ప్రజాస్వామ్యంలో నిరసన నేరమా..?

by Ravi |   (  Updated:2026-07-24 01:10:41  IST  )

నీట్ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు, శాంతియుత ఆందోళనలపై పోలీసుల బలప్రయోగం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన నిరసన హక్కు, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలు, విద్యా వ్యవస్థలో పారదర్శకత అవసరం..

ప్రజాస్వామ్యంలో నిరసన నేరమా..?
X

ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినిపించే అత్యంత శక్తివంత మైన సాధనం.. శాంతియుత నిరసన. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. నీట్ వివాదం నేపథ్యంలో అలాంటి హక్కును వినియో గిస్తున్న విద్యార్థులపై బల ప్రయోగం జరగడంతో ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రభుత్వ జవాబుదారీతనంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఈ నిరసనకు ప్రధాన కారణం నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడం విద్యా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర అనుమానాలకు దారితీసింది. ఈ లీక్ వల్ల ఏడాది పొడవునా కష్టపడి చదివిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థులు, వివిధ సామాజిక సంస్థలు డిమాండ్ చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే చూడాలి.

పరిమితుల పేరుతో అణిచివేతా?

ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని, వారికి సమాధానాలు చెప్పాల్సిన ప్రభుత్వం, నిరసనకారులను అణచివేసే చర్యలకు దిగితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. చట్టాన్ని అమలు చేసే బాధ్యత పోలీసులపై ఉన్నప్పటికీ, శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తపరుస్తున్న వారిపై బలప్రయోగం చేయడం చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలి. అప్పటి వరకు పరిస్థితులను చర్చల ద్వారా, హెచ్చరికల ద్వారా, సంయమనంతో నియంత్రించడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల లక్షణం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు నిర్వహించే హక్కును కల్పించింది. ఈ హక్కులు సంపూర్ణమైనవి కాకపోయినా, ప్రజా శాంతి, భద్రత వంటి అంశాల దృష్ట్యా సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. అయితే ఆ పరిమితుల పేరుతో ప్రతి నిరసనను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి నిరసనలే ప్రధాన ప్రజాస్వామ్య సాధనం.

రెచ్చగొట్టే చర్యలు.. ఉద్యమానికి మేలు చేయవు!

నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం ఒక సాధారణ పరిపాలనా లోపం కాదు. ఇది విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఘటన. లక్షలాది మంది విద్యార్థుల శ్రమ, ఆశలు, కుటుంబాల త్యాగాలు ఒక పరీక్ష ఫలితంపై ఆధారపడి ఉంటాయి. అలాంటి పరీక్షలో అవినీతి లేదా అవకతవకలు చోటు చేసుకుంటే కేవలం విచారణతో సరిపోదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన వ్యవస్థను రూపొందించడం ప్రభుత్వ బాధ్యత. నిరసన కారులు సైతం ఎంతో శాంతియుతంగా, చట్టబద్ధంగా తమ ఆందోళనను వ్యక్తపరచడం ద్వారా ప్రజల మద్దతును పొందవచ్చు.. హింస, ఆస్తుల ధ్వంసం లేదా రెచ్చగొట్టే చర్యలు ఏ ఉద్యమానికీ మేలు చేయవు. పోలీసులు కూడా అవసరానికి మించిన బలప్రయోగాన్ని నివారించాలి. ప్రజలు, ప్రభుత్వం మధ్య సంఘర్షణ కాకుండా, సంభాషణే సమస్యల పరిష్కారానికి మార్గం కావాలి.

ప్రశ్నిస్తే.. శత్రువుగా చూడొద్దు!

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు.. ఎన్నికల అనంతరం కూడా ప్రజల అభిప్రాయాలను వినడం, విమర్శలను సహనంతో స్వీకరించడం, తప్పులు జరిగితే వాటిని సరిదిద్దడం, బాధ్యత వహించడం కూడా ప్రజాస్వామ్య పాలనలో అంతర్భాగాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును శత్రువుగా కాకుండా, ప్రజల ఆందోళనకు ప్రతినిధిగా చూడగలిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. దేశ చరిత్రను పరిశీలిస్తే అనేక సామాజిక, రాజకీయ మార్పులు ప్రజల శాంతి యుత ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయి. మన స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో సాగిన మహో ద్యమం. ఆ స్ఫూర్తిని మరువకుండా ప్రభుత్వం సంయ మనం పాటించాలి. పోలీసు వ్యవస్థ కూడా ప్రజల భద్రత కోసం ఉందే గానీ, ప్రజల గొంతును అణచివేయడానికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీట్ వివాదం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వం, విద్యా వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, రాజకీయ పక్షాలందరికీ ఒక హెచ్చరిక వంటివి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికత తప్పనిసరి. అదే సమయంలో ప్రజాస్వామ్య హక్కులను గౌరవించడం కూడా అంతే అవసరం.

ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యాలు..

శాంతియుత నిరసనలను బలప్రయోగంతో అణచి వేయడం తాత్కాలికంగా పరిస్థితిని నియంత్రించినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బలంగా ఉంటుందో ప్రజల గొంతును ఎంత గౌరవిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. నిరసన హక్కును పరిరక్షించడం, చట్టబద్ధమైన ఆందోళనలకు గౌరవం ఇవ్వడం, తప్పిదాలపై బాధ్యత వహించడం, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించడం. ఇవే ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యాలు.. కాబట్టి ప్రభుత్వాలకు రాజ్యాంగ విలువల పట్ల అంకితభావం అనివార్యం.

-తిప్పర్తి శ్రీనివాస్,

99484 39565

Next Story