- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరెస్టు భయంతోనే ఈ కుప్పిగంతులా?
‘నాకు భయం లేదు’ అని గొప్పగా చెప్పుకునే నేతలు.. విచారణ పేరు వినగానే వణికిపోవడం కొత్త కాదు. అధికారం చేతిలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యాన్ని తొక్కి, ప్రతిపక్షాల గొంతులు నొక్కి ఇప్పుడు అదే ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు వచ్చేసరికి మాటలతోనే యుద్ధం చేస్తున్నారు.

‘నాకు భయం లేదు’ అని గొప్పగా చెప్పుకునే నేతలు.. విచారణ పేరు వినగానే వణికిపోవడం కొత్త కాదు. అధికారం చేతిలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యాన్ని తొక్కి, ప్రతిపక్షాల గొంతులు నొక్కి ఇప్పుడు అదే ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు వచ్చేసరికి మాటలతోనే యుద్ధం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ ప్రారంభమైన నాటి నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ప్రవర్తన చూస్తే.. ధైర్యం నటన ఒకటి, లోపల దాగి ఉన్న భయం ఇంకొకటి అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అరెస్టు చేస్తారా? చేయలేరా? అంటూ మీడియా ముందు సవాళ్లు విసురుతూనే.. మరోవైపు అదే భయం ఆయన మాటల్లో, చేష్టల్లో ప్రతిరోజూ బయటపడుతోంది.
అధికారంలో ఉన్నన్ని రోజూలు ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులపై రకరకాల కేసులు బనాయించి.. అర్ధరాత్రుళ్లు ఇళ్లపై పడి తలుపులు బద్దలుగొట్టి వారిని ఎత్తుకెళ్లిన రోజులు కేటీఆర్ అప్పుడే మర్చిపోయారా? లేక వారి హయాంలో మాదిరే అర్ధరాత్రిళ్లు ఎత్తుకు వెళ్లకుండా ఇలా మర్యాదపూర్వకంగా నోటీసులు ఇచ్చి పిలుస్తుండడం ఆయనకు నచ్చడం లేదా?
కూతురు చెప్పినా బుకాయిస్తారా?
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు సాధారణ ఫోన్లలో మాట్లాడడం మానేసి వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకునేవారు.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు సైతం తమ మాటలను బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వింటున్నారోనని హడలి పోయేవారు.. తనకు ఫోన్ చేయొద్దని స్వయంగా హరీశ్ రావు బీఆర్‌ఎస్ నాయకులకు చెప్పారని కేసీఆర్ కుటుంబంతో తొలి నుంచి అనుబంధం ఉన్నవి. ప్రకాశ్ ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కేటీఆర్ చెల్లెలు కవిత తన భర్త ఫోన్‌ను సైతం ట్యాప్ చేశారని స్వయంగా మీడియా ముందే చెప్పారు.. ఆ ఇంటి ఆడ బిడ్డే ఈ విషయం చెప్పిన తర్వాత కూడా ఇంకా తాము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని.. తాము సుద్దపూసలమని బుకాయించడం కేటీఆర్, హరీశ్ రావులకే చెల్లింది.
ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని..
ఉద్యమాన్ని కవచంగా చేసుకొని అడ్డగోలుగా మాట్లాడడాన్ని అలవాటు చేసుకున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు.. అధికారంలో ఉన్నప్పుడు మరింతగా రెచ్చిపోయారు. కేసీఆర్ బహిరంగ సభలు, ప్రెస్‌మీట్లలో వాడిన పరమ కంపు పదజాలమంతా ప్రజలకు గుర్తే ఉంది. తమకు నచ్చని వారిని.. తమ వ్యతిరేకులను తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రలు వేసి అడ్డగోలుగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను, నిబంధనలు అంగీకరించవని చెప్పిన అధికారులను వీరు తిట్టిన తిట్లు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంటాయి. హరీశ్ రావు ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏకంగా ఓ బీసీ అధికారిని కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించాడు. అదేమంటే ఉద్యమకారులమని.. అవతలివాళ్లు తెలంగాణ ద్రోహులని సమర్థించుకున్నారు. ఉద్యమంలో భాగంగా వాటిని ప్రజలు చూసీచూడనట్లు వదిలేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీరుమారలేదు.. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామని... తమ అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వారు మర్చిపోయారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వంటి అనైతిక చర్యలకు తెగబడ్డారు. ఇప్పుడు మాత్రం తమకేం తెలియదని.. తాము సత్య హరిశ్చంద్రుల వారసులమని బావ, బావమరుదులు ప్రకటనలు ఇస్తున్నారు..
అందుకే ప్రభుత్వంపై విమర్శలు..
నిజానికి ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటేనే హరీశ్ రావు, కేటీఆర్ వణికిపోతున్నారు. విచారణకు పిలిచిన ప్రతిసారి తామేదో స్వాతంత్య్ర పోరాటానికి వెళ్లి వచ్చిన వారిలా జిల్లాలు, మండలాలు, గ్రామాల నుంచి నేతలు, కార్యకర్తలను పిలిపించి స్వాగతాలు చెప్పించుకుంటున్నారు. పైగా తామే సిట్‌ను విచారించినట్లు ఫోజులు కొడుతున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం విచారణ చేపడుతున్న అధికారుల అంతు చూస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక నోటీసులు ఇచ్చింది మొదలు తమ మీడియా చేత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అసత్యాల ప్రచారం చేయిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం అధికారికంగా నిరూపితమైతే తాము రాజకీయంగా శాశ్వతంగా సమాధి అవుతామనే విషయం వారికి తెలుసు.. అందుకే నిత్యం అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారు. ఆ మాటలకు ఆయన రెచ్చిపోయి వారిని అరెస్టు చేయిస్తే విషయాన్ని పక్కదారి పట్టించాలనే కుట్రతో బావ బావమరదులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి..
బీఆర్ఎస్ నాయకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి.. రేవంత్ రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు.. అనేక అవమానాలు, అవహేళలను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థానం వరకు ఎదిగిన నాయకుడు. ప్రతీకారం ఆయన మార్గం కాదు.. అదే ప్రధానమని భావిస్తే ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు పదుల సార్లు జైలుపాలయ్యే వారు.. ప్రజలు అన్నింటిని గమనిస్తూనే ఉన్నారు. అందుకే శాసనసభ ఎన్నికల నుంచి ప్రారంభమైన బీఆర్ఎస్ పతనం లోక్‌సభ ఎన్నికల్లో.. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లోనూ కొనసాగింది. ఇకనైనా వారు తీరుమార్చుకోకుంటే మున్ముందు ముసళ్ల పండుగను ఎదుర్కోక తప్పదు..
- ఆది శ్రీనివాస్,
విప్, తెలంగాణ ప్రభుత్వం






