- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిణిలో కాదు.. రోళ్లు ఇప్పుడే పగులుతున్నయ్!
ఎల్ నినో ప్రభావంతో ముందుగానే తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదంపై ఈ విశ్లేషణ హెచ్చరిస్తుంది. రాబోయే సూపర్ ఎల్ నినో వల్ల వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా చర్చిస్తుంది.

‘రోహిణిలో రోళ్లు పగులుతాయి’ అనేది మన పెద్దల నానుడి. సాధారణంగా మే నెల 25వ తేదీ తర్వాత ‘రోహిణి కార్తె’ ప్రవే శిస్తుంది. అంటే ఆ సమయంలో ఎండల తీవ్రత ఆ స్థాయిలో ఉంటుంది. కానీ, ప్రకృతి గతి తప్పి నెల రోజుల ముందే నిప్పుల వాన కురుస్తోంది. ఏప్రిల్ నెలలోనే ఎండలు 45 డిగ్రీలు దాటే శాయంటే ముందు రాబోయేది మామూలు కాలం కాదని, అత్యంత దారుణమైన విలయకాలం కాబోతోందని ప్రకృతి మనకు పంపుతున్న ప్రత్యక్ష హెచ్చరిక ఇది. గత దశాబ్దాల పొడవునా ఇంత వేడిని తెలుగు రాష్ట్రాలు ఎదుర్కోలేదు.
సూపర్ ఎల్ నినో..
భూమిపై అత్యంత వినాశకరమైన వాతావరణ పరిణామాల్లో ఎల్ నినో ఒకటి. పసిఫిక్ మహా సముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. సగటు ఉష్ణోగ్రత కంటే సముద్రపు నీరు 2.5 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా వేడెక్కితే దానిని 'సూపర్ ఎల్ నినో'గా శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. తాజా నివేదికల ప్రకారం రానున్న జూలై నాటికి ఎల్ నినో ఏర్పడడానికి 61 శాతం అవకాశాలున్నాయి. ఆగస్టు నాటికి బలమైన ఎల్ నినో ఏర్పడడానికి 80 శాతం, ఏకంగా సూపర్ ఎల్ నినోగా మారడానికి 22 శాతం అవకాశాలున్నాయి. అంటే ఈ ఏడాది వాతావరణం అల్లకల్లోలం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
చరిత్ర చెబుతున్న చేదు నిజాలు..!
సుమారు 150 ఏళ్ల క్రితం, 1876-1878 మధ్య కాలంలో వచ్చిన అతిపెద్ద ఎల్ నినో ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది. ఎల్ నినో సృష్టించిన గ్లోబల్ కరువు కారణంగా మానవ జాతిలో దాదాపు 3 నుంచి 4 శాతం మంది తుడిచి పెట్టుకుపోయారు. వర్షాలు లేక, పంటలు పండక, తాగడానికి గుక్కెడు నీరు లేక కోట్లాది మంది ఆకలితో అలమటించి పిట్టల్లా రాలిపోయారు. కొద్దిరోజుల వ్యవధిలోనే నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఆవిరైపోయాయి. భారత దేశంలో తీవ్రమైన కరువు దక్కన్ పీఠభూమిని, ముఖ్యంగా మద్రాసు, బొంబాయి, మైసూరు, హైదరాబాద్‌లను అతలాకుతలం చేసింది. 56 లక్షల నుండి 96 లక్షల మంది ప్రజలు మరణించారని అంచనా. ఈ సారి రాబోతున్నది మాత్రం అత్యంత శక్తివంతమైనదని వాతా వరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి వైపరీత్యాల పరంపర..!
ఎల్‌నినో వస్తే వాతావరణం పూర్తిగా రివర్స్ అవుతుంది. ఎప్పుడూ కరువు ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, వర్షాలు బాగా పడే ప్రాంతాలు ఎడారుల్లా మారుతాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో మొదలయ్యే ఈ ప్రభావం ఏడాది చివరి వరకు కొనసాగుతుంది. ఈ సూపర్ ఎల్ నినో ఎంట్రీ ఇస్తే నైరుతి రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. నైరుతి విఫలమైతే, దాని ప్రభావం ఈశాన్య రుతుపవనాల పైనా పడుతుంది. ఇప్పటికే భారతదేశంలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు అట్టడుగు స్థాయికి పడి పోయాయి. ఒకవైపు మండుతున్న ఎండలకు ఉన్న ప్రాజెక్టుల నీరు ఆవిరైపోతుండగా, మరోవైపు వానలు పడకపోతే చుక్క నీరు ప్రాజెక్టు ల్లోకి చేరదు. అంటే తాగడానికి నీరు, సాగుకు ఆధారం కరువై దేశం కనీవినీ ఎరుగని నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
మేల్కొనాల్సిన సమయం..!
ప్రకృతి హెచ్చరికలు పంపుతున్నప్పుడు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకూడదు. రాబోయే కరువును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. అందుబాటులో ఉన్న జల వనరులను కాపాడుకుంటూ, తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి. పగులుతున్న రోళ్లు కేవలం ఉష్ణోగ్రతలకు మాత్రమే కాదు. రాబోయే విపత్తుకు సంకేతాలు. ఎల్ నినో అనే రాకాసి మన గుమ్మం దాకా వచ్చింది. దాన్ని ఎదుర్కొనేందుకు సమగ్రమైన ప్రణాళిక లేకపోతే మూల్యం చెల్లించేది సామాన్యులే.!
- ఉదయ్ కుమార్ జి.
83676 03197






