కథా సంవేదన: డాక్టర్ గాడిద

by Disha edit |
కథా సంవేదన: డాక్టర్ గాడిద
X

యజమానితో బాటూ మన గాడిద బట్టలు మోసుకుంటూ బయల్దేరింది. ప్రతివారం జరిగే పని ఇది. ఇస్త్రీ బట్టలు నలుగకుండా తన కస్టమర్లకి అందచేయడం కోసం గాడిద సహాయాన్ని దాని యజమాని తీసుకుంటూ వుంటాడు. ఆ పట్టణంలోని ప్రముఖులందరికీ మన గాడిద యజమానే ఇస్త్రీ చేసి పెడుతుంటాడు. అందులో రాజకీయ నాయకులు వున్నారు. కొంతమంది పేర్ల ముందు డాక్టర్ అని చూసినప్పుడల్లా మగ గాడిదకి సంతోషం వేసింది. తను కూడా డాక్టర్ చదివితే బాగుండేది, తన పేరు ముందు కూడా డాక్టర్ అని వుండేది అని బాధపడింది.

కొంతమంది డాక్టర్ కోర్సు చదవకపోయినా డాక్టర్ అని వుండటం దానికి ఆశ్చర్యం వేసి తన యజమానిని అదే ప్రశ్న అడిగింది. 'వాళ్ళు పోస్ట్ గ్రాడ్యూయేషన్ తరువాత పీహెచ్‌డీ చేశారు. దానివల్ల వారి పేరు ప్రక్కన డాక్టర్ అని పేరు ఉంటుంది. వాళ్ళు మన ఆరోగ్యాన్ని మంచిగా చేసే డాక్టర్లు కాదు. పరిశోధన చేసినందుకు గాను వారికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన పట్టా డాక్టరేట్' వివరంగా చెప్పాడు మన గాడిద యజమాని.

'ఓహో! అలాగా' అంది మన గాడిద. తను పెద్దగా ఏమి చదువుకోలేదు. తాను పీహెచ్‌డీ చేసే అవకాశం లేదు. తన పేరు పక్కన డాక్టర్ అని రావడానికి అవకాశం లేదని లోపల్లోపల బాధపడింది.

ఒకరోజు బట్టలు తీసుకొని తన యజమానితో మన గాడిద బయల్దేరింది. దారిలో ఓ దినపత్రిక కనిపించింది. దాన్ని నమిలి మింగేద్దామని అందుకుంది. దాన్ని అలా చూసింది. దానికి ఒక వార్త ప్రముఖంగా కన్పించి దాని వైపు చూసింది. ఫలానా వ్యక్తులకి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నారన్న వార్త అది. ఆ దినపత్రికను నమిలి మింగకుండా తన యజమానికి ఇచ్చింది. యజమాని నడుస్తూ దాన్ని తిరగెయ్యడం మొదలు పెట్టాడు.

'ఈ గౌరవ డాక్టరేట్లు అంటే ఏంది' అనడిగింది యజమానిని మన గాడిద. ఏదైనా రంగంలో బాగా కృషి చేసిన వ్యక్తులకి యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తూ ఉంటాయి. జవాబు చెప్పాడు మన గాడిద యజమాని అట్లాగా! మరి అందులోని ఒక వ్యక్తి తన ఉద్యోగం తను చేశాడు తప్ప, ప్రత్యేకంగా ఒక రంగంలో కృషి చేయలేదు కదా! మరి ఆయనకు డాక్టరేట్ ఎట్లా ఇస్తున్నారు' ప్రశ్నించింది మన గాడిద.

గాడిద ప్రశ్నకి ఆశ్చర్యపోవడం దాని యజమాని వంతైంది. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. మౌనంగా వుండిపోయాడు. అతని మౌనం చూసి మన గాడిదకి ఉత్సాహం వచ్చేసింది. 'నాకు కూడా ఓ గౌరవ డాక్టరేట్ ఇప్పించూ' అని యజమానిని అడిగింది గాడిద. యజమానికి కోపం వచ్చింది. 'నువ్వు గాడిదవి నీకు గౌరవ డాక్టరేట్ ఏమిటి' అన్నాడు కాస్త విసుగ్గా.

తన యజమానితో లాభం లేదని అనుకుంది గాడిద. మౌనంగా తన పని తాను ముగించుకొని దీర్ఘ ఆలోచనలో పడింది. చివరికి ఒకరోజు ఉదయం లేచి తాను రెగ్యూలర్ గా బట్టలు ఇచ్చే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దగ్గరికి వెళ్ళింది. యజమాని లేకుండా గాడిద ఒక్కటే రావడం చూసి అతను ఆశ్చర్యపోయాడు.

'నమస్కారం సార్!' అంది మన గాడిద వైస్ చాన్సలర్‌తో. గాడిద వచ్చి ప్రత్యేకంగా నమస్కారం చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. 'ఏంటీ సంగతి' అని గాడిద వైపు చూశాడు. గాడిద తాను వచ్చిన విషయం చెప్పింది. 'ఎంతోమందికి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నారు కదా! నాకు కూడా ఓ గౌరవ డాక్టరేట్ ఇవ్వండి' అన్నది.

'నువ్వు గాడిదవి నీకు గౌరవ డాక్టరేట్ ఏమిటీ అయినా నువ్వు ఏ రంగంలో విశేషమైన కృషి చేశావని నీకు గౌరవ డాక్టరేట్' అన్నాడు విసుగ్గా.

