- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫించన్ ధ్రువీకరణకు ఇది సరైన సమయమేనా?
చేయూత పింఛన్ల స్వీయ ధ్రువీకరణ కోసం వృద్ధులు, దివ్యాంగులను మండే ఎండల్లో పంచాయతీ కార్యాలయాలకు పిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ వల్ల బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వంపై వస్తున్న ప్రశ్నలపై విశ్లేషణ.

రాష్ట్రంలో చేయూత పింఛన్లు పొందుతున్న లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, అశక్తులపై ప్రభుత్వం తాజాగా అమలు చేయబోతున్న స్వీయ ధ్రువీకరణ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. ఎండలు భగ్గుమంటున్న ఈ సమయంలో గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాలకు వెళ్లి వేలిముద్రలు, ముఖ గుర్తింపు ద్వారా లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలని ఆదేశించడం మానవీయ కోణంలో సరైన నిర్ణయమా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ల దుర్వినియోగాన్ని అరికట్టడం అవసరమే అయినా, ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితుల్లో బలహీన వర్గాలపై ఈ భారం మోపడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
పింఛన్‌లు దుర్వినియోగం అవ్వకుండా..
ఈ 15 నుంచి వచ్చే నెల 15 వరకు స్వీయ ధ్రువీకరణ కోసం లాభితులు గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో శిబిరాలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్దేశించినట్టు తెలుస్తోంది. అక్కడ లైవ్ అథెంటికేషన్ కోసం వేలి ముద్ర, ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయించుకోవాలి. ఇందుకోసం పూటలకు పూటలు పట్టొచ్చు. చేయూత పెన్షన్లు దుర్వినియోగం అవకుండా, చనిపోయిన వారి పేర్లు జాబితాలోంచి తొలగించేలా ఈ జాగ్రత్తలకు పురమాయిస్తున్నారు మంచిదే. కానీ ఇందుకు ఇది అనువు గాని సమయం. ఎండలు 45 - 47 డిగ్రీలతో బెంబేలెత్తిస్తున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. కొలిమి సెగ వలె ఎండలు మండుతూ చెమటలు కక్కిస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నీడ పట్టున ఇంట్లో ఉంటేనే ఆగమాగం అవుతోంది. అలాంటిది ఈ ప్రతికూల వాతావరణంలో అదీ వయోధికులు బయటకు వస్తే అపాయమే. ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితుల్లో బలహీన వర్గాలపై ఈ భారం మోపడం అవసరమా? అంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎలుకలున్నాయని ఇల్లు కాలబెట్టుకుంటామా?
పది డిపార్ట్మెంట్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేయూత పెన్షన్లు పొందుతున్న 42.23 లక్షల మందిలో సింహభాగం వయోభార పీడితులు, కదల్లేని, చూపు లేని దివ్యాంగులు, అచేతనులే ఉంటారు. వృద్ధాప్య, వితంతు, ఒంటరి (మహిళలు), బీడీ, చేనేత, కల్లు గీత, హెచ్ఐవీ, బోదకాలు, డయాలసిస్ బాధితులతో పాటు దివ్యాంగులు సాధారణ కేటగిరీలో రూ. 2,016, దివ్యాంగ కేటగిరీలో రూ.4,016 సామాజిక భద్రతా పింఛన్లు అందుకునేలా ప్రభుత్వం నెలకు సుమారు రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తోంది. ఇంతలా ఆదుకొంటున్న సర్కారు ఎలుకలు ఉన్నాయని ఇల్లు కాలబెట్టినట్టు.. ఎక్కడో మృతి చెందిన వారి పేరిటా పెన్షన్లు పోతున్నాయనే కారణంతో పండుటాకులు, నిస్సహాయులు, అభాగ్యులే ఎక్కువగా ఉండే మొత్తం 42.23 లక్షల మంది లాభితులు సమయం కాని సమయంలో గడప దాటేలా పెద్ద పరీక్షే పెడుతున్నది. నిజానికి గృహ గణన, ఓటర్ల తనిఖీకి ఇంటింటికీ యంత్రాంగాన్ని పంపిస్తున్న ప్రభుత్వం మరొకరి ఊతం/సహాయం లేనిదే కదల్లేని చేయూత లాభితులను మాత్రం ఆఫీసులకే అదీ ఈ గొట్టు ఎండల్లో పిలుస్తోంది.
ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి!
ఇది చేయడానికి కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల టైం ఇవ్వడమో, లేకపోతే ఈ క్యాంపులను ఎండలు తగ్గేదాకా వాయిదా వేయడమో చేయాలి. ఇంకా చెప్పాలంటే, ఆ అభాగ్యుల పట్ల మానవతా దృక్పథంతో ర్యాండమ్‌గా, లేదా డౌట్ ఉన్న ఇళ్లకు సిబ్బందిని పంపించి లబ్ధిదారులు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయించాలి. వచ్చే జూన్ 2 నాటికి మరో 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇచ్చే శుభవార్త చెబుతున్న ప్రభుత్వం ఆల్రెడీ ఉన్న లబ్ధిదారులను మాత్రం ఈ ఎండల్లో గాభరా పెట్టేస్తోంది. ఎండల్లో ఈ క్యాంపుల పుణ్యమాని ఏ ఒక్క లబ్ధిదారు ప్రాణాలకు హాని కలుగకుండా ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తగిన విధంగా జోక్యం చేసుకోవాలి.
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384






