కేజీ చదువులు.. పీజీ ఫీజులు...!

by Ravi |   (  Updated:2025-06-11 01:30:28  IST  )

ఖమ్మం నగరంలో ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ప్రారంభమైన ఓ విద్యా సంస్థ నర్సరీకే లక్షల రూపాయలకు పైగా వసూలు

కేజీ చదువులు.. పీజీ ఫీజులు...!
X

ఖమ్మం నగరంలో ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ప్రారంభమైన ఓ విద్యా సంస్థ నర్సరీకే లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలే లక్ష్యంగా ఏర్పడ్డ ఈ విద్యాసంస్థ కిండర్ గార్టెన్ చదువులకు పీజీ లెవల్లో ఫీజులు వసూలు చేయడం విస్మయం గొలుపుతుంది. యాజమాన్యాలు క్లాసులు చెప్పడానికి విద్యా సంస్థలను నెలకొల్పుతున్నాయా? లేదా కాసుల కోసం విద్యావ్యవస్థను వ్యాపారంగా మారుస్తు న్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మహానగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా విద్య వ్యాపారంగా మారడంతో గల్లీకో స్కూల్ వెలుస్తోంది. వీటి అనుమతులు విషయం ఎలా ఉన్నా.. 90 శాతం స్కూళ్లు అసలు పేరుతో పాటు తోక పేర్లు తగిలించుకుని నడుస్తున్నవే.

ఆ స్థాయి విద్య దొరుకుతుందా?

ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్కూళ్లు కేవలం మహానగరాలకే పరిమితమైతే.. ప్రస్తుతం అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు రకరకాల పేర్లు తగిలించుకుని వేల నుంచి లక్షలాది రూపాయలు గుంజుతున్నాయన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులు ఈ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించగలరా? ఇంతకీ ఈ స్కూళ్లలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య దొరుకుతుందా? ఆ స్ట్రేచర్ ఉన్న ఉపాధ్యాయ బృందం ఉంటుందా? అంటే కష్టమే.. యాజమాన్యాలు ఏర్పాటు చేసిందే ఫైనల్. ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ స్థాయి సిబ్బంది పర్యవేక్షణ ఏమీ ఉండదు. నగరాలు, జిల్లా కేంద్రాలలో ఇంటర్నేషనల్ పేరిట నడుస్తున్న అనేక స్కూళ్లలో కనీస సదుపాయాలు కూడా లేకుండానే నిర్వహిస్తున్నారు.

అడ్మిషన్లు లేవంటూనే..

సహజంగా విద్యా సంవత్సరం జూన్ రెండో వారంలో ప్రారంభమవుతుంది. అడ్మిషన్లు కూడా ఒక నెల ముందుగానో, లేదా ఎండాకాలం సెలవుల అనంతరమూ ఉంటాయి. కానీ రాష్ట్రంలో పేరుమోసిన అనేక విద్యాసంస్థలలో ఆరు నెలలు ముందుగానే అడ్మిషన్లు పూర్తయ్యాయని అక్కడి స్టాఫ్ చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. అడ్మిషన్ల కోసం వచ్చే పేరెంట్స్‌ను మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేసి ఒక్క క్షణం సమయం కూడా ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు అడ్మిషన్ కావాలంటే ఏదో ఒక కోటా కింద ఒకటో, రెండో సీట్లు ఉన్నాయని, వెంటనే అడిగినంత డబ్బు చెల్లిస్తే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పి పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నాయి. ఇంటర్నేషనల్, డిజీ, హైటెక్, ఒలింపియాడ్, ప్లే, స్మార్ట్, టెక్నో లాంటి పేర్లలో విద్యా వ్యాపారం చేస్తున్న స్కూళ్లు ప్రతీ ఏటా దూసుకుపోతుంటే దశాబ్దాలుగా కొనసాగుతున్న చిన్న స్కూళ్ల పరిస్థితి మాత్రం దారు ణంగా తయారైంది. 2014 - 2015‌లో తెలంగాణలో సుమారు 15,069 ప్రైవేట్ పాఠశాలలుంటే 2023-24 నాటికి వాటి సంఖ్య 12, 126‌కు పడిపోయింది. అంటే దాదాపు 2,‌943 స్కూళ్లు పోటీ ప్రపంచంలో తట్టుకోలేక, హైఫై సౌకర్యాలు ఏర్పాటు చేయలేక మూతపడిపోయాయి.

ఒక్క విద్యార్థిని పాఠశాలనే మార్చేసింది..

ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గత సంవత్సరం కీర్తన అనే నాలుగో తరగతి చదువుతున్న ఒక్క విద్యార్థిని మాత్రమే ఉండేది. ఆ విద్యార్థిని కోసం విధుల్లో ఒక టీచర్, ఇద్దరు సిబ్బంది పనిచేసేవారు. ఏడాదికి ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం 12.84 లక్షల రూపాయలు ఖర్చుచేసేది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ విద్యా సంవత్సరం దాదాపు 6 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రహరీ, సోలార్ ఫెన్సింగ్, గోడలపై ఆర్ట్స్, ‘వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్’ ల్యాబ్, సెవెన్ సీటర్ ఆటో ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 11 కు చేరింది. తల్లిదండ్రులలో మార్పు రావాలన్న ఆకాంక్షకు ‘ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటా’ అనే కీర్తన పట్టుదల తోడవడం, ప్రస్తుతం ఆ విద్యార్థిని కారణంగానే అక్కడ పాఠశాల మెరుగులు దిద్దుకుని కొందరు విద్యార్థులు బడి బాట పట్టడం హర్షించదగ్గ విషయం.

ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి..

ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అడ్డుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పోటీ వ్యవస్థను తట్టుకునే విధంగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను రూపొందించాలి. మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఇంటర్నెట్, లైబ్రరీ, ల్యాబ్స్, మెరుగైన ఫ్యాకల్టీతో పాటు స్మార్ట్ స్కూల్‌గా మార్చి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ పోస్టులను మెరిట్ ప్రాతిపదికన నింపాలి. ఆధునిక మెథడాలజీతో ఎప్పటికప్పుడు టీచర్లకు ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి. బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ చేయాలి. ట్యాబ్‌లు, ఆన్‌లైన్ కంటెంట్, ఏఐ ట్యూటర్స్ ఏర్పాటు చేయాలి.

ప్రైవేటు బడులపై నియంత్రణ ఆవశ్యం

ఇక ప్రైవేటు పాఠశాలల్లో.. ఫీ రెగ్యులేషన్ పారదర్శకంగా ఉండేటట్లు ప్రభుత్వం, అధికారులు చూసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. వివిధ రూపాల్లో వసూలు చేసే ఫీజులను నియంత్రించాలి. ప్రతీ ఏటా 5 నుంచి 10 శాతం వరకే ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలి. రైట్ టూ ఎడ్యుకేషన్ కింద 25 శాతం కేటాయించాలి. ప్రతీ స్కూలును ప్రభుత్వ అనుసంధానంతోనే అడ్మిషన్ల ప్రక్రియ సాగేటట్లు చూడాలి. పాఠశాలల్లో యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ, ఇతర వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి. అదనపు బాదుడును పూర్తిగా అడ్డుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ల విషయంలో కఠిన ఆంక్షలు రూపొందించి, ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయాలి.

సాగర్ దువ్వ

80966 77477

Next Story