RRR అలైన్‌మెంట్ వికారాబాద్‌కు జీవన శాసనమా? మరణ శాసనమా?

by Ravi |   (  Updated:2025-09-20 01:00:59  IST  )

హెచ్ఎండీఏ ఈ నెల ఒకటో తారీఖున పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలోని సుమారు 163 గ్రామాల ద్వారా రీజనల్ రింగు రోడ్డు

RRR అలైన్‌మెంట్ వికారాబాద్‌కు జీవన శాసనమా? మరణ శాసనమా?
X

హెచ్ఎండీఏ ఈ నెల ఒకటో తారీఖున పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలోని సుమారు 163 గ్రామాల ద్వారా రీజనల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ను నోటిఫై చేస్తూ, దానిపై అభ్యంతరాలను, సూచనలను 15 రోజుల లోపు తెలియచేయాలని ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో అసలు ప్రజలకు స్వచ్ఛమైన గాలీ పీల్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పర్యా వరణానికి నెలవుగా వికారాబాద్ ప్రాంతం కూడా ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వల్ల దెబ్బతినే అవకాశం ఉండటంతో భావితరాల వారి జీవన విధానం విషయంలో మనమే ‘మరణ శాసనం’కి కారణమవుతున్నాం..

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హెచ్‌ఎండీఏ లాంటి సంస్థకు కొత్త జిల్లాల ఏర్పాటు, వాటి భౌగోళిక గ్రామాలు తెలుపకపోవడం.. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా నుండి కొత్తగా వికారాబాద్ జిల్లా ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రభావితం అయ్యే కొన్ని గ్రామాలను రంగారెడ్డి జిల్లాలో చూపిస్తుంది.

ఈ భూములన్నీ సన్నకారు రైతులవే..

ఇకపోతే రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా ప్రభావితం అయ్యే 163 గ్రామాల నుండి 100 mtrs చొప్పున రింగ్ రోడ్డు వేయడమే గాకుండా దాని చుట్టూ 45 మీటర్ల రైలు మార్గం కూడా వేయాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లు పత్రిక ముఖాల ద్వారా వార్తలు వినపడుతున్నవి. అయితే వీటి ద్వారా ఎఫెక్ట్ అయ్యే భూములన్నీ కూడా, సన్నకారు, చిన్నకారు రైతలవే.. వారు వ్యవసాయమే ఆధారం చేసుకునే తమ జీవనం గడుపుతున్నందున, ఆర్ఆర్ఆర్ వల్ల వారి జీవ నోపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ ద్వారా 4 మండలాల్లోని 22 గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి. ఇందులో కూడా రైతులు అందరూ సన్నకారు, చిన్న కారు కోవకు చెందినవారే

ప్రకృతి అందాలకు నిలయం..

వికారాబాద్ చుట్టు పక్కల గ్రామాల నుండే హైదరాబాద్ లాంటి నగరాలకు నిత్యం పాలు, కూరగాయాలు, పూలు, పండ్లు సరఫరా అవుతాయి. అంతేగాక ఈ ప్రాంతం వృక్ష, జంతు జాతులకు, స్వచ్ఛమైన గాలులకు కలుషితం లేని ప్రాంతం. ఈ ప్రాంతంలో నెమళ్లు, జింకల సంఖ్య కోకొల్లలు.. ఇది ప్రకృతి అందాలకు నిలయం. ఇక ‘తెలంగాణ ఊటీ’గా పిలువబడే ‘అనంతగిరి’ కొండల ప్రాంతంలోని స్వచ్ఛమైన గాలి ‘ఎన్నో రోగాలకు మందు’గా పని చేస్తుందని నానుడి. కేవలం ఎటువంటి చికిత్స లేకుండా ఇక్కడి గాలితో టీబీ రోగం నయం అవుతుందని, ఇక్కడ ఎంతో మందికి చికిత్స అందించారు. పైగా వికారాబాద్ ప్రాంతం జంట నదులు అయిన మూసీ (ముచుకుంద) నదికి ఆరంభం. అనంతగిరి అయితే ‘ఈసా’ నది ప్రారంభం. ఇక పూడూరు మండలంలోని రాకాంచర్ల ప్రాంతం ఉస్మాన్‌ సాగర్‌కు పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎంతో మంది పర్యాటకులు ప్రకృతి అందాలు తిలకంచడానికి వస్తుంటారు.

దేశ రక్షణకు ప్రమాదమే..

అయితే ప్రస్తుత ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతం నుండి వెళ్లడం ద్వారా, వాహనాలు వెదజల్లే పొగ, శబ్దాల వలన ఇక్కడి వాతావరణం కలుషితం అవడమే గాకుండా, ఇక్కడి వృక్ష, జంతు జాతి నశించి చనిపోవడానికి, పర్యావరణానికి విఘాతం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జంట జలాశయాల పరివాహక ప్రాంతానికి విఘాతం కలగడం వలన అవి నిండే అవకాశం ఉండదు. తద్వారా జంట నగరాలకు మంచి నీటి సరఫరాలో అవరోధం కలిగే అవకాశం కాకుండా, కలుషిత నీరు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని చుట్టూ ఉన్న ప్రాంతాలు కాంక్రీట్ జంగల్‌గా మారడంతో అసలు ప్రజలకు స్వచ్ఛమైన గాలీ పీల్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు పర్యావరణానికి నెలవుగా ఉన్న వికారాబాద్ ప్రాంతం కూడా ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ వల్ల దెబ్బతినే అవకాశం ఉండటంతో భావితరాల వారి జీవన విధానం విషయంలో మనమే ‘మరణ శాసనం’కి కారణమవుతున్నాము. ఇప్పటికే ఈ ప్రాంతంలో దామగుండం అడవి ప్రాంతాన్ని లో ఫ్రీక్వేన్సీ స్టేషన్ ఏర్పాటు కోసం ఇండియన్ నేవీకి ఇచ్చింది ప్రభుత్వం. అయితే ప్రస్తుత ప్రతిపాదిత రింగ్ రోడ్డు ఈ ప్రాంతానికి సుమారు ½KM ఉంది. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా రక్షణ చట్టాల నిబంధనల మేరకు చేపట్టాలి. అంటే ప్రతిపాదిత రింగ్ రోడ్డు డిఫెన్స్ జోన్‌కు అంతరాయం ఏర్పడకుండా నిర్మించాలి. ఇష్ట ప్రకారం నిర్మాణం చేస్తే దేశ రక్షణకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది.

ఈ అలైన్‌మెంట్ సవరించాలి!

అలాగే ప్రతి ప్రతిపాదిత అలైన్‌మెంట్ వల్ల ఇక్కడి రైతులకు ఆధారమైన వ్యవసాయ భూములు కోల్పోవడం, తద్వారా వారి జీవనోపాధి దెబ్బ తినడం, ఇక్కడి వృక్ష, జంతు జాతి మనుగడకు అవరోధం ఏర్పడడం, పర్యావర ణం దెబ్బ తినడం, పరివాహక ప్రాంతం అవరోధం వలన జంట నగరాలకు ‘మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, భావి తరాల వారికి, వారి జీవనానికి స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలు, మంచి నీరు అందిస్తున్న ఈ ప్రాంతం, రింగ్ రోడ్డు వల్ల కోల్పోయే అవకాశం ఉంది. అందుకు గాను, ప్రస్తుత ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో సవరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, ఇక్కడి రైతాంగం ఎదురు చూస్తుంది. లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది.

-సురేశ్ పోద్దార్

సంయుక్త కలెక్టర్ (విశ్రాంత)

80080 63605

Next Story