మాతృ‌భాష ఒక్కటే వస్తే సరిపోదు..

by Ravi |   (  Updated:2025-03-15 09:27:52  IST  )

ఇటీవల దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషను వ్యతిరేకిస్తూ దక్షణాది రాష్ట్రాల

మాతృ‌భాష ఒక్కటే వస్తే సరిపోదు..
X

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషను వ్యతిరేకిస్తూ దక్షణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఏకం చేస్తూ హిందీని మాపై బలవంతంగా రుద్దొద్దు అనే నినాదంతో ఉద్యమానికి ఊపిరులు పోస్తున్నారు. చివరికి బడ్జెట్ కాపీలపై జాతీయ కరెన్సీ చిహ్నం ₹ ని కూడా తొలగించేంత దశకు హిందీ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు.ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరోటి కాదు. భారత దేశంలో ఎన్నో భాషలు ఉనికిలో ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో మూడు నుండి నాలుగు భాషలు మాట్లాడేవారు ఉన్నారు.

ఒక వ్యక్తి తన అభిమతాన్ని, తను చెప్పదలచుకున్నది, తన మనసులోని భావాన్ని ఇతరులతో పంచుకోవడానికి భాష అవసరం. భారత భౌగోళిక, నైసర్గిక ప్రాంతాల వారిగా భాషలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికీ లిపి లేని భాషాలు ఆటవిక, గిరిజన తెగల వారు మాట్లాడుకుంటారు. అధికారికంగా 14 భాషలు గుర్తించినప్పటికి నేడు 22 భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. మరియు వందలాది ఇతర భాషలు ఉనికిలో, ఉనికిని కోల్పోతూ ఉన్నాయి.

మాతృ భాషను అభిమానించాలే కానీ..

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు దక్షణాది రాష్ట్రాలు మాత్రం వారి భాషలుగా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు వారి మాతృ భాష ప్రాతిపదికగా విభజించబడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాలు హిందీ అధికార భాషగా ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలు అన్ని కలసి కట్టుగా, ఒకరినొకరు సాంఘీక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక స్థితి గతులను అర్థం చేసుకోవడానికి వారి వారి భాష తెలిసినప్పుడే భావం సరిగ్గా అర్థం అవుతుంది. తమిళులు జాతీయ స్థాయి వేదికలపై కూడా వారి భాషలో ప్రసంగిస్తారు. అది వారికి సౌలభ్యంతో పాటు గర్వకారణం కావచ్చు. కానీ అదే సభలో లేదా సదస్సులో ఇతర భాషల వారికి అదొక పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో విజ్ఞానం ఎలా పంచగలరు. ఎవరైనా సరే మాతృ భాషలో నిష్ణాతులుగా ఉండాలి. ప్రేమించాలి, గౌరవించాలి. మాతృ భాషను అభిమానించాలే కానీ ఇతర భాషలపై దురభిమానం కాకూడదు. అప్పుడే సృహద్భావ వాతావరణం వెల్లివిరుస్తుంది. కేవలం ఒక్క నా మాతృ భాషనే నేను నేర్చుకుంటాను అంటే సమాజానికి ఏమీ నష్టం లేదు కేవలం ఆ వ్యక్తి ఇతర సమాజంతో లింక్ కోల్పోతాడు అంతే..

ఒక్కటే భాష మాట్లాడాలన్న నియమం లేదు

1955 సెప్టెంబర్‌లో ఫజల్ అలీ కమీషన్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూనే ఒక భాష ఒక రాష్ట్రం అనే డిమాండ్‌ను తిరస్కరించింది. కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో దేశ ఐక్యతను, రక్షణను బలోపేతం చేసేలా చర్యలు ఉండాలని, భాష సాంస్కృతిక పరమైన సజాతీయత ఉండాలని అభిప్రాయపడింది. దీనికి అనుగుణంగా 1956లో పార్లమెంట్ రాష్ట్రాల పున్వ్యవస్థీకరణ చట్టం ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. తదుపరి మరిన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే దీని భావం ఒక రాష్ట్రంలో కేవలం ఆ ఒక్క భాష మాట్లాడేవారే ఉండాలి అన్న నియమం లేదు అని గమనించాలి. తెలంగాణలో ప్రజలు తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, ఆంగ్లం మాత్రమే కాకుండా ఇతర భాషల వారు కూడా ఎలాంటి సమస్య లేకుండా మాట్లాడతారు. హైదరాబాద్‌లో విదేశీయులు సహితం భాషా సమస్య ఎదుర్కోరు.

