- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనం సాధిస్తున్న ప్రగతి ఇదేనా?
పరిణామక్రమంలో భాగంగా ప్రకృతితో సహజీవనం నుండి యాంత్రిక జీవనానికి, మానవత్వం నుండి స్వార్థానికి మనిషి మెల్లగా మారిపోయాడు. ఒకప్పుడు దావఖానాలు లేకుండానే జీవించిన మనిషి, నేడు అవి లేకపోతే బతకలేని పరిస్థితికి చేరుకున్నాడు.

పరిణామక్రమంలో భాగంగా ప్రకృతితో సహజీవనం నుండి యాంత్రిక జీవనానికి, మానవత్వం నుండి స్వార్థానికి మనిషి మెల్లగా మారిపోయాడు. ఒకప్పుడు దావఖానాలు లేకుండానే జీవించిన మనిషి, నేడు అవి లేకపోతే బతకలేని పరిస్థితికి చేరుకున్నాడు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, పేదవాడి కడుపు నింపలేకపోతున్నదన్నది చేదు నిజం. ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడే తప్ప, పేదవాడు మాత్రం మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాడు. గతంలో అధికశాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి, కృత్రిమ రసాయనాలు లేకుండా పంటలు పండిస్తూ ఆరోగ్యంగా జీవించేవారు. కానీ నేడు కార్పొరేట్ సంస్థలు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చి, అధిక లాభాల కోసం రసాయనాలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. దీనివల్ల గ్రామాల్లోని సన్నకారు రైతులు కూడా ఆహార పంటలకంటే వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. అయినప్పటికీ సరైన గిట్టుబాటు ధరలు లేక, అధిక వడ్డీల అప్పుల్లో చిక్కుకుని ఆత్మహత్యల దాకా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మార్కెట్లలో లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రసాయనాలతో పండించబడడం వల్ల వాటి పోషక విలువ తగ్గి, అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు లేకున్నా మనిషి దీర్ఘాయుష్షు పొందేవాడు. నేడు ఆసుపత్రులు పెరిగినా బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులతో జనాలు అర్ధాయుష్షుకే పరిమితమవుతున్నారు. అటవీ వినాశనం, కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ రాబోయే తరాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పాలకులు హామీలకే పరిమితమై, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన బలపడుతోంది. ఏ దేశానికైనా అభివృద్ధి అవసరమే. కానీ అది సామాన్యుడి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచాలి. నష్టాలను గుర్తించి, సరిదిద్దే విధానాలు అమలులోకి రావాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేదలు, రైతులు, అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని పారదర్శకంగా అభివృద్ధి పథకాలు అమలు చేసి, భవిష్యత్ తరాలకు భరోసా కల్పించాలని కోరుకుందాం. మనిషి చేతిలో ఉన్న శాస్త్ర సాంకేతిక ప్రగతి మానవత్వాన్ని నశింపజేస్తే అది అభివృద్ధి కాదు. సామాన్యుడి జీవనాన్ని సుస్థిరం చేసి రాబోయే తరాలకు భరోసానిస్తేనే అది నిజమైన ప్రగతి అని మనమందరం గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది.
-డా.పోలం సైదులు,
94419 30361






