కావున మందు, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగమై నిజాయితీగా ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదాం.

(గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో)

-సంపతి రమేష్ మహారాజ్

79895 79428

Next Story