న్యాయవాద విద్య... భవిష్యత్తుకు బాట!

by Ravi |   (  Updated:2025-09-13 01:00:58  IST  )

ఒకప్పుడు కేవలం కోర్టు గదులకే పరిమిత మైన 'బ్లాక్ కోట్' వృత్తి, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం నుండి టెక్నాలజీ రంగం వరకు విస్తరించింది.

న్యాయవాద విద్య... భవిష్యత్తుకు బాట!
X

ఒకప్పుడు కేవలం కోర్టు గదులకే పరిమిత మైన 'బ్లాక్ కోట్' వృత్తి, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం నుండి టెక్నాలజీ రంగం వరకు విస్తరించింది. ఆధునిక యుగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తితో సమానంగా గౌరవం, ఆదాయం ఉన్న వృత్తిగా న్యాయవాద వృత్తి మారింది. ఈ రంగంలో కొత్త కోర్సులు, కార్పొరేట్ ఉద్యోగాలు, కన్సల్టెన్సీ అవకాశాలతో ఈ వృత్తి మరింత ఆకర్షణీయంగా తయారైంది. అయితే, ఈ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువత ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఈ వృత్తిలో ఉన్న అవకాశాలు, సవాళ్లు, కోర్సుల వివరాలను తెలుసుకుందాం..

గతంలో న్యాయవాద వృత్తి అంటే కేవలం సివిల్ లేదా క్రిమినల్ కేసులకు పరిమితమైనదని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త కొత్త రంగాల్లో న్యాయపరమైన సలహాల అవసరం పెరిగింది. ముఖ్యంగా ‘కార్పొరేట్‌ లా’ కు డిమాండ్ పెరిగింది. కంపెనీల విలీనాలు, ఒప్పందాలు, మేధో సంపత్తి హక్కులు, పన్నుల వ్యవహారాలు వంటి వాటిని కార్పొరేట్ లాయర్లు చూసుకుంటారు.

ఎన్నో అవకాశాలు..

తెలుగు రాష్ట్రాల్లో బహుళజాతి కంపెనీలు పెరగడంతో ఈ రంగంలో అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. వీటితో పాటు, కన్సల్టెన్సీ అనేది ఒక ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పర్యావరణ చట్టాలు, టెక్నాలజీ రంగాల్లో ఈ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంది. అలాగే, ప్రభుత్వ రంగంలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాది వంటి హోదాల్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షలు రాసి జడ్జిలుగా కూడా స్థిరపడవచ్చు. కొత్త తరం న్యాయవాదులకు మరిన్ని వినూత్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రెండు వేర్వేరు దేశాలకు చెందిన కంపెనీల మధ్య వ్యాపార వివాదాలు తలెత్తినప్పుడు, కోర్టులకు వెళ్లకుండానే పరిష్కరించే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగం కూడా మంచి భవిష్యత్తును అందిస్తుంది.

కొత్త చట్టాలను రూపొందించవచ్చు!

ఈ కోర్సు చదవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది 3-సంవత్సరాల ఎల్.ఎల్.బి, ఇది ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాత చదవగలిగే కోర్సు. రెండోది 5-సంవత్సరాల ఎల్.ఎల్.బి. దీనిని ఇంటర్మీడియట్ తర్వాత నేరుగా చేయవచ్చు. డిగ్రీతో కలిపి ఉండే ఇంటిగ్రేటెడ్ కోర్సు. 5-సంవ‌త్సరాల కోర్సులో థియరీతో పాటు మూట్ కోర్టులు (Moot Courts), ఇంటర్న్‌షిప్స్ ద్వారా ప్రాక్టికల్ అనుభవం ఎక్కువగా లభిస్తుంది. ఇంటర్మీడియట్ తర్వాతే వృత్తిలోకి రావాలని నిర్ణయించుకున్న వారికి 5-సంవత్సరాల కోర్సు ఉత్తమం. ఎల్.ఎల్.బి. తర్వాత ఉన్నత విద్య కోసం ఎల్.ఎల్.ఎం. చేయవచ్చు. ఇది మీ నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలలో, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశాలను కూడా అంది స్తుంది. ఇక పరిశోధనపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి న్యాయ కళాశాలల్లో అధ్యాపక వృత్తిని కూడా ఎంచుకోవచ్చు. ఇది కేవలం అకాడెమిక్స్ కోసం మాత్రమే కాదు, ఇది చట్టాలను బలోపేతం చేయడానికి, కొత్త చట్టా లను రూపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. పీహెచ్‌డీ లేదా లీగల్ రీసెర్చ్ ఫెలోషిప్స్ చేయడం ద్వారా ఒక నిర్దిష్ట చట్టంపై లోతైన అధ్యయనం చేసి, ప్రభుత్వాలకు, సంస్థలకు సలహాలు ఇవ్వవచ్చు.

ప్రాక్టికల్ నైపుణ్యాలు ముఖ్యం..

న్యాయవాద వృత్తిలో సిద్ధాంత జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు చాలా అవసరం. విద్యార్థి దశ నుంచే ఈ నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలి. కోర్టు వ్యవహారాలను, కేసుల ఫైలింగ్‌ను, కక్షిదారులతో మాట్లాడే విధానాలను తెలుసుకోవాలి. మంచి నెట్‌వర్కింగ్ ద్వారా సీనియర్ లాయర్లతో పరిచయాలు ఏర్పరచుకొని వారి వద్ద ఇంటర్న్‌షిప్‌లు చేయడం వల్ల ఈ రంగంలో మంచి అవగాహన లభిస్తుంది. ప్రో బోనో (Pro Bono) సేవలు అందించడం, అంటే పేదవారికి ఉచిత న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వృత్తికి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తిలో విజయానికి కమ్యూనికేషన్, వాదన నైపుణ్యాలు చాలా ముఖ్యం. స్పష్టంగా, సంక్షిప్తంగా, ఆత్మ విశ్వాసంతో వాదించడం ద్వారా కేసులో గెలుపొందే అవకాశాలు పెరుగుతాయి. అలాగే, సమస్యను విశ్లేషించి, సరైన నిర్ణయం తీసుకునే విశ్లేషణాత్మక నైపుణ్యాలు కూడా అవసరం. న్యాయవాద వృత్తి కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు, ఇది సమాజానికి సేవ చేసే ఒక గొప్ప మార్గం. సామాజిక మార్పుకు, పౌరుల హక్కుల పరిరక్షణకు, పేదలకు న్యాయం అందించడానికి న్యాయవాదులు ఒక బలమైన వంతెనలా నిలబడగలరు.

-డా.కట్కూరి

సైబర్ సెక్యురిటీ న్యాయ నిపుణులు.

94909 34520

Next Story