ఓ రోజు.. జార్ఖండ్ మాది అవుతుంది

by Ravi |   (  Updated:2025-08-07 00:45:48  IST  )

దేశ ప్రజాస్వామ్యంలో కొందరు నాయకులు ప్రజల హక్కుల కోసం శక్తిగా పోరాడి, చరిత్రను తిరగరాసారు. అలాంటి అరుదైన

ఓ రోజు.. జార్ఖండ్ మాది అవుతుంది
X

దేశ ప్రజాస్వామ్యంలో కొందరు నాయకులు ప్రజల హక్కుల కోసం శక్తిగా పోరాడి, చరిత్రను తిరగరాసారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ది. ఆయన జీవితం, ఒక సామాన్య గిరిజన బాలుడి నుండి జార్ఖండ్ రాష్ట్ర స్థాపన వరకు సాగిన నిబద్ధతా‌యుతమైన యాత్ర. ఆయన వ్యక్తిగత బాధ, ఉద్యమంగా మారింది. బాధితుల కోసం మాట్లాడే గొంతుగా మారింది.

బాల్యంలోనే, ఉద్యమానికి మార్గం

1944లో సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించిన శిబు సోరెన్, తన తండ్రిని వడ్డీ వ్యాపారులు హత్య చేసిన దృశ్యాన్ని చిన్న వయసులోనే చూశారు. అదే సంఘటన ఆయనకు నిద్రలేని రాత్రులను తీసుకురావడమే కాదు, ఉద్యమ మార్గానికి మొదటి పాదం కూడా అయింది. భూ దోపిడీ, దౌర్జన్యాలు, సామాజిక అసమానతలపై ఆయన పోరాటం మొదలైంది.

ప్రత్యేక రాష్ట్ర సాధనకు దీక్షతో పోరాటం

1970వ దశకంలో బిహార్‌ రాష్ట్ర దక్షిణ భాగంలో గిరిజనులు శతాబ్దాలుగా భూ దోపిడి, సామాజిక వివక్షలకు గురవుతూ తమ సొంత గుర్తింపును కోల్పోతున్నారు. ఈ అన్యాయ పరిస్థితులను మార్చాలనే ధృఢ సంకల్పంతో శిబు సోరెన్, ఏ.కే. రాయ్, బినోద్ బిహారీ మహతోలతో కలిసి 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)ను స్థాపించారు. ఈ ఉద్యమం ఒక సామాజిక చైతన్యంగా ప్రారంభమై, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర లక్ష్యంగా మారింది. ‘ఓ రోజు జార్ఖండ్ మా దేశం అవుతుంది’ అనే నినాదంతో ఆదివాసీలలో ఉత్సాహాన్ని రేకెత్తించారు. భూసేకరణ, అటవీ హక్కులు, సంస్థల దుర్వినియోగంపై పోరాటాలు చేపట్టి కేంద్రానికి జార్ఖండ్ ప్రత్యేకతను గుర్తించాల్సిన అవసరాన్ని బలంగా చాటి చెప్పారు.

జార్ఖండ్ తొలి సీఎం

JMM నేతృత్వంలో గిరిజనులు భారీ ర్యాలీలు, మానవ హక్కుల ఉద్యమాలు నిర్వహించగా, శిబు సోరెన్ రాజకీయ సమన్వయం ద్వారా కాంగ్రెస్‌తో పొత్తు ఏర్పరచి 2000 నవంబర్ 15న జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటింపజేశారు. ఉద్యమ నేతగా మొదలైన ఆయన, ప్రజల విశ్వాసంతో రాజకీయ నాయకుడిగా ఎదిగి, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..

రాజకీయ ప్రస్థానం..

సోరెన్ మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా 2004 మే 23న నియమితులయ్యారు. 2006 నవంబర్ 28న ఆయనపై ఒక హత్య కేసులో దోష నిరూపణ జరగడంతో, 2006 డిసెంబర్ 5న జీవిత ఖైదు విధించడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2007 ఆగస్టు 23న ఢిల్లీ హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. 2018లో సుప్రీంకోర్టు ఈ తీర్పును ధృవీకరించింది. పార్లమెంటులో శిబు సోరెన్ ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎంపీగా సేవలందించారు. జార్ఖండ్ అసెంబ్లీ సభ్యుడిగా కూడా 2005, 2009 ఎన్నికల్లో ఎంపికయ్యారు. తన కుమా రుడు హేమంత్ సోరెన్, ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

శిబు సోరెన్.. ఉద్యమం కాదు

నిజమైన నాయకత్వం పదవులతో రాదని, ప్రజల మద్దతుతోనే స్థిరపడుతుందని శిబు సోరెన్ చాటి చెప్పారు. ఆయన జీవితం ఒక ఉద్యమ గాథ. నిన్నటి బాధితుల పక్షం నుండి నేటి అధికారం దాకా సాగిన మార్గంలో ఆయన చూపిన దీక్ష, ధైర్యం, గిరిజనుల మానవ హక్కుల ఉద్యమాలకు కరదీపికగా నిలిచింది.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story