- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజికం : కులరక్కసి కాటుకు బలైన జూ. డాక్టర్
రక్తానికి రంగు లేదు, ప్రాణానికి కులం లేదని చెబుతున్న వారు కూడా, తోటి మనిషిలోని 'కులాన్ని' వెతకడం ఈ దేశపు అతిపెద్ద వైరుధ్యం.

భారతదేశం సాంకేతికంగా వేగంగా ఎదుగుతున్న దేశమని మనం గర్వంగా చెప్పుకుంటున్నా, మన సమాజాన్ని లోపల నుంచి కుళ్లగొడుతున్న ఒక పాత రోగం ఇంకా బతికే ఉంది. అదే కులం. స్పేస్ సైన్స్‌లో శిఖరాలను అధిరోహిస్తున్నా, విద్యా వ్యవస్థల్లో మానవత్వం మాత్రం వెనుకబడి ఉంది. జూ.డాక్టర్ లావణ్య మరణం ఒక వ్యక్తిగత విషాదం కాదు.. అది ఈ దేశ ఆధునిక విద్యా ముఖానికి ఉన్న లోతైన చీలిక. ఈ ఘటన మన ప్రగతిపై ప్రశ్నలు వేస్తోంది.. మన అభివృద్ధి నిజంగా మనుషులను ముందుకు తీసుకెళ్తోందా, లేక కేవలం గణాంకాలకే పరిమితమైందా?రక్తానికి రంగు లేదు, ప్రాణానికి కులం లేదని చెబుతున్న వారు కూడా, తోటి మనిషిలోని 'కులాన్ని' వెతకడం ఈ దేశపు అతిపెద్ద వైరుధ్యం. కేవలం కులం పేరుతో ఒక ప్రాణాన్ని బలితీసుకోవడం కంటే అనాగరికత మరొకటి ఉంటుందా?
సమాజంలో కుల వివక్ష లేదా?
మనం, ఒకవైపు చంద్రమండలంపై అడుగుపెడుతున్నాం కానీ, పక్కవాడి మనసులోకి అడుగుపెట్టలేకపోతున్నాం. డిగ్రీలు పెరిగి, ఆలోచనా దృక్పథం మారనప్పుడు ఆ చదువుకు అర్థం ఏముంది? లావణ్య ఆత్మహత్య మనల్ని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతోంది. మన చదువులు కేవలం ఉద్యోగాల కోసమేనా, మానవత్వాన్ని నేర్పడానికి కాదా? 'ప్రేమ' అనే పదానికి కులమనే ఫిల్టర్ ఎందుకు? చదువు ఉన్నవాళ్లలో కులం తగ్గుతుందా? అంటే ఇప్పటికీ లేదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక దళిత యువతి తన ప్రతిభతో ఎదిగినా, ఆమె అస్తిత్వాన్ని అవమానించే అధికారం ఈ సమాజానికి ఎవరిచ్చారు? మనం ఐఐటీ, ఏయిమ్స్ వంటి ప్రాంగణాలను ‘మెరిట్ కేంద్రాలు’గా ప్రశంసిస్తాం. కానీ అదే ప్రాంగణాల్లో రోహిత్ వేముల, పాయల్ తడవి, ముత్తుకృష్ణన్ వంటి విద్యార్థులు కులం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జూనియర్ డా.లావణ్య కేసు కూడా ఈ వరుసలోకే వస్తుంది. వివక్ష ఇక్కడ స్పష్టంగా లేదు అని అనుకోడానికి లేదు. అది హాస్టల్ గదుల్లో, స్టడీ గ్రూపుల్లో, అవకాశాల పంపిణీలో, చిన్న చిన్న వ్యాఖ్యల్లో కనిపిస్తుంది.
దళిత మహిళలకు రెండింతల అడ్డంకులు..
దళిత మహిళలు కులంతో పాటు మహిళ అనే రెండు అడ్డంకులతో ఒకేసారి యుద్ధం చేస్తారు. చదువు, ప్రేమ, ఉద్యోగం ఇలా అన్నీ రంగాలలో.. ఈ ద్వంద అడ్డంకులు ఎదుర్కోవడానికి చేసే యుద్ధమే ఈ సమాజంలో వాళ్లు నిలబడటానికి రాసే పెద్ద పరీక్ష. బయటకు ఎలా కనిపించినా ఇంటర్ క్యాస్ట్ ప్రేమల్లో ఒక సాధారణ స్క్రిప్ట్ కనిపిస్తుంది. ప్రేమ సమయంలో కులం కనిపించదు. పెళ్లి దగ్గరికి వచ్చే సరికి మాత్రం ‘సంప్రదాయం’, ‘కుటుంబ గౌరవం’, ‘కులం వారి ఒత్తిడి కారణాలంటూ దళిత మహిళను వదిలేయడం సాధారణ పద్ధతిగా మారింది. పైగా వీటి వల్ల అయ్యే మానసిక గాయాలు ఎక్కువ. దళిత మహిళల బాధలు రెండింతలు. ప్రేమ, విద్య, ఉద్యోగం అన్న రంగాల్లో కూడా ఈ గోడలను వాళ్లు ఢీకొంటూనే ఉంటారు. అగ్రవర్ణ పురుషులతో సంబంధాలు వచ్చినప్పుడు మరో సమస్య స్పష్టమవుతుంది.
