యుద్ధాన్ని త్వరగా ముగించడమే ఉత్తమం!

by Ravi |   (  Updated:2025-05-11 01:16:06  IST  )

యుద్ధాన్ని ప్రపంచం భరించలేదు’ భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌

యుద్ధాన్ని త్వరగా ముగించడమే ఉత్తమం!
X

'యుద్ధాన్ని ప్రపంచం భరించలేదు’ భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్‌ హక్ ప్రకటన ఇది. ఆయన ప్రకటన వెనక ఎంతో అంతరార్థం దాగి ఉంది. ఇప్పటికే గాజా - ఇజ్రాయెల్, ఉక్రెయిన్-రష్యా మధ్య నెలలు, సంవత్సరాలుగా యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నది. ఆ యుద్ధాలు ప్రపంచ వాణిజ్యంపైనా తీవ్ర ప్రభావం చూపాయి. అనేక వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగాయి. లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి.

ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అస్థిరత ఎదుర్కొనే ప్రమాదముంది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాల అధినేతలు యుద్ధ పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సైనిక ఘర్షణలు, యుద్ధం ఏదైనా సరే... త్వరగా ముగించడం ప్రపంచానికి మంచిది.

ప్రపంచ దేశాల్లో ఆందోళన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక అంశాలపై యుద్ధ ప్రభావం పడింది. రెండు దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం వల్ల గ్లోబల్ ద్రవ్యోల్బణం 2-3% పెరిగింది. ఆ యుద్ధం వల్ల 40-50 శాతం ధరలు పెరిగి ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం సైతం ఏర్పడింది. పామాయిల్ ధరలు 40-50% పెరిగాయి, ఎరువుల ధరలు సైతం 30% పెరిగాయి. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతో కొన్ని నెలల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండియా-పాకిస్తాన్ యుద్ధం కొన్ని వారాల పాటు కొనసాగినా దాని ప్రభావం వివిధ అంశాలపై పడుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఎగుమతులు, దిగుమతులపై..

భారతదేశం ప్రస్తుతం 4.27 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇండియా ఐటీ, ఫార్మా, వ్యవసాయం, టెక్స్‌ టైల్స్, ఆటోమొబైల్ రంగాల్లో ప్రధాన ఎగుమతిదారు.. ప్రపంచంలో 40 శాతం బియ్యం సరఫరాలో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి దారు.. 10 శాతం సరఫరాతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉంది. ఒకవేళ యుద్ధం పూర్తిస్థాయిలో మొదలైతే ఆహార ద్రవ్యోల్బణం 5-10% పెరగవచ్చు. చమురు ధరల్లో కూడా అస్థిరత ఉండవచ్చు. ఇండియా నుండి ఔషధాలు దిగుమతి చేసుకునే నైజీరియా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి ఆఫ్రికా దేశాల్లో ఔషధ ధరలు 20-30% పెరగడం వల్ల ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదముంది. అలాగే వివిధ దేశాల్లో స్టాక్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడి మదుపరుల సంపద ఆవిరి అయ్యే ప్రమాదముంది. ఇప్పటికే పాకిస్తాన్‌కు చెందిన కరాజీ స్టాక్ ఎక్స్ చేంజ్ 13 శాతానికి పైగా పడిపోయింది. దీంతో ఆ దేశానికి 80 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. భారత స్టాక్ మార్కెట్లు స్థిరంగానే ఉన్నా.. శుక్రవారం నిఫ్టి 250 పాయింట్లకు పైగా, సెన్సెక్ 800 పాయింట్లకు పైగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం భారత్ దగ్గర ఆర్థిక బలం ఎక్కువ. ఈ క్షీణత తాత్కాలికమే. ఇక ఐటీ, ఫార్మా రంగాల్లో అమెరికాకు భారత్ కీలక సరఫరాదారు. యుద్ధం వల్ల ఈ సరఫరాలకు ఆటంకం ఏర్పడితే, అమెరికన్ టెక్, హెల్త్‌ కేర్ స్టాక్‌లపై స్వల్ప ప్రభావం పడవచ్చు. యూరప్‌లోనూ దీని ప్రభావం ఉండొచ్చు.

పాకిస్తాన్ అత్యుత్సాహంతో..

పహెల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో భారతదేశం ఉగ్రవాద కేంద్రాలను టార్గెట్‌గా చేసుకొని దాడి చేసింది. సంయమనం పాటించాల్సిన పాకిస్తాన్ అత్యు త్సాహం చూపింది. రెచ్చగొట్టేలా ఇండియాలోని పలు చోట్ల డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నించడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నది. కేవలం 348 బిలియన్ డాలర్లతో అత్యంత బలహీనంగా ఉంది. 130 బిలియన్ డాలర్ల రుణంలో కూరుకుపోయి ఉంది. ఫారెక్స్ రిజర్వు నిల్వలు సైతం అతి తక్కువగా ఉన్నాయి. ఐఎంఎఫ్ బెయిలౌట్లపై ఆధారపడుతున్నది. భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిగా ఇండియా నుంచి దిగుమతులను నిషేధించింది. ఇది ఆ దేశ వైద్యరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం అక్కడ అత్యవసర మందులు దొరకని పరిస్థితి నెలకొన్నది. యుద్ధ భయాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్ధం వస్తే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారుతుంది.

ప్రజలపై పట్టింపు లేకపోవడంతో..

రోజు రోజుకూ పాకిస్తాన్ రూపాయి మరింత పడిపోతుంది. నీటి కొరతతో పాటు గోధుమలు, బియ్యం, కూరగాయల ధరలు పెరుగుతాయి. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్న ధరలను భరించడం అక్కడి ప్రజలకు కష్టతరంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం ఆ దేశం వద్ద సైనిక వనరులు కూడా కొన్ని రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచదేశాలు సైతం పాకిస్తాన్‌ను దోషిగానే చూస్తున్నాయి. అక్కడి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్ సహాయం, అంతర్జాతీయ సహకారం మరింత సంక్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అక్కడి దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మౌనంగా ఉండడమే మంచిది. అత్యుత్సాహానికి వెళ్లి భారత్‌ను రెచ్చగొడితే ఆ దేశం తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదు. ఈ విషయం అక్కడి ప్రభుత్వానికి, ఆర్మీకీ తెలుసు. అయినా అలాగే వ్యవహరిస్తున్నారంటే ఆ దేశ పాలకులకు అక్కడి ప్రజల పట్ల ఏ మాత్రం చింత, పట్టింపు లేదని అర్థమవుతున్నది.

-ఫిరోజ్ ఖాన్,

96404 66464

Next Story