గచ్చిబౌలిలో పది ఎకరాల స్థలం దానం చేసిన నటుడు.. ఇప్పుడు ఎంత ఉండేదో..?

by Ravi |   (  Updated:2025-04-05 01:15:03  IST  )

తెలుగు సినిమా రంగంలోని ప్రముఖ నటుల్లో ప్రభాకర్ రెడ్డి ముఖ్యుడు. ఆయన పేరు వినగానే ప్రేక్షకులకు ఓ విలన్, కేరక్టర్ ఆర్టిస్ట్ గుర్తుకొస్తాడు.

గచ్చిబౌలిలో పది ఎకరాల స్థలం దానం చేసిన నటుడు.. ఇప్పుడు ఎంత ఉండేదో..?
X

తెలుగు సినిమా రంగంలోని ప్రముఖ నటుల్లో ప్రభాకర్ రెడ్డి ముఖ్యుడు. ఆయన పేరు వినగానే ప్రేక్షకులకు ఓ విలన్, కేరక్టర్ ఆర్టిస్ట్ గుర్తుకొస్తాడు. కానీ నాకైతే ఆయనలో ఓ మంచి రచయిత కనిపిస్తారు. గాంధీ పుట్టిన దేశం, పండంటి కాపురం, కార్తీక దీపం, గృహప్రవేశం, కుంకుమ తిలకం చిత్రాలకు ఆయన రాసిన కథల్లో కుటుంబంతో పాటు సమాజంలో మారుతున్న విలువలు స్పష్టంగా ఆవిష్కృతమవుతాయి. మనుషుల్లో పెరిగిపోతున్న దూరాలు, ఆత్మీయతలు అన్నింటినీ ఆయన తన సినిమా కథల్లో ఆర్ద్రంగా వివరించారు.

నటనను తన ప్రాధాన్యతా రంగంగా ఎంచుకున్న ప్రభాకర్ రెడ్డి. కొన్ని సినిమాలకు కథను సమకూర్చడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రాలన్నీ ఆర్థికంగా మంచి విజయాల్ని సాధించడమే కాకుండా మంచి చిత్రాలుగా కూడా ప్రశంసలు పొందాయి.

సొంత ఆస్తిని దానం చేసి..

వీటన్నింటినీ మించి ఆయన దానగుణం సాటిలేనిది. వ్యాపార రంగమయిన సినిమా నుంచి ఎదిగి సినీ కార్మికుల కోసం తన స్వంత పదెకరాల భూమిని ఆయన ఉచితంగా ఇచ్చారు. అదీ ఇవాల్టి గచ్చిబౌలి ప్రాంతంలో.. దాని విలువ ఈరోజు ఎన్ని కోట్లు వుంటుందో ఆలోచిస్తేనే దడ పుడుతుంది. మిగతా సినిమా వాళ్లంతా టాకీసులూ, స్టూడియోలు, భవంతులు కట్టుకుంటే ప్రభాకర రెడ్డి స్వంత ఆస్తిని దానం చేసి గొప్పవాడిగా నిలిచాడు. దానికి ఆయన్ని ప్రభుత్వం పరిశ్రమ ఎంతగా తలకెత్తుకున్నా తక్కువే, కానీ గద్దర్ అవార్డుల్లో భాగంగా వినోదాత్మక సినిమాకు అవార్డును ఇస్తోంది. అయితే, తనలో ఉన్న నటుడిని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో తెలుగు సినిమా వైఫల్యం కనిపిస్తుంది.

హౌస్ సర్జన్‌గా చేస్తూనే సినిమాల్లోకి...

ప్రభాకర రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని తుంగతుర్తి గ్రామంలో 1935 అక్టోబర్ 8న మందడి లక్ష్మారెడ్డి రెడ్డి, కౌసల్య దంపతులకు జన్మించారు. కళల పట్ల ఆసక్తితో చిన్నప్పటి నుంచి రంగస్థల నటుడిగా, బుర్రకథలు చెప్పారు కానీ తన చదువు మీద ఏకాగ్రతను కోల్పోలేదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్‌గా పనిచేస్తుండగానే ఆయన్ని ‘చివరకు మిగిలేది’ చిత్రంలో సైకియాట్రిస్టు పాత్రకు గుత్తా రామినీడు ఎంపిక చేశారు. ఆ సినిమాకు నిర్మాత కాంగ్రెస్ నాయకుడు పురుషోత్తం రెడ్డి. అది ఆర్థికంగా అంతగా విజయవంతం కాలేకపోయింది దాంతో నిర్మాతగా పురుషోత్తం రెడ్డి డీలా పడిపోయారు. అయినా మంచి చిత్రం తీసాననే ఆనందం మిగిలింది అన్నారాయన.

చారిత్రక పాత్రలకు వన్నె తెచ్చి..

