- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయ సినిమాకు.. ఉర్దూ సొబగులద్దిన కవి
మనిషి జీవితానికీ, కవిత్వానికీ మధ్య గల దూరాన్ని వైరుధ్యాలను చెరిపేసిన కవి కైఫీ ఆజ్మీ. అభ్యుదయ సాహిత్యంతో ఆయన జీవితం పెనవేసుకుపోయింది.

మనిషి జీవితానికీ, కవిత్వానికీ మధ్య గల దూరాన్ని వైరుధ్యాలను చెరిపేసిన కవి కైఫీ ఆజ్మీ. అభ్యుదయ సాహిత్యంతో ఆయన జీవితం పెనవేసుకుపోయింది. ఆచరణకు, ఆలోచనకు మధ్య హద్దులను కూడా చెరిపేసాడు. సమాజంలోని సామాజిక అంతరాలను రూపుమాపాలనే తపనతో వెలకట్టలేని సాహిత్యాన్ని మన ముందుంచారు..
దోపిడీ సమాజంలో ప్రతి కవీ సామాజిక చట్రాన్ని మార్చడానికి రచనలు చేయాలని చెప్పారు. అప్పుడే ఆ కవిత్వానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆ స్పృహతోనే తన కవిత్వం రాశారు. మార్క్సిస్టు కవిగా అర శతాబ్ది పాటు రచనలు చేశారు..
భాష సరళంగా ఉన్నప్పటికీ..
కైఫీ ఆజ్మీ భావోద్వేగభరితమైన, చిరస్మరణీయమైన కవిత్వాన్ని రాశారు. ప్రేమ, సామాజిక దోపిడీ అన్యాయం లాంటి అంశాలను ఆయన తరచుగా తన కవితల్లో స్పృశించారు. కైఫీ ఆజ్మీ కవిత్వంలో భాష సరళంగా ఉండి భావాలు అత్యంత లోతుగా ఉంటాయి. ఆయన రచనలు భావోద్వేగాలకు, వ్యక్తిగత అనుభూతులకు అద్భుతంగా అనుసంధానం అవుతాయి. అందుకే ఆయన కవిత్వం ఇప్పటికీ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.
‘ఈ జీవితాన్నీ ఈ శరీరాన్నీ/ ఇప్పుడే అర్పిస్తున్నాను/ ఇప్పుడు ఈ దేశం / మీ చేతుల్లోనే వుంది జీవించేందుకు ఎన్నో వసంతాలున్నాయి/ కానీ జీవితాన్ని త్యాగం చేసే / కాలం తరుచుగా రాదు/అందాన్నీ ప్రేమనీ వదిలిపెట్టి / రక్త స్నానం చేయని/ యవ్వనానికి ఏమి విలువ/ ఈ రోజు భూమే నా వధువైంది, /ఓ స్నేహితులారా... ఇప్పుడే అర్పిస్తున్నాను / ఈ శరీరం, ఈ జీవితం, ఓ స్నేహితులారా’ 1964లో హాకీఖత్ సినిమా కోసం కైఫీ రాసిన ఈ పాట యుద్ధరంగంలోని సైనికులకు ఎంత ఉత్తేజితంగా ఉంటుందో చెప్పనలవి కాదు.
11 ఏళ్ల ప్రాయంలో సంచలనం..
1919 జనవరి 14న ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్ జిల్లాలో మిజ్వాన్ అనే చిన్న పల్లెలో జన్మించిన కైఫీకి తిరుగుబాటు తత్వం చిన్ననాడే అలవడింది. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు. అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషల్లో లక్నో, అలహాబాద్ విశ్వవిద్యాలయాల పరీక్షలు రాసి పాసయ్యారు. ఒకసారి ఒక ముషాయిరాకు కైఫీకి ఆహ్వానం వచ్చింది. అప్పుడాయనకు కేవలం 11 ఏళ్ల వయస్సు 'ఇత్నాతో జిందగి మే కిసికి ఖలాల్ పడే హన్స్‌నే సే హో సుకూన్ నా రోనే సే కల్ పడే' అని ప్రారంభమయ్యే ఆ ఘజల్‌ను బేగమ్ ఆక్తర్ పాడారు. అది అప్పుడు భారతదేశాన్ని ఉర్రూతలూగించింది.
