- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కె.ఎల్ సైగల్ స్వరం.. ఓ మధురమైన చరిత్ర
కె.ఎల్. సైగల్ కేవలం గాయకుడు కాదు. భారతీయ సినిమాకు గొంతుకను అందించిన తొలి ప్రతిధ్వని. ఇవాళ కూడా ఆయన పాట వినిపిస్తే మనసు ఒక పాత గ్రామ్‌ఫోన్‌లా మెల్లగా తిరుగుతుంది. సైగల్ గొంతు కాలం చెరపలేని స్వరం.

కె.ఎల్. సైగల్ కేవలం గాయకుడు కాదు. భారతీయ సినిమాకు గొంతుకను అందించిన తొలి ప్రతిధ్వని. ఇవాళ కూడా ఆయన పాట వినిపిస్తే మనసు ఒక పాత గ్రామ్‌ఫోన్‌లా మెల్లగా తిరుగుతుంది. సైగల్ గొంతు కాలం చెరపలేని స్వరం. ఆయన గానం ఏదో ఒక కాలానికి బందీ కాదు. అది భారతీయ చిత్ర సంగీతానికి మూలాధారం.
సైగల్ స్వరం ఓ మధురమైన చరిత్ర. సైగల్ గీతాల ప్రత్యేకత ఏమిటంటే ఆయన శాస్త్రీయ రాగాలకు సినీ రూపం ఇచ్చాడు.. ప్రత్యక్ష గానాన్ని తెరపై వినిపించాడు. తొలి రోజుల్లో రికార్డింగ్ టేప్ లేని కాలంలో ముందు ఆయన పాట పాడుతూ వెళ్తూ వుంటే పక్కన బగ్గీపై వాయిద్య కారులు వాయిస్తూ వుండేవారు. కెమరానేమో గాయకుడు, నటుడు అయిన సైగల్‌ని ఆయన గానాన్ని సంగీతాన్ని షూట్ చేస్తూ వెళ్లేది. ఆకాలం నుంచి సైగల్ నట గాయకుడి గా నిలబడ్డాడు.. అంతే కాదు గానం అంటే కేవలం స్వరం మాత్రమే కాదు అది ‘భావం’ అని సైగల్ నిరూపించాడు. ఖయాల్, ఘజల్, భజన్, గీత్, దాద్రా లాంటి అన్ని ప్రక్రియల్లో అసమాన నైపుణ్యంతో పాడాడు. కె. ఎల్. సైగల్ భారతీయ గాయక నటుల్లో తొలి సూపర్‌స్టార్.
సినిమాను శాసించిన సూపర్ స్టార్..
కె.ఎల్. సైగల్ భారతీయ సినిమాను శాసించిన ఒక మహా సూపర్‌స్టార్. హిందీ చిత్రసీమలో ఆయన పాడిన పాటలు సాధించిన విజయాల గురించి ఇవ్వాళ చాలామందికి తెలియక పోవచ్చు. సంగీత ప్రియుల మనస్సులో ఆయన మాయ, ఆయన ఆకర్షణ ఇవాళ్టికీ సజీవంగానే ఉంది. కొత్త తరాల కళాకారులకు ప్రేరణగా నిలుస్తూనే ఉంది. తలత్ మహమూద్, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి ఎంతోమంది గాయకులకు ఆదర్శంగా నిలిచారు.. అనేకమంది మొదట ఆయన శైలిని అనుకరించిన వారే, తరువాత తమ స్వరాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చుకున్నారు. ఆయన పాటలు నేటికీ సంగీతాభిమానుల హృదయాల్లో మోగుతూనే ఉన్నాయి. సైగల్ 11 ఏప్రిల్ 1904న జలంధర్‌లో జన్మించాడు.. ఆయన తండ్రి అమర్‌చంద్ సైగల్ తల్లి కేసర్‌బాయి. తనకి భక్తి సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. చిన్న వయసులోనే ఆమెతో కలిసి సుఫీ పీర్ సల్మాన్ యూసఫ్ వద్దకు వెళ్తూ భజనలు, కీర్తనలు వింటూ ఉండేవాడు. ఆయన తండ్రి అమర్‌చంద్ సైగల్ జమ్మూ మహారాజా ప్రతాప్ సింగ్ కోర్టులో పనిచేసేవారు. అయితే సైగల్ చదువును మానేసి సంగీతాన్ని ఎంచుకోవడం తండ్రికి నిరాశ కలిగించింది. ఒకసారి తన 13 ఏళ్ల వయసులో స్వరం మారిపోవడంతో సైగల్ నెలల తరబడి మౌనంగా ఉన్నాడు. ఒక సన్యాసి సలహా మేరకు కఠిన సాధన ప్రారంభించాడు. ఫయ్యాజ్ ఖాన్, పంకజ్ ముల్లిక్, పహారి సన్యాల్ వంటి మహాగాయకుల ప్రోత్సాహం కూడా లభించింది. ఆయన ఎప్పుడూ శాస్త్రీయంగా శిక్షణ పొందలేదు కాని తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నాడు.
