- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టు సమ న్యాయాన్ని అందించలేకపోతుందా?
దేశంలో ఉత్పన్నమవుతున్న ప్రాధాన్య విషయాలపై సమన్యాయాన్ని అందించి సర్వో న్నత న్యాయస్థానంగా గౌరవాన్ని పొందాల్సిన

దేశంలో ఉత్పన్నమవుతున్న ప్రాధాన్య విషయాలపై సమన్యాయాన్ని అందించి సర్వో న్నత న్యాయస్థానంగా గౌరవాన్ని పొందాల్సిన సుప్రీంకోర్టు సామాన్యులు సైతం వేలెత్తి చూపేలా వివాదాస్పదం అవుతోంది. కారణం.. కొన్ని విష యాల్లో పక్షపాతంగాను, మరికొన్ని సందర్భా లలో పరిధిని మించి తీర్పులు, వ్యాఖ్యానాలు చేస్తుందనే విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర వివాదాస్పదమైంది.
ఇండియా కూటమి ఆధ్వర్యంలోని డీఏంకే ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఇంత తీవ్రంగా స్పందించి రాష్ట్రపతిని కూడా ఆదేశించిన సుప్రీంకోర్టు, మరి పశ్చిమ బెంగాల్ కేబినెట్ తీసుకున్న ఒక నిర్ణయంపై మాత్రం సమీక్షించలేమనడం ఎంతవరకు సమంజసం? అంతేకాదు బీజేపీ పాలనలో ఉన్న మణిపూర్‌లో జరిగిన అల్లర్లపై తీవ్రంగా స్పందించి తీవ్ర చర్యలకు ఆదేశించిన ఇదే సుప్రీంకోర్టు టీఎంసీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పి హిందువులు ఊచకోతకు గురవుతుంటే స్పందించకపోవడం గమనార్హం.
వీరు చట్టానికి అతీతులా..?
దేశంలో మతపరమైన అలజడులకు సుప్రీంకోర్టే కారణమని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే విమర్శించారు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజమున్నట్లుగానే సుప్రీం తీర్పులు రుజువు చేస్తున్నాయని నెటిజన్లు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడడం చూస్తే న్యాయమూర్తులలో కూడా అవినీతిపరులున్నారనే విషయం ధృవీకరిస్తోంది. ఈ విషయంపైనే ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఈ ఘటన జరిగి నెల కావస్తున్నా.. ఇంతవరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాలేదని, పైగా నిందితుడైన న్యాయమూర్తిని వేరే చోటికి బదిలీ చేయడం కరెక్టేనా అంటూ సుప్రీంకోర్టు సచ్ఛీలతను ప్రశ్నించారు. ‘భారత రాజ్యాంగం గౌరవనీయ రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రమే న్యాయ విచారణ నుండి మినహాయింపు ఇచ్చింది’. కాని చట్టానికి అతీతంగా న్యాయవ్యవస్థ ఈ మినహాయింపును ఎలా పొందింది? దీనిపై ప్రతీ భారతీయుడు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇదే సంఘటన సాధారణ పౌరుడి ఇంట్లో జరిగి ఉంటే, చట్టం వేగం ‘ఎలక్ట్రానిక్ రాకెట్‌లా ఉండేది. ఈ అలహాబాద్ న్యాయమూర్తి విషయంలో అది ఎద్దుల బండి వేగంతో కూడా లేదని ఆయన విమర్శించారు.
ఈ లాజిక్ మరిచి విమర్శలు..
ఎప్పుడో త్రేతా యుగంలో జన్మించిన రాముడు అయోధ్యలోనే పుట్టాడనడానికి సాక్ష్యాలు ఏవి? అని సుప్రీంకోర్టు గతంలో ప్రశ్నించింది. తాజాగా వక్ఫ్ ఆస్తుల సాక్ష్యాల పత్రాలు ఎక్కడుంటాయని ఇదే సుప్రీంకోర్టు ప్రశ్నించడం హిందువుల హృదయాలని కలచి వేసింది. నిజానికి వక్ఫ్ బోర్డు అనేది ప్రార్థన మందిరం కాదు. అది పూర్తిగా భూములు, ఆస్తులకు సంబంధించిన సంస్థ. దీంతో నిరుపేద ముస్లింలకు ఒక్కపైసా లాభం జరుగలేదు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆ బోర్డుకు విస్తృతాధికారాలిచ్చింది. ఆ బోర్డ్ ఏదైనా భూమిని వక్ఫ్‌గా గుర్తిస్తే వందల ఏళ్లుగా తన భూమిగా భావిస్తున్న యజమాని సైతం అమ్మడానికి వీలులేదు. అది తన భూమే అని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. కోర్టులు కూడా జోక్యం చేసుకునే వీలులేదు. ఇలాంటి లోపాలను సవరిస్తూ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పిస్తూ పార్లమెంట్ సవరణ చట్టం చేస్తే సుప్రీంకోర్టు హిందూ బోర్డుల్లో కూడా అన్య మతస్థులకు చోటు కల్పిస్తారా? అనడం ఎంతవరకు సమంజసం. హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులు అన్ని ప్రభుత్వాల ఆధ్వర్యంలోని దేవాదాయ, ధర్మ ఆదాయ శాఖ పరిధిలో ఉండగా, వక్ఫ్ బోర్డు, మసీదులు, చర్చిలు వాటి ఆస్తులు, పర్యవేక్షణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో లేవనే చిన్న లాజిక్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం విస్మరిస్తే ఎలా?
సమ న్యాయం అందించాలని..
తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి దేవాలయం నేలమాళిగలోని సంపత్తిని లెక్కించాల్సిందే అని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, వక్ఫ్ బోర్డు ఆస్తుల లెక్కలు తేల్చాలని, వాటితో నిరుపేద ముస్లింలకు, ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా కొన్ని సవరణలతో చట్టం చేస్తే కేంద్రాన్ని వివరణ కోరడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. అలాగే దేశంలోని ఒకటి, రెండు హిందూ దేవాలయాల్లోకి మహిళలకు ప్రవేశం లేకపోతే తప్పని చెప్పిన అదే సుప్రీంకోర్టు, దేశంలోని ఏ ఒక్క మసీదులోకి ముస్లిం మహిళలకు ప్రవేశం లేదనే విషయంలో మాత్రం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తిరస్కరించడం ఎంతవరకు సమంజసం? హిందువులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందని, అవినీతిపరులను, హిందూ వ్యతిరేకులను కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తులుగా అందలం ఎక్కిస్తోందని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దేశ ప్రజలందరికీ శిరోధార్యమైన సర్వోన్నత న్యాయ స్థానం అన్ని వర్గాలు, పార్టీలు, మతాల విషయాల్లోనూ, సమ న్యాయాన్ని అందిస్తూ ఆదర్శంగా, నిష్పక్షపాతంగా ఉండాలనీ, ఉంటుందనీ ఆశిద్దాం.
-శ్యామ్ సుందర్ వరయోగి,
98669 66904






