- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాభా ఎక్కువ.. అధికారం తక్కువ..
తెలంగాణ కులగణన వెలుగులో బీసీ, ఎస్సీ, ఎస్టీల సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనం, అధికార భాగస్వామ్యం, భూమి-సంపద పంపిణీపై సమగ్ర విశ్లేషణ. అంబేద్కర్ ఆలోచనల దిశగా సామాజిక న్యాయ పోరాటంపై కథనం.

భారతదేశంలో రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా, సామాజిక వాస్తవం మాత్రం ఇంకా కుల పునాదుల చుట్టూనే తిరుగుతోంది. కులం చట్టాల్లో బలహీనపడినా, సమాజపు మన స్తత్వాల్లో మాత్రం ఇంకా బలంగా వెళ్లానూకొని ఉంది. శతాబ్దాలుగా దేశ సంపద, భూమి, అధికారం కుల కేంద్రంగానే కేంద్రీకృతమై ఉండటం ఈ అసమానతలకు ప్రధాన కారణం.
కులగణన చెప్పిన సామాజిక వాస్తవాలు..
ఈ దేశంలో సామాజిక, ఆర్థిక సమానతలు ఎత్తి చూపిన మొట్టమొదటి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. సమానత్వమే సామాజిక మార్పుకు పునాదిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించాడు. ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో ప్రతి తలను లెక్కించి వనరుల సమ పంపిణీ చేయడమే రాజ్యాంగ మూల సూత్రం. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. అసలు జనాభా నిర్మాణాన్ని బయటపెట్టింది. మొత్తం జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీల వాటా 84.2 శాతం ఉందని, ఒక్క బీసీలే 56.4 శాతంతో అత్యధిక జనాభా కలిగిన సమూహంగా నిలిచారని నివేదిక పేర్కొంది. ఎస్సీలు 17.4 శాతం, ఎస్టీలు 10.4 శాతం, ఓసీలు 11.9 శాతం ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలో 36 లక్షల జనాభాతో మాదిగలు పెద్ద కులంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ వివక్షను అనుభవిస్తూ అన్ని రంగాల్లో అట్టడుగున ఉన్నారు.
ఎస్సీలు, ఎస్టీల్లో 95 శాతం వెనుకబాటుతనం..
మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు జనాభా పరంగా మెజార్టీగా అయినప్పటికీ...సామాజిక, ఆర్థిక వెనుకబాటును గురైనారనీ 42 అంశాలతో రూపొందించిన కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్ (సీబీఐ) లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఓసీల వెనుకబాటుతనం సూచిక 31 పాయింట్లుగా ఉంటే, ఎస్సీలది 96, ఎస్టీలది 95 పాయింట్లుగా ఉంది. అంటే అగ్రకులాల కంటే ఎస్సీ, ఎస్టీలు మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నారు. అలాగే బీసీల వెనుకబాటుతనం 86 పాయింట్లు ఉండగా, రాష్ట్ర సగటు 81 పాయింట్లుగా నమోదైంది. పట్టణీకరణ పెరిగినప్పటికీ కుల వివక్ష తగ్గలేదని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక వెనుకబాటుతనం మధ్య అంతరం అలాగే ఉందని నివేదిక పేర్కొన్నది. ఈ క్రమంలో జనాభా దామాషా ప్రకారం ఈ భూమి, సంపద, అధికారం పంపిణీ జర గాలనే డిమాండ్ మొదలైనది.
అధికార భాగస్వామ్యం దక్కకపోతే?
ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ఉన్నవారికి అధికార భాగస్వామ్యం దక్కకపోతే, ఆ ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఉత్పత్తి రంగాల్లో భాగమై ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్నారు. కానీ సంపద, భూమి, పరిశ్రమలు, వ్యాపారం, అధికారం, విద్య, వైద్యం వంటి సమస్త రంగాలు ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ అసమానతలను ప్రశ్నిస్తూ డాక్టర్ విశారదన్ ఇప్పటికే వేల కిలో మీటర్ల పాదయాత్రలు చేసి అణగారిన ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. తెలంగాణ గడ్డపై భూమి, అధికారంలో, అవకాశాల్లో, నిర్ణయాధికారంలో వాటా కోసం గతేడాది ప్రారంభించిన లక్ష కిలోమీటర్లమా భూమిరథ యాత్ర అగ్ని జ్వాలలా వ్యాపించింది. ఈ ఉద్యమ ప్రభావం మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
ఈ సభలు సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి..
బీసీ ఎస్సీ ఎస్టీలు 80 శాతానికిపైగా విజయాలు సాధించడం ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు విశారదన్ మహారాజ్ ఎవరి కులం ఎంతో వారికంత వాటా పేరుతో వివిధ జిల్లాలలో నిర్వహిస్తున్న బహిరంగ సభలు సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి. ఇది సామాజిక న్యాయం కోసం అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ యుద్ధంగా సాగుతుంది. భూమిలో, బడ్జెట్‌లో, ఉద్యోగాల్లో, పరిశ్రమల్లో, రాజకీయ నాయ కత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాలనే మహా పోరాటం ఇదీ. తెలంగాణలో మొదలైన ఈ పోరాటం రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక చరిత్రను తిరగరాసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు పూలే, అంబేడ్కర్, కాన్సిరాం ఆలోచనతో ఏకమై ఓటు అనే ఆయుధంతో బహుజన శక్తిగా మారాలి.
-సంపతి రమేష్
7989579428






