సామాజిక సమానత్వం రావాలంటే.. జనగణనలో కులగణన చేస్తేనే సరిపోదు!

by Ravi |   (  Updated:2025-05-04 01:15:37  IST  )

జనగణనలో కులగణన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ కేంద్రం మాత్రం ఈ విధానం వల్ల

సామాజిక సమానత్వం రావాలంటే.. జనగణనలో కులగణన చేస్తేనే సరిపోదు!
X

జనగణనలో కులగణన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ కేంద్రం మాత్రం ఈ విధానం వల్ల దేశ ఐక్యత దెబ్బతింటుందని తోసిపుచ్చుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం జన గణనలో కులగణనని చేస్తామని నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణా మం. అయితే ఇల్లు అలుకగానే పండుగా కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంబడే సంబరపడిపోకూడదు. కులగణన రిపోర్టు కనుగుణంగా మండల కమిషన్ సూచించిన 40 సిఫార్సులను అమలు చేయాలి. అప్పుడే జనగణనలో కులగణన చేపట్టిన దానికి సార్ధకత చేకూరుతుంది.

చరిత్ర అన్నివేళలా ఒకేలా ఉండదు. కాలమాన పరిస్థితులకు తగ్గట్లు మారుతూ ఉంటుంది. కారల్ మార్క్స్ చెప్పినట్లు చరిత్ర అంటే వర్గ పోరాటమే. 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమం, 20వ శతాబ్దంలో జాతీయ స్వాతంత్ర్య పోరాటం, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, ప్రస్తుతం 21వ శతాబ్దంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సరియైన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ జనగణనలో కులగణనకై ఉద్యమం. ఇలా ఆయా కాలాల్లో ఆయా ఉద్యమాలు సమాజంపై ప్రభావాన్ని చూపుతూ చరిత్రగా నిలిచిపోయాయి.

చాలా కాలంగా ఉన్న డిమాండ్

జనగణనలో కులగణన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 1931 జనాభా లెక్కల నేపథ్యంలో జనగణనలో కులగణన చేయాలనే ప్రతిపాదన 1951 జనాభా లెక్కల సందర్భంగా ముందుకొచ్చినప్పటికీ కేవలం ఎస్సీ, ఎస్టీల జనాభాను మాత్రమే లెక్కించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొదటి బీసీ కమిషన్, కాక కాళేశ్వర్ కమిషన్ సందర్భంగా, రెండవ బీసీ కమిషన్ మండల కమిషన్ సందర్భంగా జనగణలో కులగణన చర్చకు వచ్చింది. అయినా కేంద్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కూడా జనగణలో కులగణన డిమాండ్ మరోసారి ముందుకొచ్చింది. ఇలా ఎన్నోసార్లు ఈ డిమాండ్ ముందుకొచ్చినప్పటికీ కేంద్రం మాత్రం జనగణనలో కులగణన వల్ల దేశ ఐక్యత దెబ్బతింటుందని తోసిపుచ్చుతూ వచ్చింది. భాషా సంయుక్త రాష్ట్రాల విషయంలో కూడా ఈ రకమైన అభిప్రాయంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. 70 సంవత్సరాల భాష సంయుక్త రాష్ట్రాల చరిత్రలో దేశాన్ని విచ్ఛిన్నం చేయగల అనైక్యత ఎక్కడా సంభవించలేదని చెప్పవచ్చు. అంటే ఒక విషయంపై మనలో చాలాకాలంగా గూడు కట్టుకున్న ఆలోచనలు వాస్తవం కాదని తేలిపోయింది.

ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే!

జనగణనలో కుల గణన చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడల్లా తోసిపుచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. 2011లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, కులగణన చేయడం జనగణనలో కులగణనకు మొదటిమెట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం జన గణనలో కుల గణనని వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం అది చేస్తామని నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. అయితే ఈ ఘనత మాత్రం దేశ వ్యాప్తంగా ఈ వాదాన్ని చర్చకు తెచ్చిన కాంగ్రెస్ పార్టీది, ఆయా రాష్ట్రాల్లో జనగణనలో కులగణనకై డిమాండ్ చేసిన డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ లాంటి ప్రాంతీయ పార్టీలది, కులగణన చేయడమే కాదు, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ శాసనసభ చట్టం చేసిన తెలంగాణ రాష్ట్రానిదే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణనకు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణనకు వాగ్దానం చేయడం, రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించడం, బీసీ సంఘాల ఒత్తిడి నేపథ్యంలో కులగణన జరగడం, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల పెంపుకై శాసనసభ చట్టం చేస్తూ కేంద్రానికి పంపడం చకచగా జరిగిపోయాయి. 42శాతం రిజర్వేషన్లు అమలు కోసం బీసీ సంఘాలు ఢిల్లీలో "జంతర్ మంతర్" వద్ద డిమాండ్ చేయడంతో కులగణనపై కేంద్రం ఆలోచనలో మార్పు వచ్చి ఉండొచ్చు. అలాగే కర్ణాటక, తెలంగాణతో పాటు బిహార్ లాంటి రాష్ట్రాలు కులగణన పూర్తి చేయడం దేశంలో చాలా రాష్ట్రాల్లో కులగణనకై డిమాండ్లు వినిపించడంతో ఒక్కసారిగా కేంద్రం పునరాలోచనలో పడి ఉండవచ్చు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ తగ్గడం, రానున్న బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జన గణలో కులగణననే ప్రధాన ప్రచారంశంగా ఉండడంతో కేంద్రం ఆలోచన మారి ఉండవచ్చు.

ఇల్లు అలుకగానే పండగా కాదు

జనగణనలో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఇల్లు అలుకగానే పండుగా కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంబడి సంబరపడిపోకూడదు. ఈ గణనకై కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మార్గదర్శకాలను బీసీ సమాజం నిశితంగా గమనించాలి. జనగణనలో కులగణన చేస్తే సరిపోదు. కులగణన రిపోర్టు కనుగుణంగా మండల కమిషన్ సూచించిన 40 సిఫారసులను అమలు చేయాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య ఉద్యోగ రంగాల్లో సమానత్వం సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే జనగణనలో కులగణన చేపట్టిన దానికి సార్థకత చేకూరుతుంది. రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించబడుతుంది.

జుర్రు నారాయణ యాదవ్

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,

తెలంగాణ టీచర్స్ యూనియన్

9494019270

Next Story