అటు మౌనం.. ఇటు దూకుడు.. రెండూ ప్రమాదమే!

by Bhoopathi Nagaiah |

ఉప్పు, నిప్పుగా ఉండే కేసీఆర్, రేవంత్ రెడ్డి భిన్న వైఖరీలను అవలంభిస్తున్నారు. ఒకరు పూర్తిగా సైలెంట్ కాగా, మరొకరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

అటు మౌనం.. ఇటు దూకుడు.. రెండూ ప్రమాదమే!
X

తెలంగాణ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే, పార్టీలు, పథకాలు, సంఖ్యలు మాత్రమే కాదు, నాయకత్వ మానసిక శాస్త్రం (Political Psychology) ను చూడాల్సిందే. ఎందుకంటే ప్రజలు చివరికి ఓ విధానాన్ని కాదు, తమ భావోద్వేగాలకు దగ్గరగా ఉన్న స్వరాన్ని ఎంచుకుంటారు. ఈ కోణంలో చూస్తే, కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరూ రెండు భిన్నమైన మానసిక ధోరణుల ప్రతినిధులు. ఒకరు ఆత్మనియంత్రణ, మౌనం, సంకేతాల రాజకీయాన్ని నమ్మిన నాయకుడు. మరొకరు ఆవేశం, మాట, బహిరంగ భావోద్వేగాన్ని ఆయుధంగా చేసుకున్న నాయకుడు. ఈ తేడా కేవలం వ్యక్తిగత శైలిలో కాదు; అది తెలంగాణ ప్రజల మారుతున్న రాజకీయ మానసికతకు ప్రతిబింబం.

'నిన్నటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. రెండేండ్లు ఓపిక పట్టిన.. ఇక నుంచి తోలుతీస్తా, ఇది సర్వ భ్రష్ట ప్రభుత్వం.. తెలివి తక్కువ సర్కారు, మా ప్రభుత్వం పోయాక తట్టెడు మట్టి తీయలేదు. ఇక కాచుకో' అని....బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్... మాటల తూటాలు ఒకవైపు. మరో వైపు... 'కేసీఆర్.. రాసిపెట్టుకో..నీ కుటుంబాన్ని ఇక అధికారంలోకి రానివ్వను.. ఇదే నా శపథం...నీది, నీ పార్టీ చరిత్ర ఖతమే.. ఇక గతమే..నన్ను అనవసరంగా గెలకొద్దు..నీ ఫాంహౌసే నీకు జైలు.. చుట్టూరా నా పోలీసులే.. ఇక నిన్ను ప్రత్యేకంగా జైలులో వేయడం ఎందుకు దమ్ముంటే అసెంబ్లీకి రా.. అన్నింటి పై చర్చిద్దాం....2029లోనూ మళ్లీ మాదే అధికారం..' కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వాగ్ధాటితో ఫిరంగులు పేల్చారు.

మౌనం నాయకత్వ లక్షణం.. డేంజర్ కూడా

కేసీఆర్ నాయకత్వం ఉద్యమ దశలో భావోద్వేగాలతో మొదలైనా, అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా స్టే్ట్స్‌మన్ మోడ్‌లోకి మారింది. మాటలు తగ్గాయి, ప్రకటనలు పరిమితమయ్యాయి, నిర్ణయాలు వ్యవస్థల ద్వారా వెళ్లాయి. ఇది పొలిటికల్ సైకాలజీలో చెప్పే స్వీయ నియంత్రిత నాయకత్వం. భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శించకపోవడం, “నేనున్నాను” అనే నిశ్శబ్ద భరోసా ఇవ్వడం... ఒక దశలో ప్రజలకు ఇది బలంగా పనిచేసింది. ఆయన మౌనం, స్పందించకపోవడం కూడా “బలమైన నాయకుడి లక్షణం”గా భావించబడింది. ఫలితాలు కనిపించినంతకాలం, ఆ మౌనం అధికారానికి రక్షణగా నిలిచింది.

మౌనం ప్రమాదకరం కూడా..

అయితే కాలం గడిచేకొద్దీ అదే మౌనం మరో అర్థం తీసుకుంది. ఫలితాలపై సందేహాలు పెరిగినప్పుడు, విమర్శలు ఎక్కువైనప్పుడు, ప్రజలు నాయకుడి గొంతు వినాలనుకున్నారు. పొలిటికల్ సైకాలజీలో ఒక సూత్రం ఉంది. ఫలితాలు కనిపిస్తున్నంతవరకు మౌనం పనిచేస్తుంది. ఫలితాలపై నమ్మకం తగ్గిన క్షణం నుంచే, మౌనం దూరంగా ఉండటంగా అనిపిస్తుంది. తెలంగాణలో ఇదే మానసిక మలుపు చోటు చేసుకుంది. స్థిరత్వం, క్రమశిక్షణ ఒక దశలో భరోసా ఇచ్చినా, అదే స్థిరత్వం కాలక్రమేణా స్తబ్దతగా మారింది. “మార్పు ఎప్పుడు” అనే ప్రశ్న ప్రజల మనసుల్లో పుట్టింది.

మన గొంతే ఆయన గొంతు...

