ప్రజా సంక్షేమం పెట్టుబడిదారులతోనా?

by Ravi |   (  Updated:2025-07-29 01:15:30  IST  )

ఈ శతాబ్దంలో మనం చూస్తున్న అతి పెద్ద గుణా త్మ‌కమైన మార్పు సంపద కేంద్రీకరణ. అయితే ఇది కూడా కొన్ని దేశాలకు మాత్రమే

ప్రజా సంక్షేమం పెట్టుబడిదారులతోనా?
X

ఈ శతాబ్దంలో మనం చూస్తున్న అతి పెద్ద గుణా త్మ‌కమైన మార్పు సంపద కేంద్రీకరణ. అయితే ఇది కూడా కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కావడం విచారకరం. ప్రపంచ జీడీపీలో అమెరికా వాటా 25%, చైనా వాటా 20 శాతం. ఎక్కువ బిలియనీర్లు ఉన్న దేశాలు ఈ రెండే. ప్రపంచ జీడీపీలో బిలియనీర్ల సంపద వాటా 14.17 శాతంగా ఉంది. బిలియనీర్ల సంఖ్య ప్రపంచంలో 3028, అమెరికాలో 902 మంది బిలియనీర్లు ఉండగా చైనాలో 516 భారత్‌లో 205 మంది. మన దేశంలో ఈ బిలియనీర్ల సంపద విలువ 941 బిలియన్ డాలర్లు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంపద కొద్దిమంది చేతుల్లోకి పోయింది. రాజకీయాల్లో వీరే, ఉత్పత్తి కార్యక్రమాల్లో వీరే, ప్రపంచ ఆర్థిక శక్తులుగా వీరే.. వీళ్లను ఎలా పెంచాలి? ఎలా ఉపయోగించుకోవాలి? అనేది ప్రపంచ నాయకుల ఆరాటం.

డెమోక్రసీ ఫ్లూటోక్రసీగా మారి..

ప్రపంచంలో కొద్ది మంది చేతుల్లోకి సంపద పోతున్న స్థితిని కల్పించింది పాలకుల ఆర్థిక విధానాలే. పెట్టుబడి దారులపై ఆధారపడి పాలన చేస్తున్నది ప్రజా నాయకులు. ప్రస్తుతం డెమోక్రసీ ఫ్లూటోక్రసీగా మారింది. ప్రజలకు ఆదాయాలు లేక ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న పరిస్థితి. ద్రవ్య పెట్టుబడులతో పెట్టుబడి దారులు ప్రభుత్వాలను ఆర్థిక వనరులను తమ గుప్పిట్లో పెట్టుకొని ఉత్పత్తిని, ఉద్యోగితను ఆయా దేశాలలో కొనసాగిస్తున్నారని భావించడం జరిగింది. అయితే వారు శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్ధతుల ద్వారా వస్తూత్పత్తి చేయడం లేదు.

ఉత్పత్తుల ద్వారా సంపద రాకపోతే..!

సాంకేతిక పరిజ్ఞానంతో కార్మికుల ఉపాధి తగ్గిపోతున్నదా? ద్రవ్య పెట్టుబడి ద్వారా కార్మిక శక్తిని అతలాకుతలం చేస్తున్నది ఎవరు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నియంత్రించి ఉత్పత్తులను పెంచుకుంటూ ఉద్యోగ కల్పన లేకుండా నిరు ద్యోగం పెరుగుతున్నందుకు కారకులెవరు? ద్రవ్య పెట్టుబడిని అందిస్తున్నది ఎవరు? ఇది ఎలా వస్తున్నది అంటే ఉత్పత్తుల ద్వారా మాత్రం కాదు. అప్పుల ద్వారా కావచ్చు. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీల ద్వారా కావచ్చు. మరి ప్రభుత్వాల సఖ్యతతో పెట్టుబడిదారులు యథేచ్ఛగా చేస్తున్న ఆర్థిక పీడనల వలన దేశాల మధ్యనే చిచ్చు పెడుతున్నది ఎవరు? ఈ దేశం ఆ దేశం అని కాదు.. అగ్రరాజ్యమైన అమెరికాకే పెట్టుబడిదారీ విధానం వలన, ద్రవ్య పెట్టుబడి వలన, ప్రపంచీకరణ వలన ఉద్యోగ ఉత్పత్తుల సమస్యలు తప్పడం లేదు.