చట్టాలు ఉన్నప్పటికీ..
AISHE నివేదిక ప్రకారం, ఉన్నత విద్యలో గత దశాబ్ద కాలంలో దళిత విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో వారి డ్రాపౌట్ రేటు ఆందోళనకరంగా ఉంది. స్కాలర్‌షిప్‌లు సకాలంలో రాకపోవడం, ప్రైవేటు విద్య భారమవ్వడం కూడా వారిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. లావణ్య ఘటనని కూడా ఈ నేపథ్యంతో చదవాలి. ఇవి ఆత్మహత్యలు కాదు.. ఇవి వ్యవస్థా హత్యలు.. పోలీస్, మీడియా ఈ మరణాలను తరచూ ‘ప్రేమ ఫెయిల్యూర్’గా చిత్రిస్తాయి. ఇది తప్పుదారి పట్టించటమే. విద్యాసంస్థలలో దళితుల మరణాల్లో ఒక ప్యాట్రన్ ఉందని NCRB సంఖ్యలే చెబుతున్నాయి. విచారకరంగా, బాధితుడిపైనే/బాధితురాలిపైనే తప్పు మోపబడుతుంది. అణగారిన వర్గాలకు అట్రాసిటీ చట్టం ఉందని మనం నమ్ముతాం. కానీ లావణ్య వంటి కేసుల్లో పోలీసులు తరచుగా కుల వివక్షను తగ్గించి, ప్రేమ సమస్యగా మార్చేస్తారు. దీంతో బాధిత కుటుంబం ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది.
నిందితుడు ఒక్కడు కాదు..
మన సమాజం కులం గురించి మాట్లాడడం తప్పు అని నేర్పుతుంది. కానీ జూ.డాక్టర్ లావణ్య మరణంపై పౌర సమాజం నిశ్శబ్దంగా ఉండకూడదు. మనం నిశ్శబ్దంగా ఉండటమంటే నేరస్తుడికి సహకరించడమే. కులం గురించి మాట్లాడటం కులతత్వం కాదు, కుల వివక్షను ప్రశ్నించడం సామాజిక ధర్మం. ప్రతి విద్యార్థి సంఘం, పౌర సమాజం లావణ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాలి. విద్యార్థి సంఘాలు, మహిళా ఉద్యమాలు, కుల రహిత సంస్థలు ఇక్కడ పాత్ర పోషించాలి. జూ.డాక్టర్ లావణ్య మరణం మన ప్రగతికి ఉన్న తేడాను స్పష్టంగా చూపించింది. లావణ్య మరణానికి నిందితుడు ఒక్కడే కాకపోవచ్చు. కులాన్ని నిరంతరం పోషిస్తున్న ఈ సామాజిక వ్యవస్థే అసలైన నిందితుడనీ మరిచి పోవద్దు. అందులో మనమందరం ఉన్నాం. మనం ఇప్పటికైనా మేల్కొనకపోతే, ఇంకెందరో ప్రతిభావంతులైన విద్యార్థులు ఇలాగే నిశ్శబ్దంగా రాలిపోతారు. మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న కుల అహంకారాన్ని ప్రశ్నించడం. కులం లేని ప్రేమను, గౌరవం ఉన్న సమాజాన్ని నిర్మించడం లావణ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
లావణ్య చిరునవ్వు మనకు ఒక జ్ఞాపకంగా మాత్రమే కాదు, కుల రక్కసిపై మనం చేసే పోరాటానికి ఒక ప్రేరణగా మిగిలిపోవాలి.ఈ దేశంలో ఒక విద్యార్థి కులం కారణంగా మరణించాల్సిన పరిస్థితి ఉన్నంతకాలం, మనం ప్రగతిని గర్వంగా చెప్పుకోవడానికి మనకి హక్కు లేదు.
-మెర్సీ మార్గరెట్
90528 09952