ఇక్కడే రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగారు. ఆయన శైలి పూర్తిగా భిన్నం. బహిర్ముఖ వ్యక్తిత్వం, ఆవేశం, కోపం, ఉత్సాహం. ఇవన్నీ దాచకుండా బయటపెట్టడం. దీన్ని పొలిటికల్ సైకాలజీలో భావోద్వేగ అనుకరణగా పిలుస్తారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తి, కోపం, నిరాశ.. అవే భావాలు నాయకుడి మాటల్లో ప్రతిధ్వనిస్తే, ప్రజలకు “మన గొంతే ఆయన గొంతు” అనే అనుభూతి కలుగుతుంది. ఇది తర్కానికి మించి భావోద్వేగ స్థాయిలో పనిచేస్తుంది. అందుకే ఆయన మాటలు కొందరికి అతిగా అనిపించినా, పెద్ద వర్గానికి మాత్రం అవి నిజాయితీగా, ప్రత్యక్షంగా అనిపించాయి. ఈ రెండు శైలుల ప్రభావం ప్రజల మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. స్థిరత్వం కోరుకునే కాలంలో మౌన నాయకత్వం బలపడుతుంది. మార్పు కోరుకునే కాలంలో ఆవేశ నాయకత్వం ఆకర్షణీయంగా మారుతుంది. తెలంగాణ ప్రజల మానసికత ఈ రెండు దశలను అనుభవించింది. ఉద్యమానంతర తొలి దశలో భరోసా కావాలి. అక్కడ కేసీఆర్ మోడల్ పనిచేసింది. దీర్ఘకాల పాలన తర్వాత అలసట, అసంతృప్తి పెరిగినప్పుడు. రేవంత్ రెడ్డి మోడల్‌కు స్థలం ఏర్పడింది. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ఇది కలెక్టివ్ పొలిటికల్ సైకాలజీలో వచ్చిన మార్పు.

అధికారంలోకి వచ్చాక మౌనం ప్రమాదకరం

అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వ మానసికత మారుతుందా అనేది ఆ పొలిటికల్ సైకాలజీ స్పష్టంగా చెబుతుంది. అధికారం వ్యక్తిత్వపు వ్యక్తీకరణగా మారుతుంది. కేసీఆర్ దీనిని క్రమంగా నేర్చుకున్నారు. ఆవేశాన్ని పూర్తిగా వదలలేదు, కానీ దాన్ని వ్యవస్థల వెనుక దాచారు. నిర్ణయాలు గదుల్లో, ప్రకటనలు మితంగా. దీనివల్ల పాలనలో స్థిరత్వం వచ్చింది, కానీ ప్రజలతో భావోద్వేగ దూరం కూడా పెరిగింది. రేవంత్ రెడ్డి విషయంలో ప్రస్తుతం ఈ మార్పు దశ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చినా ఆయన ఆవేశ వ్యక్తీకరణ తగ్గలేదు. ఇది ప్రజలతో కనెక్ట్ కొనసాగించడానికి సహాయపడుతోంది. అదే సమయంలో మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నది. దీర్ఘకాలంలో ఇదే శైలి కొనసాగితే ఆవేశ పూరితపాలనగా మారిపోయే ప్రమాదం ఉంటుంది.

మానసిక మార్గమధ్యంలో రాజకీయం

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక మానసిక మార్గమధ్యంలో ఉన్నాయి. మౌనం నుంచి మాటకు, స్థిరత్వం నుంచి మార్పుకు వచ్చిన ఈ ప్రయాణం ఇంకా పూర్తికాలేదు. రాబోయే కాలంలో అసలు ప్రశ్న.. ఆవేశాన్ని ఆలోచనగా, మాటలను వ్యవస్థగా, భావోద్వేగాన్ని ఫలితాలుగా మార్చగలరా పొలిటికల్ సైకాలజీ ప్రకారం విజయవంతమైన ఆవేశ నాయకత్వం మూడు దశలు దాటాలి ప్రజలను కదిలించడం, ఆ శక్తిని సంస్థాగత నిర్ణయాలుగా మార్చడం, ఆ నిర్ణయాలను స్పష్టమైన ఫలితాలుగా చూపించడం. మూడో దశలో మాటల శబ్దం తగ్గి, పనుల శబ్దం వినిపించాలి. చివరికి గెలిచేది ఆవేశమా ఆత్మనియంత్రణా సమాధానం రెండింటి మధ్యే ఉంది. ఆవేశం దిశను చూపిస్తుంది. నియంత్రణ గమ్యాన్ని చేరుస్తుంది. ఈ రెండింటి సమన్వయమే దీర్ఘకాల నాయకత్వం. లేకపోతే మౌనం అలసటగా మారుతుంది, ఆవేశం భారంగా మారుతుంది. తెలంగాణ రాజకీయాల తదుపరి అధ్యాయం, ఈ సమతుల్యాన్ని ఎవరు సాధిస్తారన్న దానిపైనే భవిష్యత్ రాజకీయాలు ఆధారపడతాయి.

డా. కేశవులు బి. ఎండీ. సైకియాట్రి.

చైర్మన్; తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659.

Next Story