- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో మైలురాయి చేరిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 2025 జూలై 30 బుధవారం సాయంత్రం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 2025 జూలై 30 బుధవారం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుండి జీఎస్ఎల్‌వీ -ఎఫ్16 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ కేవలం భారతదేశ అంతరిక్ష శక్తిని చాటి చెప్పడమే కాకుండా ప్రపంచ శాస్త్రవేత్తల మధ్య సహకారానికి నిదర్శనం.
సొంత క్రయోజెనిక్ ఇంజిన్‌తో..
సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల అంచనా వ్యయంతో కూడిన ఈ భారీ అంతరిక్ష మిషన్ నాసా, ఇస్రో సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఆర్థిక భారాన్ని, సాంకేతిక నష్టాలను పంచుకోవడానికి వీలు కల్పించింది. ఈ రాకెట్ 51.7 మీటర్ల ఎత్తు, సుమారు 420 టన్నుల బరువు కలిగి ఉంది. ఇస్రో చేపట్టిన 18వ జీఎస్ఎల్‌వీ రాకెట్ ప్రయోగం. పైగా ఇస్రో సొంత క్రయోజెనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి చేసిన 12వ ప్రయోగం. సాధారణంగా భూమికి అత్యంత ఎత్తులో ఉండే కక్ష్యలలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఉపయోగించే ఈ రాకెట్‌ను ఈ సారి సూర్య సమకాలిక ధ్రువ కక్ష్యలోకి పంపడం ద్వారా ఇస్రో తన సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది ఏ రకమైన మిషన్లకైనా రాకెట్లను ఉపయోగించగల ఇస్రో నైపు ణ్యాన్ని తెలియజేస్తుంది. మూడు దశల ఈ రాకెట్ మొదటి దశ ఘన ఇంధనంతో, రెండవ దశ ద్రవ ఇంధనంతో, మూడవ దశ అధునాతన క్రయోజెనిక్ ఇంజిన్‌తో పనిచేసింది. గతంలో అనేక దేశాలు ఈ సాంకేతికతను భారతదేశంతో పంచుకోవడానికి నిరాకరించాయి.
భూమికి ఎక్స్-రే లాంటిది
ఈ ఉపగ్రహం సాధారణ ఉపగ్రహంలా కాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా రెండు వేర్వేరు పౌనఃపున్యాలను (ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్) ఉపయోగించే రాడార్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ రెండు పౌనఃపున్యాల వలన 'నిసార్' మేఘాలను కూడా ఛేదించి పగలు, రాత్రి తేడా లేకుండా భూమిపై, మంచుపై ఉన్న ప్రాంతాలను చాలా స్పష్టంగా చిత్రీకరించగలదు. ఈ మిషన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. హిమాలయ పర్వతాలలో హిమానీ నదాలు, మంచు పలకల ఆరోగ్యంపై, నీటి లభ్యతను అంచనా వేయడానికి, హిమానీ నద సరస్సుల నుండి వచ్చే వరదలను అంచనా వేయడానికి సహాయపడుతుంది. అడవుల ఆరోగ్యం, వృక్షజాలం, కార్బన్ నిల్వలు, భూమిపై పచ్చదనాన్ని పర్యవేక్షించి వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా విపత్తు ప్రతిస్పందన ప్రయత్నాలను మెరుగు పరుస్తుంది.
అంతర్జాతీయ సహకారానికి చిహ్నం
ఈ మిషన్, అంతరిక్షంలో అంతర్జాతీయ సహకారానికి బలమైన చిహ్నం. ప్రపంచంలోని రెండు ప్రముఖ అంతరిక్ష సంస్థలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలా కలిసి వచ్చాయో ఇది చూపిస్తుంది. పైగా ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశ స్థానాన్ని నమ్మకమైన, సమర్థవంతమైన భాగస్వామిగా బలపరుస్తుంది. గగన్‌యాన్ మానవ అంతరిక్ష ప్రయాణ కార్య క్రమం, భారతీయ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి వంటి భవి ష్యత్ ప్రతిష్టాత్మక మిషన్లకు మార్గం సుగమం చేస్తుంది. నిసార్ ఉత్పత్తి చేసే డేటా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీని ప్రయోజనాలు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభు త్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలచే పొందబడతాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో 'నిసార్' వంటి మిషన్లు కేవలం శాస్త్రీయ విజయాలు మాత్రమే కాకుండా విధాన నిర్ణయాలు, ప్రమాద అంచనా, ప్రపంచ స్థిరత్వాన్ని పెంపొందించడానికి అనివార్యమైన సాధనాలు.. ఈ మిషన్ విజయవంతం కావడం భారతదేశానికి ఎంతో గర్వించదగిన క్షణం!
-డి. జె. మోహన రావు
82470 45230






