- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాలలోనే వారసత్వం ఉందా..?
రాజకీయాల్లో వారసత్వం తగునా, తగదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. భారత సర్వోన్నత న్యాయస్థానం ముఖ్య న్యాయాధీశులుగా

రాజకీయాల్లో వారసత్వం తగునా, తగదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. భారత సర్వోన్నత న్యాయస్థానం ముఖ్య న్యాయాధీశులుగా తండ్రి కొడుకులు, జస్టిస్ వై. వి చంద్ర చూడ్, డి.వై. చంద్రచూడ్‌లు నియమితులు కావడం ఎంతో సంతోషం కలిగిస్తుంది. తండ్రి ఈ.ఎస్. వెంకటరామయ్య లాగానే తనయ బి.వి. నాగరత్న కూడా సర్వోన్నత న్యాయస్థానం ముఖ్య న్యాయమూర్తి కానుండడం మనకూ గర్వకారణమే.
ఇక సాయుధ బలగాల విషయం చెప్పనక్కర్లేదు. ఈ ఏటా గణతంత్ర దినోత్సవ కవాతుకు తండ్రి లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, ఢిల్లీ ఏరియా, నాయకత్వం వహించగా, కుమారుడు లెఫ్టినెంట్ అహన్ కుమార్ 61 అశ్వికదళ కంటింజెంట్ కమాండర్‌గా ఆ కవాతులో పాల్గొనడం దేశ చరిత్రలో ఒక అపురూప సన్నివేశమని ఎందరో కొనియాడారు. ఇక అన్ని భాషల చలనచిత్రాలలోనూ ఇదే కథ. అఖిల భారత పౌర సేవకులలో, శాస్త్ర, సాంకేతిక నిపుణులలో, వృత్తి ప నివాళ్లలో వారసత్వ పరంపర కూడా అందరం ఎరిగినదే.
ఈ వారసత్వంపైనే నిందలెందుకు?
నూతన శాస్త్ర ఆవిష్కరణల ప్రకారం కుటుంబ వాతావరణం జన్యువుల శ్రేణిని నేరుగా మార్చలేదు గాని, ఒకరి లక్షణాలను, ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది. దీనినే "జన్యు-పర్యావరణ పరస్పర చర్య" అంటున్నారు. తమ కుటుంబాల నేపథ్యం, పెరిగిన వాతావరణం, తత్కారణంగా అలవడిన నైపుణ్యాలు వివిధ రంగాలలో రాణిస్తున్న వారి వారసులకు ప్రేరణగా ఉండడమే కాక, కొంతమేరకు వారిని అందుకు సిద్ధం చేయడం సహజం. కానీ, కుటుంబ నేపథ్యం కారణంగా రాజకీయాల్లో ప్రవేశించినా, ఓటు బ్యాంకులు నిలుపుకోలేని వారు కనుమరుగు కాక తప్పదు. అలాంటప్పుడు కేవలం రాజకీయ వారసత్వం విషయమై ఎందుకు వ్యంగ్యాస్త్రాలు, ధూంధాములు, నిందా వాక్యాలు?
కాంగ్రెస్‌కే పరిమితం కాదు..
వారసత్వ రాజకీయాలు అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌కే పరిమితం కాదు. కొద్దో, గొప్పో ఏ రాజకీయ పక్షమూ ఇందుకు అతీతం కాదు. కేంద్రంలోని కూటమి మంత్రివర్గంలో ఉన్న బీజేపీ వారిలో కిరణ్ రిజిజూ, జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ మొదలైన వారు రాజకీయ నేతల వార సులే. లోక్‌సభ సభ్యులలో పేమ ఖందు, పూనం మహాజన్, వగైరాలు ఈ బాపతే. అంతెందుకు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దె ఎక్కిన బీజేపీ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పర్వేష్, గత ఢిల్లీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ పుత్ర రత్నమే. ఈ వాస్తవం కళ్ళకు కొట్టొచ్చినట్టు కన బడుతుండడంతో, ఒక కొత్త వాదం తెరపైకి వచ్చింది.
అన్నీ రంగాల్లోనూ స్వాగతిస్తూ..
ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, ప్రధానమంత్రి "ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది వారి స్వశక్తి, ప్రజాబలంతో రాజకీయ రంగంలో పురోగమించడాన్ని, తాము వారసత్వ రాజకీయాలని ఎన్నడూ చెప్పలేదనీ, ఒక కుటుంబం నిర్వహణలోనే ఒక రాజకీయ పక్షం ఉన్నప్పుడు, ఆ కుటుంబానికే ఆ పక్షం ప్రాధాన్యతనిచ్చినప్పుడు, ఆ కుటుంబ సభ్యులే అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే అది వారసత్వ రాజకీయమని వ్యవహరిస్తున్నామ"న్నారు. ఆ కొలబద్దతో చూస్తే, బీజేపీ కూడా ఇంకా ఒకే కుటుం బం అధీనంలోనికి వెళ్లలేదు. క్యాంప్ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వాల రద్దు, తెల్లార కుండా నూతన మంత్రివర్గ ప్రతిష్టాపన, గంగలో మునిగితే పాపాలు పోయినట్టు, తమ తీర్థం పుచ్చుకుంటే అవినీతి పరులను చట్టాలకు అతీతులను చేయడం నేర్చుకున్న బీజేపీ ఏక కుటుంబ ఆధిపత్యానికి ఎన్నాళ్ళు దూరంగా ఉంటుందో చెప్పడం కష్టం. అన్ని రంగాలలోనూ వారసులకు హారతి పడుతూ రాజకీయాలకు వచ్చేసరికి, అదేదో ఘోరమన్నట్టు వ్యవహరించడానికి స్వస్తి పలకాలి.
- మల్లాప్రగడ రామారావు
99898 63398






