- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోలార్ ముసుగులో భూదందా.. మాజీ విప్లవకారుల భుజంపై 'కార్పొరేట్' తుపాకీ!
తెలంగాణలో సోలార్ కంపెనీల పేరుతో రైతుల భూములపై జరుగుతున్న లీజు మోసాలు, NOCల దుర్వినియోగం, భూస్వామ్య హక్కులపై పెరుగుతున్న ప్రమాదాలపై ప్రత్యేక కథనం.

తెలంగాణ గడ్డపై ఒకప్పుడు ‘దున్నేవాడికే భూమి’ అని గర్జించిన స్వరాలు, నేడు తెలియకుం డానే బడా పెట్టుబడిదారుల ‘భూసేకరణ’ ఉచ్చులో చిక్కుకుంటున్నాయా? సోలార్ కంపెనీల పేరుతో గ్రామాల్లోకి చొరబడు తున్న కొన్ని డొల్ల కంపెనీలు, రైతుల భూములను లాగేసుకునేందుకు పన్నుతున్న వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ముఖ్యంగా సమాజంలో గౌరవం ఉన్న మాజీ పీపుల్స్ వార్, మావోయిస్టు కార్యకర్తల పలుకుబడిని అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ మాయాజాలాన్ని తెలంగాణ పౌర సమాజం గమనించాల్సిన అవసరం ఉంది.
మాజీల వాడకం - ఒక మోసపూరిత వ్యూహం!
గత కొన్నేళ్లుగా వరంగల్, నల్గొండ, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో మాజీ విప్లవకారులతో సమావేశాలు నిర్వహిస్తూ, వారికి ఉపాధి కల్పిస్తామనే మాయమాటలతో ఈ కంపెనీలు నమ్మిస్తున్నాయి. ఇదే సోలార్ కంపెనీ పేరుతో గతంలో వరంగల్, ములుగు ప్రాంతాలలో జరిగిన ఒక సమావేశంలో మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న @ జీనుగు నరసింహ రెడ్డి కొందరు మాజీలను సమీకరించిన సందర్భంలో, ఈ వ్యవహారం సరైనది కాదని నేను స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేశాను.. అయినప్పటికీ నేడు ఇటీవల లొంగిపోయిన పుల్లూరు ప్రసాద్ రావు @ చంద్రన్న కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారనే సమాచారం వెలువడుతోంది. జంపన్న వంటి మాజీ కీలక నేతల పేర్లను, తాజాగా లొంగిపోయిన చంద్రన్న వంటి వారి సమక్షాన్ని వాడుకుంటూ రైతుల నుంచి NOC (నిరభ్యంతర పత్రాలు) సేకరించడమే వీరి ప్రధాన లక్ష్యం. ప్రజల హక్కుల కోసం అడవిలో పోరాడిన వారు, నేడు కార్పొరేట్ శక్తుల చేతిలో పావులుగా మారి రైతు వ్యతిరేక శక్తులుగా ముద్ర పడటం గమనార్హం.
సోలార్ లీజు ఒప్పందాలు..
భారతీయ చట్టాల ప్రకారం, భూమిని లీజుకు ఇవ్వడం అనేది కేవలం ఒక అగ్రిమెంట్ మాత్రమే కాదు, అది భూమిపై ఉన్న స్వాధీనం హక్కును బదిలీ చేయడం. దీనికి సంబంధించి ప్రధానమైన చట్టపరమైన అంశాలు ఇవి.. ఈ సోలార్ ఒప్పందాల వెనుక ఉన్న లీగల్ అంశాలు భయం కరంగా ఉన్నాయి. భారతీయ చట్టాల ప్రకారం ఇవి రైతులకు ఉరితాడుగా మారే ప్రమాదం ఉంది. చట్టపరంగా 12 నుండి 13 ఏళ్ల పాటు ఒక వ్యక్తి లేదా సంస్థ ఒక భూమిని నిరంతరాయంగా తమ ఆధీనంలో ఉంచుకుంటే, అది 'అడ్వర్స్ పొసెషన్' కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే భవిష్య త్తులో దానిపై పూర్తి హక్కులను క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది.
