సరిహద్దు అంచున లడాఖ్ సంక్షోభం.. దేశ ఐక్యతకు పరీక్ష!

by Ravi |   (  Updated:2025-09-28 01:15:28  IST  )

లడాఖ్‌లో హింస రగులుతోంది. లెహ్ నగరం కాలిపోతోంది. 2025 సెప్టెంబర్ 24న బీజేపీ కార్యాలయం ధ్వంసమైంది. పోలీసు వాహనాలు బూడిదయ్యాయి.

సరిహద్దు అంచున లడాఖ్ సంక్షోభం.. దేశ ఐక్యతకు పరీక్ష!
X

లడాఖ్‌లో హింస రగులుతోంది. లెహ్ నగరం కాలిపోతోంది. 2025 సెప్టెంబర్ 24న బీజేపీ కార్యాలయం ధ్వంసమైంది. పోలీసు వాహనాలు బూడిదయ్యాయి. ఐదుగురు మరణించారు. 50 మందికి గాయాలు అయ్యాయి. ఆ ప్రాంత జెన్-జెడ్ యువత తమకు కేంద్ర పాలిత ప్రాంతానికి బదులుగా ప్రత్యేక రాష్ట్రం కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 6వ, షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతున్నారు..

వారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అందుకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు, తమ భూములపై తమకే హక్కులు ఉండాలని అడుగుతున్నారు. తమ గిరిజన సంస్కృతికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు కాదు. ఇవి వారికి ఎదురైన నిత్య జీవన సమస్యలు. వారి డిమాండ్స్‌లో న్యాయం ఉంది.

చారిత్రక నేపథ్యం..

1947లో లడాఖ్ భారత్‌లో చేరింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భాగమైంది. వారికి ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. బీజేపీ హయాంలో 2019లో పెను మార్పులు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దయింది. లడాఖ్ యూనియన్ టెరిటరీగా మార్పు చెందింది. జమ్మూ కశ్మీర్ నుంచి విడిపోయింది. ప్రజలు ఈ మార్పును స్వాగతించారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి అనేక రక్షణ, అభివృద్ధి వాగ్దానాలు చేసింది. కానీ ఆచరణలో వారి స్వయం ప్రతిపత్తి (అటానమీ) పోయింది. వారి భూమికి భద్రత లేదు. ఉద్యోగాలు బయట వారికి వెళ్లాయి. కొత్త ఉద్యోగాలు రాలేదు. సరికదా ఉన్న ఉద్యోగాలే పోతున్నా యి. స్థానిక ప్రజల జీవనం ప్రమాదంలో పడింది.

వారి ప్రధాన డిమాండ్‌లు..

కేంద్ర పాలిత ప్రాంతం నుండి స్వ రాష్ట్రం కావాలి అనేది వారి తొలి కోరిక. రెండోది వారిని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలి. ట్రైబల్ ప్రొటెక్షన్, జాబ్ రిజర్వేషన్లు కల్పించాలని. మూడో డిమాండ్ రెండు పార్లమెంట్ సీట్లను లడాఖ్‌కు కేటాయించాలని, నాలుగో డిమాండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఐదో డిమాండ్ గిరిజన భాష, సంస్కృతికి రక్షణ కల్పించాలని, లడాఖ్ భూములు స్థానిక గిరిజనులకే చెందాలి.. మొదలైనవి వారి ప్రధాన కోర్కెలు.. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వారికి సానుకూల ప్రతిస్పందన లభించలేదు.

ప్రస్తుత పరిణామాలు..

2025 సెప్టెంబర్ 10న సోనమ్ వాంగ్ చుక్ (35) వారి డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి పంపారు. ఆయనతో పాటు 15 మంది దీక్షలో చేరారు. 15 రోజులు గడిచాయి. సెప్టెంబర్ 23న నిరాహార దీక్షలో ఉన్న మరో ఇద్దరి ఆరోగ్యం దిగజారింది. హాస్పిటల్‌‌కు తరలించారు. అందుకు నిరసనగా అక్కడ ‘లెహ్ ఆపెక్స్ బాడీ’ యూత్ వింగ్ సెప్టెంబర్ 24న లడాఖ్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. మార్టిర్స్ పార్క్‌లో సోనమ్ వాంగ్ చుక్ స్పీచ్‌తో ‘జెన్-జెడ్ రెవల్యూషన్’ వైపు యువత మమేకం అయ్యారు. యువత ఆగ్రహంతో ముందుకు కదిలింది. మాబ్ హింస చెలరేగింది. బీజేపీ ఆఫీస్‌ను ధ్వంసం చేశారు. దీంతో బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఫైరింగ్ వేగంగా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. 4గురు మరణించారు. 80 మందికి గాయాలు తగిలాయి. 30 మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడ్డారు. కర్ఫ్యూ విధించారు. 50 మందికి పైగా ఉద్యమ నేతలను గ్రహ నిర్బంధం చేశారు..

రెచ్చగొడితేనే హింస చెలరేగిందా?

సెప్టెంబర్ 25 నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది. సెక్యూరిటీ భారీగా ఉంది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ సోనమ్ వాంగ్ చుక్ రెచ్చగొట్టే ప్రకటనల వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. ‘పొలిటికల్ మోటివేటెడ్’ అని కేంద్ర ప్రభుత్వం అంటుంది. సమస్యల పరిష్కారానికి చర్చల కమిటీ మీటింగ్ అక్టోబర్ 6న జరపాలని కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని నిరసనకారులు అంటున్నారు. 84 శాతం రిజర్వేషన్, 1/3 విమెన్ కోటా, భోటి, పుర్గి అఫీషియల్ భాషలు, 1800 ఉద్యోగాలు. అని ప్రతిపాదనలు వినవస్తున్నాయి. కానీ ఇవి సరిపోవు అని విపక్షాలు అంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి తొలి హెచ్చరిక..

చివరిగా.. లడాఖ్ హింస కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఇది భారతదేశ ‘ఐక్యతకు’ పరీక్షా సమయం. అక్కడి సమస్యలను పరిష్కరించకపోతే, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు పెల్లుబుకుతాయి. ఇప్పుడు ప్రపంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లో యువత లేవనెత్తిన అనేక ఉద్యమాలను చూశాం. ఆ ఉద్యమాలకు ఒక ప్రత్యేక రాజకీయ నాయకత్వం లేదు. కేవలం యువకుల నిరాశా, నిస్పృహల నుండి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. వారికి రాజకీయ నాయకులు అంటే ఏహ్యభావం ఉంది. ఆ నాయకులు అధికార పక్షమా? ప్రతిపక్షమా? అని తేడా చూడటం లేదు. హింసకు, విధ్వంసానికి పాల్పడు తున్నారు. కనుక వారి ఇబ్బందులు గమనించి కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజలతో సంభాషణలు జరిపి వారిని అభివృద్ధి పరచడం ద్వారా, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లడాఖ్ మళ్లీ శాంతి, సమృద్ధి చిహ్నంగా మారవచ్చు. ఇది కేవలం ఒక ప్రాంతం కాదు. దేశ భవిష్యత్తుకు చెందిన కీలక భాగం.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్

98493 28596

Next Story