చివరకు మిగిలేది చిత్రం అయ్యాక ప్రభాకర్ రెడ్డి కొంత కాలం డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి, అవకాశాలు పెరగడంతో మద్రాసు చేరుకున్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ అయిన తొలి యాక్టర్, దర్శక నిర్మాత మందడి ప్రభాకర్‌రెడ్డి. భీష్మ చిత్రంలో శంతనుడి పాత్రని, పాండవ వనవాసంలో కర్ణుడు పాత్రను పోషించాక నటన మీద ఉన్న ఆసక్తితో చిత్రరంగంలోనే నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నారు. పౌరాణిక చిత్రాలైన నర్తనశాలలో కర్ణుడుగా, శ్రీరామ పట్టాభిషేకంలో దశరథుడుగా, శ్రీకృష్ణావతారంలో బలరాముడుగా, శ్రీ కృష్ణార్జున యుద్ధంలో శివుడిగా, శ్రీ దత్త దర్శనంలో అత్రిమహామునిగా నటించి ప్రశంసలు పొందారు. మహామంత్రి తిమ్మరుసులో వీరభద్ర గజపతిగా, పల్నాటి యుద్ధంలో కన్నమదాసుగా, విశ్వనాథ నాయకుడులో తిమ్మరుసుగా, ఇంకా అల్లూరి సీతారామరాజు వంటి చారిత్రక చిత్రాలలో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు. రణభేరి, మెరుపు దాడి వంటి జానపద చిత్రాల్లో నటించారు.

మా చెడ్డ విలన్‌గా వణికించి!

విలన్‌గా కోరమీసంతో, నోట్లో పైప్‌తో, లాంగ్ కోటు, ఫెల్ట్ హేట్ ధరించి పాలిష్ట్‌ విలన్‌గా అట్టహాసంగా అరిచి, బెదిరిపోయేలా నవ్వి, మెత్తగా మాట్లాడుతూ ఇష్టం లేని వాడిని కత్తితో కసుక్కున పొడిచేసి, లేదా పిస్తోలుతో ఢాం అని పేల్చేసి మా చెడ్డ విలన్, దుర్మార్గుడు అనిపించుకున్నారు. పునర్జన్మ, నవరాత్రి, ఉమ్మడి కుటుంబం, బ్రహ్మచారి, ఆత్మీయులు, పెత్తందార్లు, మట్టిలో మాణిక్యం, సంసారం సాగరం, యమగోల, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, తీర్పు, ఏడంతస్తుల మేడ, ప్రేమాభిషేకం, పండంటి కాపురం, అంతిమ తీర్పు, కల్పన, ప్రతిభావంతుడు వంటి సాంఘిక చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు.

హిందీ చిత్రాల్లో సైతం నటించి..

హిమ్మత్, మాంగ్‌భలే సజనా , మేరీసాథీ, హిమ్మత్ ఔర్ మెహనత్, వక్త కా షెహన్ షా మొదలైన హిందీ చిత్రాలలో నటించారు. ఉత్తమ చిత్ర కథా రచయితగా గృహ ప్రవేశం (1982), గాంధీ పుట్టిన దేశం (1970) చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. చిన్న కోడలు చిత్రానికి ఉత్తమ సహాయ నటుడుగా 1990లో నంది అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటుడుగా అంతకుముందు ‘యువతరం కదిలింది’ చిత్రానికి 1980లో 'పల్లె పిలిచింది' చిత్రానికి 1981లో లెఫ్టిస్టుగా పాత్ర పోషించి మెప్పించినందుకు నంది అవార్డు అందుకున్నారు. ‘పండంటి కాపురం’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 1972లో అవార్డు లభించింది.

చివరి చిత్రం 'కామ్రేడ్'

చిన్నతనం నుంచి జీవిత చరమాంకం వరకు కాంగ్రెస్ అభిమానిగానే కొనసాగారు. రాజకీయంగా ప్రభావంతమైన సినిమాల్ని తీసే ప్రయత్నం చేశారు. ‘మండలాధీశుడు’ ‘గండిపేట రహస్యం’ ‘ప్రచండ భారతం’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'కామ్రేడ్' తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన రీ రికార్డింగ్‌కి రాత్రి సమయంలో చాలాసేపు పనిచేసి, ఇంటికొచ్చి నిద్రపోయి, తెల్లవారి మన వరాలితో ఆడుకుంటూ హఠాత్తుగా గుండెపోటుకు గురై 1997 నవంబర్ 26న అంతిమ శ్వాస తీసుకున్నారు.

(గద్దర్ అవార్డుల్లో భాగంగా వినోదాత్మక సినిమాకు ప్రభాకర్ రెడ్డి పేరిట అవార్డును ఇస్తున్న సందర్భంగా)

- వారాల ఆనంద్

94405 01281

Next Story