అట్టడుగు వర్గాల ప్రతినిధిగా..
పదకొండేళ్లకే కవిగా పేరు ప్రతిష్టలు పొందిన కైఫీ చాలా మంది ఉర్దూ కవుల మాదిరిగానే మొదట్లో ప్రేమ కవిత్వమే రాశాడు. అభ్యుదయ రచయితల సంఘం ఆయన కవితా మార్గాన్ని మార్చేసింది. తన కవిత్వానికి సామాజిక స్పృహను జోడించారు. దీని వల్ల కైఫీ కవిత్వం భావోద్వేగ సాంద్రతతో విశిష్టతను సంతరించుకుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం నిలబడింది. అభ్యుదయ రచ యితల ఉద్యమంతో మమేకమయ్యాక 1943 ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. పార్టీ ఆదేశం మేరకు ముంబాయిలోని కార్మికుల మధ్య పని చేశారు.
ముషాయిరా కుదిర్చిన బంధం
1942 నాటి మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంతో ప్రేరణ పొందిన ఆయన ఉర్దూ వార్తాపత్రిక కోసం వ్యాసాలు రాయడానికి ముంబైకి వెళ్లారు. అదే సమయంలో దేశంలో ఎక్కడ ముషాయిరా జరిగినా ఆయన హాజరవుతూ వచ్చారు. ఒక ముషాయిరాలో పాల్గొనడానికి 1947లో ఆయన హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఆయనకు షౌకత్‌తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కైఫీ భార్య షౌకత్ మంచి నటి కూడా. ఆమె సినిమాల్లో, నాటకాల్లో వేషాలు వేశారు.. ఉర్దూ సాహిత్యాన్ని భారతీయ సినిమాకు తీసుకువచ్చిన ఘనత కైఫీకే చెందుతుంది. ‘హీర్ రాంజా’ అనే సినిమాకు స్క్రిప్టు రాశారు. ఆ సినిమాలో ఆయన చేసిన ప్రయోగం ఎందరో మన్ననలు అందుకుంది. సినిమా కూడా హిట్టయింది. కైఫీ సినిమాలకు ఎన్నో పాటలు ముఖ్యంగా గురుదత్ సినిమాలకు కైఫీ రాసిన పాటలు గొప్ప భావ సాంద్రతతో నేటికీ నిలబడ్డాయి. కాగజ్ కె ఫూల్, హీఖీఖత్, హీర్ రంఝా, హస్తే జక్మే వంటి సినిమాలకు రాసిన ఆయన పాటలు శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.
అసంఖ్యాక అవార్డులు..
కైఫీ అజ్మీ ఎన్నో సాహిత్య అవార్డులు అందుకున్నారు ' ఆవారే సజ్దే'కు ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రత్యేక అవార్డు ఇచ్చి ఆయ నను సత్కరించింది. ఆయనకు ఆఫ్రో- ఆసియన్ రైటర్స్ కమిటీ లోటస్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు- ఝంకార్, ఆఖిర్-ఓ-షాబ్, ఆవారా సజ్దే, ఇబ్లీస్ కి మజ్లీస్-ఎ- షూరా (దూస్రా ఇజ్లాస్) పవన్ కె. వర్మ అనే రచయిత ఆయన కవితలను ఎంపిక చేసుకుని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ప్రముఖ సినీ నటి షబానా ఆజ్మీ కైఫీ ఆజ్మీ కూతురు. బాబా ఆజ్మీ మంచి సినిమాటోగ్రాఫర్. కైఫీ ఆజ్మీ భార్య షౌకత్ కైఫీ వ్రాసిన ”Kaifi & I” పుస్తకం. షౌకత్ ఈ పుస్తకంలో కైఫీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. ప్రతి మనిషీ ఒక పుస్తకమైతే అతని భార్యే ఆ పుస్తకాన్ని సరిగా చదవగల వ్యక్తి అంటారామె.
-వారాల ఆనంద్
94405 01281