త్రి భాషా విధానం

1968 లో భారత ప్రభుత్వం పాఠశాల విద్యా స్థాయిలోనే వివిధ భాషలు నేర్చుకోవాలనే సత్ సంకల్పంతో త్రి భాషా సూత్రాన్ని అమలు లోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ, ఆంగ్లంతో పాటు మరో ఆధునిక భారతీయ భాషను (ముఖ్యంగా దక్షణ భారత భాషను), అలాగే దక్షణాది రాష్ట్రాలు హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషను నేర్చుకోవాలని నిర్ణయించారు. కానీ తమిళనాట ఈ విధానం అమలు కావడం లేదు.

భాష.. సాంస్కృతిక వారధి. నాకు ఇతర భాషలు నేర్చుకోవాలని కుతూహలం ఉంది. ఎందుకంటే మా సంస్థలో పని చేసే వారు కొందరు కన్నడ, మరాఠీ, తమిళం, ఒడిషా మరియు కొంకిణిల్లో ఒకటి రెండు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు. ఇది వారికి రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుండి వచ్చిన వారు గనుక. ఆయా రాష్ట్రాల ప్రజలు వచ్చినప్పుడు వారి భాషలో మాట్లాడడం వల్ల వారి సంతోషం, ఆనందం స్పష్టంగా కన్పిస్తుంది. వారికి మన వాడు ఉన్నాడు అనే భరోసా వస్తుంది. ఆత్మీయత వెల్లివిరుస్తుంది. ఇది సంస్కృతీ సంప్రదాయాల వారధిగా సాంస్కృతిక విప్లవానికి దారితీస్తుంది.

ఇతర భాషలు నేర్చుకోవడం వలన..

మన తెలుగు తేజం, మాజీ ప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు గారు పద్నాలుగు భాషల్లో నిష్ణాతులు. ఏ రాష్ట్రం వెళితే ఆ రాష్ట్ర భాషలో మాట్లాడి వారి మనసు దోచుకునేవారు. అలాగే ఎందరో బహు భాషావేత్తలు సాంస్కృతిక వారధులుగా చరిత్రలో నిలిచారు. బ్రిటిష్ వారు సహితం ఇక్కడి ప్రాంతీయ భాషలు నేర్చుకొని ఇక్కడి వారితో మమేకం అయ్యారు. కేవలం దేశీయ భాషలే కాకుండా ఇతర దేశాల భాషలు నేర్చుకోవడం ద్వారా ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందవచ్చు. అంతేగాని కేవలం మాతృ భాషకే పరిమతమై నూతిలో కప్పలా కాకుండా అన్య భాషలు వీలైనన్ని నేర్చుకొనడం వల్ల ప్రపంచం అంతా ఒక్కటే అన్న భావం వస్తుంది. ఏడు నుండి ఎనమిది భాషలు అనర్గళంగా మాట్లాడగల రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సుధాముర్తి గారు 2020 భారత జాతీయ విద్యావిధానాన్ని, త్రి భాషా సూత్రాన్ని సమర్ధించడాన్ని మిగతా రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.

హిందీ నేర్చుకోవడం వలన..

ప్రజలు రాజకీయ నాయకులు స్వంత ఎజెండాలు ప్రక్కన పెట్టి మాతృ భాషలతో పాటు ఇతర దేశీయ భాషలు నేర్చుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. అదే విధంగా నేడు ఆంగ్లం ప్రపంచాన్ని ఏకం చేస్తున్నప్పటికినీ దేశంలో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో మమేకం కావడానికి రాష్ట్ర భాష (జాతీయ భాష) హిందీ నేర్చుకోవడం అవసరమే.. వివిధ భాషలు నేర్చుకోవడాన్ని గర్వంగా భావించాలి కానీ భారంగా కాదు. నేడు ఎందరో దక్షణాది నాయకులు పార్లమెంట్ లో హిందీ లో, ఆంగ్లంలో అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. యువ పార్లమెంటేరియన్ కింజరపు రామ్మోహన్ నాయుడు అందుకు మంచి ఉదాహరణ. తమిళులు వారు హిందీ నేర్చుకోవడం వల్ల కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించవచ్చు. భాష వారి అభివృద్ధిలో ఒక నియంత్రణ (స్పీడ్ బ్రేకర్) కావద్దు ఎవరికీ . భారత దేశంలోని వివిధ రాష్ట్రాలు ఒక్కో పువ్వు అనుకుంటే ఆ పూలన్నీ కలిపే దారం హిందీ కావాలి. అదే భరతమాత మెడలో పూదండ కావాలి.

శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

94416 73339

Next Story