- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నింటికీ చంద్రబాబు కుట్రేనా?
రాజకీయంగా తాము అడుగు పడుతున్నామని అనుమానం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం కేసీఆర్‌కి అలవాటుగా మారింది.

రాజకీయంగా తాము అడుగు పడుతున్నామని అనుమానం వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును భూతంగా చిత్రీకరించడం కేసీఆర్‌కి అలవాటుగా మారింది. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును అవమానించడమే పనిగా పెట్టుకొన్నారు కేసీఆర్. మరోసారి నీళ్ల రాజకీయం చేసి మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం జుర్రుకోవాలని చూస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ (DPR) వెనక్కి రావడాన్ని చంద్రబాబు కుట్రగా కేసీఆర్ అభివర్ణించడం సిగ్గుచేటు.
కేంద్రం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ వెనక్కు పంపడం చంద్రబాబు కుట్రగా ఆరోపణ చెయ్యడం చూస్తే ఆయన ఎంత సోయి తప్పి మాట్లాడుతున్నారో అర్ధం అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే 2023 ఏప్రియల్ 12న డీపీఆర్ వెనక్కు పంపింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు బీజేపీతో చంద్రబాబుకి పొత్తు లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. సంబంధం లేని డీపీఆర్‌ని చంద్రబాబు కుట్రగా వర్ణించడం కేసీఆర్ దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనం. డిపిఆర్‌లో తప్పులు ఉంటే తిరస్కరణ సహజం.
డీపీఆర్ తిరస్కరణా కుట్రేనా?
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కృష్ణా నదిపై ఆధారపడినది. అంతర్ రాష్ట్ర జల వివాద పరిధిలో ఉంటుంది. కేంద్రం డీపీఆర్ ని పరిశీలించేటప్పుడు చూస్తుంది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డులు, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యత డేటా, సుప్రీంకోర్టులో పెండింగ్ అంశాలు ఉంటాయి. ఈ ప్రక్రియలో కుట్రలకు అవకాశం ఎక్కడ ఉంటుంది? దేశంలోనే అనేక రాష్ట్రాల్లో డీపీఆర్ లు తిరస్కరణకు గురయ్యాయి సవరణల తర్వాతే ఆమోదం పొందిన విషయం కేసీఆర్ తెలుసుకోవాలి. ఇవన్నీ మరిచి అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబును అవమానించడమే పనిగా పెట్టుకొన్నారు కేసీఆర్. మరోసారి నీళ్ల రాజకీయం చేసి మరో సారి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం జుర్రుకోవాలని చూస్తున్నారు. జల రాజకీయాలు చేసి రాజకీయ లబ్ది పొందాలన్న ధోరణి కనపడుతుంది ఆయనలో.
జలరాజకీయానికి పరాకాష్ట ఇది..
తన ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ సైతం సరిగ్గా సమర్పించ లేని పెద్ద మనిషి, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసిన కేసీఆర్ అధికారం పోయాక మళ్లీ జలరాజకీయం చేస్తున్నారు. నీళ్లతో పంటలు పండించడమే కాదు, నీళ్ళతో రాజకీయ పంట పండించడం కూడా తెలిసిన ఉద్దండుడు కేసీఆర్. తెలంగాణా ప్రజల్లో భావోద్వేగాలు, సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా బతకాలన్న దురాశతోనే నీటి నిప్పు రాజేస్తున్నారు. రాజకీయాలలో ఏ ఆరోపణలు అయినా ఒకేసారి పనిచేస్తాయిని కేసీఆర్ గుర్తించాలి. తానూ చతికిల పడినపుడల్లా చంద్రబాబుపై పడి ఏడవడటం కేసీఆర్‌కి అలవాటుగా మారింది. పదేళ్లు తెలంగాణని పరిపాలించి ఏం ఉద్దరించారో చెప్పకుండా ఇంకా చంద్రబాబును ఆడిపోసుకోవడం తన స్వార్ధ రాజకీయాలకు నిదర్సనం. తెలంగాణలో తాము కోలుకోవడం ఎలాగో ఆలోచించకుండా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకిగా చిత్రించే తన అల్ప బుద్ధి బయట పెట్టుకొన్నారు.
