సినీ హీరో నుంచి సీఎం వరకు..

by Ravi |   (  Updated:2026-05-05 00:50:19  IST  )

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సంచలన విజయం సాధిస్తూ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టారు. టీవీకే పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే అధికారంలోకి వచ్చి దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికారు.

సినీ హీరో నుంచి సీఎం వరకు..
X

తమిళనాడు ప్రజలు తాజా ఎన్నికల్లో సంచలన తీర్పు ఇచ్చి వారసత్వ రాజకీయా లను తిరస్కరించారు. అందుకే దేశ వ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగితే అందులో తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. దళపతి విజయ్ సినీ రంగంలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. తాను రాజ కీయాల్లోకి ప్రవేశించి రాజకీయ పార్టీని పెట్టి కేవలం రెండేళ్లలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి అధి కారంలోకి వచ్చి దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికారు.

తమిళనాడులో గతంలో ఎంతో మంది రాజకీయం గా అరగేంట్రం చేయడానికి ప్రయత్నించినా వారికి ఆశించినంతగా ప్రజల మద్దతు లభించలేదు. కానీ విజయ్ తన పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలో అధి కారాన్ని చేపట్టి దక్షిణ భారతదేశ రాజకీయాలను ఒకేసారి తనవైపుకు తిప్పుకున్నారు.

పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే..

దేశంలో జాతీయ పార్టీలు, వారసత్వ రాజకీయాల మధ్య విజయ్ 2024 ఫిబ్రవరిలో తన పార్టీని స్థాపించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేక పోయినా సామాజిక సేవా కార్యక్రమాలు, సందేశాత్మక సినిమాల ద్వారా ప్రజల్లో విశ్వాసం సంపాదించారు. ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ప్రజాసేవను విస్తరించి, తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున మద్దతు పొందారు. దక్షిణ భారతదేశంలో ఎన్టీఆర్ తర్వాత విజయ్ మాత్రమే ఇంత తొందరగా సినీ ఫేమ్ నుంచి రాజకీయాలలో ఎదిగారు. అంతే స్థాయిలో ప్రజల సంపూర్ణ మద్దతును కూడగట్టడంలో సఫలం చెందారు. అయితే తన పార్టీ టీవీకే తమిళగ వెట్రి కళగం స్థాపించిన 2024 ఫిబ్రవరి 2న పార్టీ విధి విధానాలను తెలిపిన నాడే ఆయన జెండా ఎజెండాను వివరించారు. జాతీయ పార్టీలతో కలిసి పని చేసేది లేదని ఒంటరిగానే బరిలో ఉంటామని ప్రకటించి, "ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల్లో ఒకరిగా" ప్రజాస్వామ్య, లౌకికవాద విధానాలతో తమిళనాడు అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. అవినీతి రహితం ద్యేయంగా పారదర్శక పాలన ప్రధాన ఎజెండా అని వివరించారు.

‘ఉచితం’ హామీలతో..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విజయ్ ప్రజల్లో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో మరింత దగ్గరయ్యారు. ఓ దశలో ఆయనను రాజకీయంగా ఎదుర్కోవడానికి అనేక కుట్రలు చేశారు. ఐటీ దాడులు చేయించడం, విజయ్ పాల్గొన్న బహిరంగ సభలో తొక్కిసలాట జరిగితే దానిని రాజకీయ విమర్శలు చేస్తూ కుట్ర చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ పెద్దగా ఉచిత పథకాలు ప్రకటించలేదు. అతి స్వల్ప హామీలను ప్రధానంగా చేర్చారు. ప్రతి మహిళకు నెలకు రూ. 2,500, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు. వివాహ కానుక కింద ఆడపిల్లల పెళ్లికి 8 గ్రాముల బంగారం పట్టుచీర, ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల పిల్లలకు, కుటుం బంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేని పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఉచితం. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి, విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ. 15,000. రైతులకు రుణమాఫీ, మత్స్యకారుల కుటుంబాలకు రక్షణ కల్పిస్తామన్న హామీతో పాటు నేత కార్మికులకు రూ. 10 లక్షల బీమా లాంటి ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో ఉంచారు. ఇక అభ్యర్థుల ఎంపికలోనూ తనదైన శైలిలో చాటుకుని తన కారు డ్రైవర్ కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీకి దింపారు. ఇటువంటి అనేక కొత్త విభిన్న ఆలోచనలకు గాను తమిళనాడు విజయ్‌ను ఆదరించింది.

వారసత్వ రాజకీయాలు చెల్లవంటూ..

వారసత్వం, జాతీయ రాజకీయాల పొత్తుల ముసుగులు చెల్లవంటూ తమిళ గడ్డ నిఖార్సుగా నిల బడ్డది. సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ పార్టీని ఇతర సినీ రాజకీయ నేపథ్యం ఉన్న వారితో పోల్చి హేళనగా మాట్లాడారు. నిజానికి ఎంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఓటు రూపంలో ఆ అభిమానం మలచడం చాలా కష్టం. కానీ తమిళనాడు ప్రజలు రీల్ హీరో విజయ్‌లో ఉన్న గొప్ప మానవీయ కోణం, మనస్తత్వం, నిబద్దతలకు కొండంత అండగా నిలిచారు. అందుకే జాతీయ అధికార పార్టీల నడుమ సింగిల్‌గా భారీ విజయాన్ని నమోదు చేసి తమిళనాడు చరిత్రలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది కేవలం విజయ్ విజయం మాత్రమే కాదు తమిళనాడు ప్రజల విజయం. ఇటువంటి గుణాత్మక మార్పు దక్షిణ భారతదేశంలోనూ మరింత చైతన్యవంతంగా రావాల్సిన అవసరం ఉంది.

-సంపత్ గడ్డం

78933 03516

Next Story