'ఈ బట్టలు మోయడంలో, ఇస్త్రీ బట్టలు అందించడంలో నేను చేసిన కృషి చాలదా తమ ఉద్యోగాలు తాము చేసిన ఎందరికో గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. ఇస్తున్నారు. నాకు ఇస్తే తప్పా! సార్' అడిగింది మన గాడిద ప్రాధేయపూర్వకంగా.

ఉదయాన్నే ఇదెక్కడి గాడిద గోల అనుకున్నాడు అతను. ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. మంచిగా చెప్పిచూశాడు గాడిదకి. గాడిద అట్లాగే బ్రతిమలాడటం మొదలుపెట్టింది. వెళ్ళిపొమ్మని చెప్పినా మన గాడిద వినలేదు. 'నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే, నిన్ను పోలీసులను పెట్టి బయటకు పంపించాల్సి వస్తుంది.' అన్నాడు వైస్ చాన్సలర్.

పోలీసుల పేరు వినగానే మన గాడిదకు భయం వేసింది. అది ఒకసారి లాఠీచార్జిలో దెబ్బలు తిన్నది. అందుకని మారు మాట్లాడకుండా ఇంటి వైపు దారి పట్టింది. ఇంటి వైపు దారి పట్టింది కాని దాని మనస్సు మనస్సులా లేదు. ఏ రంగంలో ప్రావీణ్యం లేకున్నా, తమ ఉద్యోగాలు తాము చేసుకుంటున్న ఎంతో మందికి గౌరవ డాక్టరేట్లు ఇస్తూ తనకి గౌరవ డాక్టరేట్ ఇవ్వకపోవడం మన గాడిదకి నచ్చలేదు. తాను కూడా తన నౌకరీని శ్రద్ధగా చేస్తున్నప్పటికీ తనకెందుకు ఇవ్వడం కుదరదని చెప్పిన వైస్ చాన్సలర్ మీద విపరీతమైన కోసం వచ్చింది. మన గాడిదకి ఇక ఆయన బట్టలు మోయకూడదని నిర్ణయించుకుంది. బాధగా అలా నడుస్తున్నప్పుడు మన గాడిదకి తళుక్కున ఓ ఆలోచన మెరిసింది.

అది వెంటనే తనకు బాగా తెలిసిన పెద్దమనిషి ఇంటికి బయల్దేరింది. వెళ్ళి తలుపు తట్టింది. ఆ పెద్దమనిషి ఆ మధ్యాహ్న సమయాన వచ్చిన గాడిదను చూసి ఆశ్చర్యపోయాడు. 'ఈ సమయంలో వచ్చావు ఏమిటీ సంగతి మీ యజమాని లేకుండా వచ్చావు అదీనూ' అడిగాడు ఆ పెద్దమనిషి.

గాడిద విషయం అంతా చెప్పింది ఆ పెద్దమనిషికి. గాడిదకు డాక్టరేట్ ఏమిటీ అని వైస్ చాన్సలర్ విసుక్కున విషయం ప్రత్యేకంగా చెప్పింది. ఏ రంగంలోనూ ప్రావీణ్యం లేకుండా తమ ఉద్యోగాలను మాత్రమే చేసుకుంటున్న వ్యక్తులకి గౌరవ డాక్టరేట్లు ఇస్తున్న వైనాన్ని కూడా విన్నవించింది. వాళ్ళందరి మాదిరిగా తానూ తన ఉద్యోగాన్ని శ్రద్ధగా నిర్వహిసున్నట్లే కదా. తనకెందుకు గౌరవ డాక్టరేట్ ఇప్పించకూడదూ అని అతన్ని కోరింది. గాడిద కోరికలో ఔచిత్యం వుందని ఆ పెద్దమనిషకి అన్పించింది.

'నీలాంటి వాళ్ళకు చాలా మందికి గౌరవ డాక్టరేట్లు ఇచ్చి నీకు ఇవ్వకపోవడం సరైంది కాదు. అయితే నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు' అంటూ ఒక్క క్షణం ఆగాడు.

'ఏం చెయ్యాలి చెప్పండి' అంది గాడిద గద్గద స్వరంతో. 'ఏం లేదు నువ్వు వెళ్ళాల్సింది వైస్ చాన్సలర్ దగ్గరకు కాదు. మన మూలమలుపున వున్న రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్ళు అతన్ని బ్రతిమిలాడుకో. ఆయన అనుకుంటే నియమాలు మార్చి అయినా నీకు గౌరవ డాక్టరేట్ ఇస్తారు. అంతేకాదు ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఏమైనా కావాలని అనుకుంటే అది కూడా అడిగేసేయ్' జ్ఞాన బోధ చేశాడు మన గాడిదకు ఆ పెద్దమనిషి.

తత్వం బోధపడింది. మన గాడిదకు ఆయనకు థ్యాంక్స్ చెప్పి రాజకీయ నాయకుడి ఇంటివైపు దారి తీసింది మన గాడిద. దాని మనస్సు తేలికపడింది. తనకి గౌరవ డాక్టరేట్ వచ్చినంతగా సంతోషపడింది.

మంగారి రాజేందర్ జింబో

94404 83001

Next Story