వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పోలీసులను ఆశ్రయించిన మహిళ!

by Prasad Jukanti |   (  Updated:2026-06-27 05:58:54  IST  )

బస్తీ సమస్యలపై చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ పంచాయతీ ఇప్పుడు ఏకంగా పోలీసు స్టేషన్ వరకు చేసింది.

వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని పోలీసులను  ఆశ్రయించిన మహిళ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో ఓ వింత కేసు వెలుగు చూసింది. తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఓ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్‍బీటీ నగర్ (NBT Nagar) బస్తీ సమస్యలపై చర్చించుకునేందుకు స్థానికులు ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ గ్రూప్ లో కొందరు సభ్యులు రాజకీయ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇలాంటి పోస్టులపై స్పందించిన గ్రూప్ అడ్మిన్ గ్రూప్‌లో ఎలాంటి రాజకీయ పరమైన పోస్టులు పెట్టకూడదని సభ్యులందరినీ హెచ్చరించారు.

తిరిగి యాడ్ చేయమని స్టేషన్‍కు:

అయితే రాజకీయ పరమైన సందేశాలు గ్రూప్‍లో పెట్టవద్దని అడ్మిన్ హెచ్చరించినప్పటికీ ఒక మహిళ ఆ గ్రూప్‌లో నిరంతరాయంగా రాజకీయ సందేశాలను పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన అడ్మిన్ ఆమెను గ్రూప్ నుండి తొలగించారు. అయితే గ్రూప్ నుంచి తొలగించడంతో తనన తిరిగి గ్రూప్‍లో యాడ్ చేయాలని సదరు మహిళ గ్రూప్ అడ్మిన్‍ను కోరింది. అందుకు అడ్మిన్ ససేమీరా అనడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ చర్య వల్ల తాను మానసిక వేధింపులకు గురవుతున్నానంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడంతో బంజారాహిల్స్ పోలీసులు గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లు సమాచారం. గ్రూప్ నిబంధనలను ఉల్లంఘించినందుకే ఆమెను తొలగించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను తిరిగి గ్రూప్‌లో చేర్చుకునే ప్రసక్తే లేదని అడ్మిన్ పోలీసుల ముందే తేల్చి చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటూ మహిళ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story