ఇంటర్మీడియట్ విద్య రద్దు తప్పదా?

by Ravi |   (  Updated:2025-07-10 01:15:40  IST  )

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టేందుకు ముందడుగు వేసింది.

ఇంటర్మీడియట్ విద్య రద్దు తప్పదా?
X

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టేందుకు ముందడుగు వేసింది. ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న హైస్కూల్ విద్యను 12వ తరగతి వరకు పొడిగించి, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన లక్ష్యం విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించడం, అందరికీ నాణ్యమైన విద్య అందించడం.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు, ఉపాధ్యాయులకు, జూనియర్ కాలేజీ లెక్చరర్లకు, విద్యావేత్తలల్లో విభిన్న అభిప్రాయాలను రేకెత్తించింది. అయితే ప్రభుత్వం తలపెట్టదలచిన ఈ మార్పు విజయవంతం కావాలంటే, మౌలిక సదుపాయాలు, శిక్షణ, సమగ్ర ప్రణాళిక చాలా అవసరం.

ప్రతిపాదన అసలు లక్ష్యం

తెలంగాణలో పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌లో చేరే విద్యార్థుల సంఖ్య 85 శాతం మాత్రమే ఉండటం, 15 శాతానికి డ్రాపౌట్ రేటు ఉండటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థ కొనసాగడం వల్ల డ్రాపౌట్ రేటు తక్కువగా ఉందని అధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో, హైస్కూల్ విద్యను 12వ తరగతి వరకు పొడిగించడం ద్వారా విద్యార్థులు సజావుగా విద్యను కొనసాగించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా, ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ స్థాయి విద్యను పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు.

విద్యార్థుల అభిప్రాయం ఏమిటంటే..?

విద్యార్థులు ఈ ప్రతిపాదనను రెండు విధాలుగా చూస్తున్నారు. ఒకవైపు, హైస్కూల్ విద్యను 12వ తరగతి వరకు పొడిగించడం వల్ల విద్యాసంస్థల మార్పు అవసరం తగ్గుతుందని, ఒకే పాఠశాలలో విద్య కొనసాగిస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే జూనియర్ కాలేజీలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్య కొనసాగించడం కష్టంగా ఉంటుంది. అయితే, మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యలోని విశేషమైన కోర్సులు (ఎంపీసీ, బైపీసీ, సీఈసీ) హైస్కూల్ వ్యవస్థలో అందుబాటులో ఉంటాయా? అనే సందేహం విద్యార్థుల్లో ఉంది. ఇంటర్మీడియట్ విద్య రద్దు కావడం వల్ల ఉన్నత విద్యకు సిద్ధం చేసే ప్రత్యేక శిక్షణ తగ్గిపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదంలో ఈ ఉద్యోగులు..

హైస్కూల్ ఉపాధ్యాయులు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది వారి బాధ్యతలను విస్తరిస్తుంది. పైగా పాఠశాలలకు ఎక్కువ నిధులు, సౌకర్యాలు అందే అవకాశం ఉంది. అయితే, జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఈ సంస్కరణ వల్ల తమ ఉద్యోగ భద్రతపై ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్య రద్దయితే, జూనియర్ కాలేజీలు మూత పడే ప్రమాదం ఉంది. దీనివల్ల వేలాది లెక్చరర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చు. పైగా హై స్కూల్ ఉపాధ్యాయులకు 11వ, 12వ తరగతుల స్థాయిలో బోధనకు అవసరమైన శిక్షణ లేనట్లయితే, విద్య నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు లెక్చరర్లు హెచ్చరిస్తున్నారు.

విద్యావేత్తల దృష్టికోణం..

ఇతర రాష్ట్రాల్లో (ఉదాహరణకు, కర్ణాటక, హర్యానా) 12వ తరగతి వరకు హైస్కూల్ విద్య విజయవంతంగా అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యాంశాల సంస్కరణ అవసరమని విద్యావేత్తలు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ల్యాబ్‌లు, కంప్యూటర్లు, మరియు ఇతర సౌకర్యాల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకుండా ఈ సంస్కరణలు అమలు చేస్తే, విద్య నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల భయం

ప్రైవేటు విద్యా సంస్థలు ఈ ప్రతిపాదనను అనుమానంతో చూస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్య రద్దయితే, జూనియర్ కాలేజీలలో చేరికలు తగ్గి, ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రైవేటు జూనియర్ కాలేజీలు విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధత, విశేషమైన కోర్సులు, అదనపు శిక్షణలను అందిస్తాయి, ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ సంస్కరణ వల్ల ప్రైవేటు సంస్థలు తమ వ్యాపార నమూనాను మార్చుకోవాల్సి రావచ్చు. అయితే, కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ మార్పును స్వాగతిస్తూ, ప్రభుత్వంతో భాగస్వామ్యంలో పనిచేసే అవకాశాన్ని అన్వేషిస్తున్నాయి, ముఖ్యంగా డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో సమానంగా ప్రవేశపెట్టి, భౌతిక వసతులు, సౌకర్యాలు, సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తే, ల్యాబ్‌ల నిర్మాణం కల్పిస్తే ఈ సంస్కరణ విజయం సాధిస్తుందని వీరి భావన.

పాఠ్యాంశాల సంస్కరణ చేయకపోతే..

ఈ ప్రతిపాదన సానుకూల లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ, అమలులో అనేక సవాళ్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యాంశాల సంస్కరణ లేనట్లయితే, ఈ నిర్ణయం విద్య నాణ్యతను మరింత దిగజార్చవచ్చు. ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినప్పటికీ, ఈ ప్రక్రియలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కీలకం. డ్రాపౌట్ రేటును తగ్గించడం, విద్యను సర్వసాధారణం చేయడం వంటి ఉన్నత లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రైవేటు సంస్థల అభిప్రాయాలను సమతుల్యంగా పరిగణించి, ఈ సంస్కరణలు అమలు చేయడం ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఈ మార్పు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచే దిశగా ఒక ముందడుగు కాగలదు, కానీ దీని అమలు సమర్థవంతంగా జరిగితేనే ఆ లక్ష్యం సాధ్యమవుతుంది.

డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్,

98493 28496

Next Story