ద్రవ్య పెట్టుబడి సమీకరణ..

పెట్టుబడిదారులు ఆయా దేశాల్లో ఉండే బ్యాంకుల ద్వారా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మొదలైన వాటిని కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దేశాలలో పెట్టుబడులను విదేశీ వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. ద్రవ్య పెట్టుబడి ప్రధాన శక్తి అయింది. దాని ఫలితంగా ద్రవ్య పెట్టుబడి ప్రపంచవ్యాప్త సంచారంగా మొదలైంది. అనేక దేశాల స్వయం నిర్ణయాధికారం కుదించుకుపోయింది. అన్నిచోట్ల నయా ఉదారవాద విధానాల అమలు మొద లయ్యాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కీన్షియన్ డిమాండ్ మేనేజ్మెంట్ వ్యూహం అమలు చేయగల పద్ధతి నేడు లేదు. 1930లలో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఉద్యోగిత, ఉత్పత్తి గణనీయంగా పడిపోయినప్పుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని ఆనాడు కీన్స్ మహా శయుడు ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, పెట్టుబడులు భారీగా పెంచాలని, ఉద్యోగిత కల్పించాలని 'జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ' అనే గ్రంథంలో తెలిపారు.

అప్పులు అంటే సంక్షేమంపై కోతలే..

కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యమే దీనికి కారణం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిగట్టుకుని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాని వారి ఉద్యోగితన ఆదాయాలను పెంచే విధంగా గానీ లేవు. మిగిలే ఆర్థిక వనరులను నేరుగా పెట్టుబడిదారులకు బదలాయిస్తున్నారు. ఉదాహరణకు ట్రంప్ తెచ్చిన పెద్ద అందమైన బిల్లు పేదల నుండి అత్యంత సంపన్నులకు సంపాదనను బదలాయించడం కోసమే వచ్చింది. దీని వలన అమెరికా బడ్జెట్ ద్రవ్యలోటు రానున్న పదేళ్లలో 3.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుంది. ఈ లోటును పూడ్చడం కోసం ప్రభుత్వం అప్పులు చేయాలి. వాటిని తీర్చడం పేరుతో పేదల సంక్షేమానికి మరిన్ని కోతలు పెడతారు.

తెచ్చిన అప్పులు ఎవరి బొక్కసంలోకి..

మన దేశంలో పలు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదే. ఇదంతా ఆర్థిక వ్యవస్థ పునర్జీవం కోసమే అంటూ సమర్థించుకుంటున్నారు. నిజంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసమే అయితే ప్రభుత్వం అప్పు చేసి తెచ్చి ప్రభుత్వమే ఖర్చు చేయాలి కానీ ఆ సంపదను ప్రభుత్వమే పెట్టుబడిదారుల చేతుల్లోకి పెడుతోంది. అంటే కొనుగోలు శక్తిని ధనవంతులకు పంచుతోంది. దాని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆ ఆదాయాలతో ధనవంతులు అదనంగా కొనుగోలు చేసేది ఏమీ ఉండదు. ఆనాడు ఆర్థిక శాస్త్రవేత్త అయిన కీన్స్ చెప్పినట్లుగా సార్థక డిమాండ్ ఏర్పడదు. సార్థక డిమాండ్ ఏర్పడాలంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. వారి ఉద్యోగితను, ఉత్పత్తులను పెంచాలి లేకుంటే ఆర్థిక మాంద్యం తప్పదు. అయితే నేటి ప్రభుత్వాలు సంపన్నులకు ఉపయోగపడే విధంగా అప్పులు తెస్తున్నాయి. ఇదంతా ఆ సంపన్నులను మరింత సంతృప్తి పరచడం కోసమే జరుగుతుంది. ఉద్యోగిత గానీ ఉత్పత్తులు గానీ పెరగవు. ఫలితం.. మళ్లీ ఆర్థిక మాంద్యమే.

డాక్టర్. ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story