25 ఏళ్ల ఒప్పందమంటే.. భూమి కోల్పోవడమే!
25 ఏళ్ల లీజు అంటే రైతు తన భూమిపై నియంత్రణను శాశ్వతంగా కోల్పోవడమే. ఒకవేళ లీజు అగ్రిమెంట్‌లో నిబంధనలు అస్పష్టంగా ఉంటే, భవిష్యత్తులో ఆ భూమిని తిరిగి పొందడానికి రైతు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. 25 ఏళ్ల ఒప్పందం రైతును మానసికంగా, ఆర్థికంగా ఆ భూమి నుండి దూరం చేస్తుంది. చట్టం ప్రకారం భూమి రైతు పేరిటే ఉన్నా, దానిపై 'ఉపయోగించే హక్కు', 'ఆదాయం పొందే హక్కు' పూర్తిగా కంపెనీ పరమవుతాయి. జాగ్రత్త పడాల్సిన అంశం ఒకటుంది. లీజు అగ్రిమెంట్‌పై సంతకం చేసే ముందు అది కేవలం 'లీజు' మాత్రమేనా లేక 'సబ్-లీజు' లేదా 'పవర్ ఆఫ్ అటానీ' హక్కులను కూడా కంపెనీకి కట్టబెడుతున్నామా? అనేది అత్యంత కీలకం.
NOCల వెనుక అసలు కథ!
సోలార్ కంపెనీలు రైతుల నుంచి తీసుకునే NOCలను చూపించి బ్యాంకుల నుంచి భారీ రుణాలు పొందుతాయి. ఒకవేళ కంపెనీ దివాలా తీస్తే, బ్యాంకులు ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాయి.. అప్పుడు రైతుకు ఆ భూమిపై ఎటువంటి హక్కు ఉండదు. ఈ అగ్రిమెంట్లు ఏకపక్షంగా ఉంటున్నాయి. కంపెనీ ఎప్పుడైనా వెళ్లిపోవచ్చు, కానీ రైతు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే భారీ పెనాల్టీలు కట్టాలి. ఇది పరోక్షంగా 'బానిస ఒప్పందం'.
ముఖ్యమంత్రి స్పందించి విచారణ జరపాలి!
సాంకేతిక పరిజ్ఞానం లేని గ్రామీణ యువతకు ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, వారి ఆధార్, పాన్ కార్డులను సేకరిస్తున్నారు. ఈ వివరాలను కేవలం బ్యాంకుల నుండి లోన్లు పొందడానికి 'డాల్స్' లాగా వాడుకుని, ఆ తర్వాత యువతను రోడ్డుపై పడేస్తున్నారు. ఇది కేవలం భూమిపైనే కాదు, తెలంగాణ యువత భవిష్యత్తుపై జరుగుతున్న దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలి. ఇప్పటికే 'ధరణి' లోపాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు ఈ సోలార్ కంపెనీల ఆగడాలపై సమగ్ర విచారణ జరిపించి, రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి. రెవెన్యూ శాఖ ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలి.
మాజీలు.. మీ గౌరవాన్ని తాకట్టు పెట్టకండి!
చివరగా.. సోలార్ విద్యుత్తు అవసరమే, కానీ అది రైతుల గొంతు కోసి బడా కంపెనీల జేబులు నింపేదిగా ఉండ కూడదు. మాజీ విప్లవకారులు తమ సామాజిక గౌరవాన్ని ఇలాంటి కంపెనీల కోసం తాకట్టు పెట్టకండి. తెలంగాణ పౌర సమాజం, మేధావులు ఈ నయా భూస్వామ్య దోపిడీపై పోరాడాల్సిన సమయం ఇది.
- బండి దుర్గా ప్రసాద్
సామాజిక విశ్లేషకులు
79811 84205