ఏమీ తెలీదు... ఎలా ఉద్యోగం ఇవ్వాలి?
ఒకసారి ఆయన గానం విన్న హిందుస్థాన్ రికార్డ్ కంపెనీ ప్రతినిధి ఆయన ప్రతిభను గుర్తించి రికార్డింగ్ ఒప్పందం కుదిర్చాడు.“ఝులనా ఝులావో’ అనే మొదటి రికార్డు పెద్ద విజయం సాధించింది. రేమింగ్టన్ కంపెనీలో వివాదం కారణంగా ఉద్యోగం వదిలేసి మిత్రుడి సలహా మేరకు అప్పుడు సినీ కేంద్రమైన కలకత్తా చేరుకున్నాడు. భాష తెలీదు ఎవరూ పరిచయం లేదు అయినా మొండిగా వెళ్లాడు. అక్కడ పి.సి.బోరల్, పంకజ్ మల్లిక్ సైగల్‌ని కలకత్తాలో న్యూ థియేటర్ యజమాని బి.ఎన్. సిర్కార్‌కు పరిచయం చేసారు.. బెంగాలీ రాదు, శాస్త్రీయ సంగీతం తెలీదు ఇతనికి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలని సర్కార్ సంశయించాడు కాని బోరల్ ఇచ్చిన నమ్మకంతో నెలకు 200 రూపాయల జీతంతో న్యూ థియేటర్స్ స్టూడియోలో చేరాడు.
దేవదాస్ సినిమాతో శాశ్వత కీర్తి!
మొదట నటుడిగా రావడానికి ఇష్టపడకపోయినా, తరువాత ఒప్పుకున్నాడు. 1932లో ‘మొహబ్బత్ కే ఆంసు’, ‘సుభహ్ కా సితారా’ ‘జిందా లాష్’ చిత్రాలతో తెరమీదికి ప్రవేశించాడు. కాని మొదట్లో మూడు అపజయాల్ని చవిచూసాడు. తర్వాత తొలి విజయం 1933లో వచ్చిన ‘పూరన్ భగత్”. ఆ చిత్ర సంగీత దర్శకుడు ఆర్.సి. బోరాల్ శాస్త్రీయ సంగీతాన్ని లోకగీతాలతో కలిపి వినూత్న శైలిని అందించాడు.1934లో ‘చండీదాస్’తో భారీ విజయాన్ని సాధించాడు. తరువాత 1935లో వచ్చిన ‘దేవదాస్’ ఆయనను దేశవ్యాప్తంగా గొప్పతారగా నిలబెట్టింది. శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ నవల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఆయనకు శాశ్వత కీర్తి తెచ్చింది. ‘బాలమ్ ఆయే బసో’, ‘దుఖ్ కే అబ్ దిన్’, ‘జబ్ దిల్ హీ టూట్ గయా’ వంటి గీతాలు అమరగీతాలుగా నిలిచాయి. ఖయాల్, బందిష్, ఘజల్, గీత్, భజన్, హోరి, దాద్రా వంటి అనేక శైలుల్లో పాడాడు. హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాళీ, తమిళం తదితర భాషల్లో గానం చేశాడు. ‘దేవదాస్’లో మద్యం పాత్రధారణ ఆయన జీవితాన్నే ప్రభావితం చేసింది. అయితే ఆరోగ్యం క్షీణించి, 1947 జనవరి 18న కేవలం 42 ఏళ్ల వయసులో కన్నుమూశాడు.
వేదనకు గాత్రరూపం ఇచ్చిన అమరగీతం!
షాజహాన్ సినిమాలో నౌషాద్ సంగీతంలో ఆయన పాడిన ‘జబ్ దిల్ హీ టూట్ గయా’ విరిగిన హృదయాల అంతఃస్వరంగా నిలిచిన గీతం. సైగల్ తన మరణం తర్వాత అంత్యక్రియల సమయంలో ఈ పాట వినిపించాలని కోరినట్లు చెబుతారు. వేదనకు గాత్రరూపం ఇచ్చిన అమరగీతం అది. ఇక ‘దేవదాస్’లో ఆయన పాడిన ‘బాలమ్ ఆయే బసో మోరే మన మే’ ప్రేమలోని ఆర్తిని, నిరీక్షణను, మృదుత్వాన్ని ధ్వనించిన పాటగా చెప్పుకోవచ్చు. దేవదాస్ పాత్రలోని ఆత్మవేదన ఈ పాటలో స్పష్టంగా వినిపిస్తుంది.
-వారాల ఆనంద్
94405 01281






