ఒక గుణపాఠం.. ఓ హెచ్చరిక!

by Ravi |   (  Updated:2025-11-15 00:46:08  IST  )

గెలిచిన పార్టీకి మోదం.. ఓడిన పార్టీలకు ఖేదం ప్రతి ఎన్నికలోనూ తప్పకుండా జరిగేదే ఎన్నికలకు ముందు.. ఫలితాలు ప్రకటించాక ఆయా పార్టీల నాయకుల వ్యాఖ్యలను పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు

ఒక గుణపాఠం.. ఓ హెచ్చరిక!
X

గెలిచిన పార్టీకి మోదం.. ఓడిన పార్టీలకు ఖేదం ప్రతి ఎన్నికలోనూ తప్పకుండా జరిగేదే ఎన్నికలకు ముందు.. ఫలితాలు ప్రకటించాక ఆయా పార్టీల నాయకుల వ్యాఖ్యలను పరిశీలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎంత ఉద్రిక్తతను సృష్టించాయో అర్థమ వుతుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నిక ముగిశాక కూడా గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది చేసుంటే.. ఇంకా మెజార్టీ పెరిగేది!

బీఆర్ఎస్ కంచుకోట బీటలు వారదనే గట్టి నమ్మకం బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ.. ఈసారి ఎలాగైనా పీఠాన్ని హస్తగతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, శ్రేణులు అసాధారణమైన ఐక్యతను ప్రదర్శించి కంచుకోటను ఎగరేసుకు పోవడం జరిగింది. ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం వేరేలా ఉండేది, టికెట్ ప్రకటించక ముందే అజహరుద్దీన్‌కి మినిస్ట్రీ డిక్లేర్ చేసి ఉంటే, ఇంకా మెజారిటీతో కాంగ్రెస్ గెలిచేదని’ జూబ్లీహిల్స్ నీలోఫర్ హోటల్‌లో నా పక్కన టేబుల్‌పై చర్చ. అలా అని, కాంగ్రెస్ సునాయాసంగా గెలిచేసిందని అనలేం, అన్ని విధాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ప్రజల కంటే మంత్రులకే ఎక్కువ అర్థమై ఉంటుంది.

కనువిప్పు కలిగించిన ఎన్నిక..

ఈ ఎన్నికల ఫలితం ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా కనువిప్పు లాంటిదే. గత పదేండ్లు పాలనలో జరిగిన లోపాలను గ్రహించి, జరిగిన పొరపాట్లను నిజాయితీగా సరిచేసుకొని, మళ్లీ ఆ పొరపాట్లు పునరావృతం కావని ప్రజల్లో నమ్మకం తేగలిగితే తప్ప భవిష్యత్తు ఉండదు. ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అపారమైన డబ్బును వెదజల్లాయి. అడుగు పెట్టని వీధి లేదు, తాకని గడప లేదు, పట్టని చేయి లేదు. పని కన్నా ప్రచారమే పెద్దగా వినిపించింది. అభివృద్ధి హామీల కన్నా పరస్పర దూషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీటింగ్‌ల నుంచి పోలింగ్ బూత్‌ వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చివరలో ఎలాగోలా గెలిచిన పార్టీ, ఆ ఉత్సాహం మధ్య రాష్ట్రాభివృద్ధినే ప్రాధాన్యంగా తీసుకుంటుందని ఆశిద్దాం. తమ తమ వ్యక్తిగత అభివృద్ధి కన్నా, రాష్ట్రాభి వృద్ధికి అంకిత భావంతో కసరత్తు చేస్తుందని ఆశిద్దాం.

గెలుపు బలుపు కారాదు...

ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈ గెలుపును బలుపుగా భావించకుండా, ఒక గుణపాఠంగా తీసుకోవాలి. ఉప ఎన్నికల సమయంలో చూపించిన వేగం, క్రమశిక్షణ, ప్రజాసేవ తమ రోజువారీ పరిపాలనలోనూ కొనసాగించాలని ప్రభుత్వంపై ప్రజలు ఆశలు పెట్టు కున్నారు. అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ఆత్మ నిబద్ధత ఇప్పుడే అత్యవసరం.

ఓటర్ల నిర్ణయమే ఫైనల్!

భవిష్యత్తులో ఓటింగ్ శాతం పెరగాలి. ‘నోటుకు ఓటు’ సంస్కృతిని ప్రజలే నిలువరించాలి. నాయకుల నల్లధనం తగ్గి, ప్రజల జేబులు నిండాలి. డబ్బు తీసుకున్నా, డబ్బు ఇచ్చిన వారికే ఓటు వేయాలనే సంస్కృతి అదృశ్యమవ్వాలి. నమ్మకమైన, నిజాయితీ గల అభ్యర్థులను ముందుకు తీసుకువచ్చే బాధ్యత ఓటర్లదే. అలా చేస్తేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించి, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుంటాం. కాబట్టి ఈ గెలుపును బలుపుగా భావించ‌కుండా, ఒక గుణపాఠంగా భావించి మున్ముందు, ఈ ఉప ఎన్నిక సందర్భంలో విధులను నిర్వహించినట్లుగానే, ప్రజల సమస్యలను తీర్చుకుంటూ అభివృద్ధి పైపు రాష్ట్రాన్ని తీసుకుపోవడానికీ నిరంతరం కృషి చేస్తారని ఆశిద్దాం.

ఐక్యత సాధించిన గెలుపు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, అధికార పార్టీ వ్యూహానికి భారీ సవాలుగా పరిణమించనుందని అందరూ భావించిన చోట కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన ఐక్యతే దానికి అద్భుత విజయం చేకూర్చింది. మహానగరంలో సాధించిన ఈ మహా విజయం రాజధానిలో హస్త వైభవానికి నాంది పలుకనుందని విశ్లేషకుల అభిప్రాయం.

-సయ్యద్ రఫీ

[email protected]

Next Story