వారి పెట్టుబడులను చులకన చేస్తే..!
అట్లాగే చంద్రబాబు నాయుడు నిర్వహించిన వైజాగ్ సమ్మిట్ల లో జరిగిన ఒప్పందాల పై వైజాగ్ లో వున్న పని మనుషులు సంతకాలు పెట్టారు అంటూ కేసీఆర్ మాట్లాడటం ఆయన దివాళా కోరు రాజకీయానికి నిదర్శనం. వైజాగ్‌లో జరిగిన ఒప్పందాలపై పనివాళ్ళు సంతకాలు పెట్టారని కేసీఆర్ రుజువు చెయ్యగలరా? ఎందుకు ఇంత చిల్లరగా, దిగజారి మాట్లాడుతున్నారు.? రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేదికపై పరిశ్రమల శాఖ, IT శాఖ, APEDA, APIIC వంటి సంస్థల సమక్షంలో కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందాలు జరుగుతాయి. గ్లోబల్ కంపెనీల CEOలు, భారతీయ పరిశ్రమల అధిపతులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమక్షంలో సంతకాలు జరుగుతాయి. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం, ఏపీ పెట్టుబడులను చులకన చేయడం, చంద్రబాబు అంతర్జాతీయ గుర్తింపును తక్కువ చేసి చూపడమే. ఆయన పదేళ్లు ముఖ్యమంత్రిగా వున్నా ఒక్క సమ్మిట్ కూడా నిర్వహించలేదు. ఒక్క పరిశ్రమ తేలేదు. చంద్రబాబు సమ్మిట్లు నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు సాధించడం చూసి ఈర్ష్యాద్వేషంతో ఆయనపై కేసీఆర్ ఏడుస్తున్నారు.
బ్రహ్మరధం పట్టినోళ్లే.. పాతాళంలోకి నెట్టారు
నిజంగానే తాను తెలంగాణా ప్రజలను ఉద్ధరిస్తే ప్రజలు ఎందుకు ఓడించి పామ్ హౌస్‌కి పరిమితం చేశారు? అంత బ్రహ్మాండoగా పాలిస్తే అసెంబ్లీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నలకు ఎందుకు జవాబు చెప్పరు?. ఎత్తులు, కుట్రలతో, సెంటి మెంట్ రెచ్చగొట్టి తాను మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. రాజకీయాలలో అన్ని రోజులూ ఒకేలా ఉండవు. కేసీఆర్‌కు బ్రహ్మరధం పట్టింది ప్రజలే. పాతాళంలోకి నెట్టిందీ ప్రజలే. కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందే ప్రయత్నం చెయ్యాలి. చంద్రబాబుపై విషం చిమ్మడం మానాలి. అంతేకాదు అధికారంలో వున్నప్పుడు మీ హయాంలో జరిగిన అవినీతిపై మీ తనయ కవిత చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పి ఇతరులను విమర్శిస్తే అర్థవంతంగా ఉంటుంది.
కుయుక్తులతో అధికారంలోకి రాలేరు
ఇప్పటికైనా కేసీఆర్ హుందాగా వ్యవహరించాలి. 2019లో చంద్రబాబు ఓడిపోయినప్పుడు కూడా ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని విర్ర వీగారు కేసీఆర్. మరి 2023 ఎన్నికల్లో చంద్రబాబు ఏ రూపంలో రిటన్ గిఫ్ట్ ఇచ్చారో కేసీఆర్‌కే తెలియాలి. ఏది ఏమైనా ఎన్నికల్లో ఓడిపోయి పార్టీని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్న కేసీఆర్, చంద్రబాబుపై ఏడవడం మానుకోవాలి. అంతే తప్ప ఇంకా చంద్రబాబుపై నిందలు వేసి రాజకీయంగా బలపడాలను కోవడం మీ ఖర్మ. ఎత్తులు, కుయుక్తులతో త్వరలోనే తాను మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావించడం భ్రమగానే మిగిలి పోతుంది.
-నీరుకొండ ప్రసాద్
98496 25610






