కేసీఆర్‌కు బిఅర్‌ఎస్‌తో లాభమా, నష్టమా?

by Disha edit |
కేసీఆర్‌కు బిఅర్‌ఎస్‌తో లాభమా, నష్టమా?
X

నిధులు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌తో జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. 2001లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో స్థాపించిన టీఆర్ఎస్ – ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఏదైనా స్థానాన్ని చేజిక్కించుకోగలదా అనేది పెద్ద ప్రశ్న. దేశ రాజకీయాలను శాసిస్తున్న బీజేపీతో యుద్ధానికి దిగడం జూదం లాంటిదేనని కొందరి అభిప్రాయం. ఆంధ్రలోనూ బీఆర్ఎస్‌ని తెరుస్తున్న కేసీఆర్ కృష్ణా జలాల పంపిణీ, పోలవరం వంటి అంశాలపై తెలంగాణకు అనుకూలంగా ఇకపై మాట్లాడలేరని చాలామంది అనుమానం. దీంతో ఏపీలోనూ, దేశంలోనూ బీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్‌కు కలిగే లాభనష్టాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ప్రారంభించారు. తిరిగి 21 ఏళ్ల తర్వాత దసరా రోజు 2022 అక్టోబర్ 5న ముఖ్యమంత్రి హోదాలో కొత్త జాతీయ రాజకీయ అస్తిత్వాన్ని ప్రకటించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాలతో టీఆర్‌ఎస్‌(trs) విజయం సాధించింది. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 88 అసెంబ్లీ స్థానాల మెజారిటీతో రెండవసారి అధికారంలోకి వచ్చింది. నిధులు, ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడిన కేసీఆర్(kcr) ఇకపై బీఆర్‌ఎస్‌తో జాతీయ స్థాయికి వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మొదటగా తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ మతతత్వ విభజన రాజకీయాలపై పోరాడటం, రెండవది, అభివృద్ధిలో తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం అనే లక్ష్యాలను కేసీఆర్ ప్రకటించారు.

టీఆర్‌ఎస్ పేరు మార్చే సమయంలో 'తెలంగాణ' అనే పదం తొలిగిపోవడంతో తెలంగాణ ఉద్యమ కారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతేకాదు మొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ప్రగతి భవన్‌లో ఎర్ర తివాచీలతో స్వాగతం పలికిన సన్నివేశాలు తెలంగాణ వాదులకు కోపం తెప్పించాయి. ముఖ్యంగా నదీజలాల పంపకం, ఇతర సమస్యలపై పోరాడుతున్నప్పుడు జాతీయ నాయకుడిగా కేసీఆర్ తెలంగాణకు పూర్తిగా అనుకూలంగా మాట్లాడలేరనీ, కృష్ణా జలాల పంపిణీ, పోలవరం వంటి అంశాలపై తెలంగాణ కోసం ఇకపై ఎవరు పోరాడుతారని తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఉత్తరాది వాళ్లు ఒప్పుకుంటారా

అయితే, 2001లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పరచాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో స్థాపించిన టీఆర్ఎస్ - జాతీయ రాజకీయాల్లో ఏదైనా స్థానాన్ని చేజిక్కించుకోగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనేది చాలా మంది మనస్సుల్లో తొలుస్తున్న ప్రశ్న! నిజానికి కేసీఆర్‌కి జాతీయ స్థాయిలో విజయవంతమైన ముఖ్యమంత్రిగా మంచి గుర్తింపు ఉంది, కానీ జాతీయ పార్టీని నిర్మించడానికి అది ఒక్కటే సరిపోదు. రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ జాతీయ అంశాలపై దృష్టి మరల్చాలనుకుంటున్నారు. జాతీయ రంగంలోకి దిగి దేశ రాజకీయాలను శాసిస్తున్న బీజేపీతో యుద్ధానికి దిగడం జూదం లాంటిదేనని కొందరి విమర్శకుల అభిప్రాయం.

మరోవైపున దక్షిణాది నుంచి జాతీయ పార్టీని ప్రారంభించడం ప్రస్తుత కాలంలో చారిత్రక అవసరమని, దీన్ని వ్యతిరేకించడం మంచిది కాదని తటస్థ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ భారత రాజకీయ పార్టీలు ఇప్పటివరకు జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా పెద్దగా ఎదగలేకపోయాయి. కేసీఆర్ నూతన జాతీయ పార్టీ ఆవిష్కరించడం మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందివచ్చిన అవకాశంగానే చూడాలని, ఇది విజయం సాధించి, జాతీయ పార్టీగా ఎదిగితే తెలుగు రాష్ట్రాలకు వరమేనని కొంత మంది విమర్శకుల అభిప్రాయం..

కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యంగా...

ఇటీవలి కాలంలో కేసీఆర్ జేడిఎస్ చీఫ్ దేవేగౌడ, ఎన్‌సీపి అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజీవాల్, యూపీలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, జనతాదళ్ ఎస్, ఆర్జేడీ నేతలు నితీశ్ కుమార్, తేజస్విని యాదవ్ తదితర ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకున్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలను సమిష్టిగా చేసే కృషిలో భాగంగానే ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్న సందర్భంలో బీఆర్ఎస్(brs) మాత్రం బీజేపీకి మేలు చేసే వ్యూహంతోనే పావులు కదుపుతోందని, కాంగ్రెస్ లేకుండా ఐక్య ప్రతిపక్ష కూటమి ఎలా సాధ్యమవుతుందని, గతంలో పార్లమెంటులో అన్ని బిల్లులకి మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకం కావడమేంటని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వరి కొనుగోలు అంశంతో కేంద్రంతో మొదలైన గ్యాప్.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీ ఏర్పాటు వరకు వెళ్లింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కలిసి కాంగ్రెస్‌ను ఖతం చేసే కాంగ్రెస్ విముక్తి ప్రణాళిక వ్యూహంలో భాగంగానే చీకటి పోరాటాలు చేస్తున్నారని, ఇది చివరికి బీజేపీకీ బిఆర్‌ఎస్‌కీ మాత్రమే ఎన్నికల్లో కచ్చితంగా సహాయపడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

బీఆర్ఎస్ వెనుక భారీ వ్యూహం..!

దేశంలో ఎవరైనా సరే రాజకీయ ప్రత్యామ్నాయం పెట్టవచ్చు. బీఆర్ఎస్ ఏర్పాటు జాతీయ స్థాయిలో కేసీఆర్‌కి తన ఇమేజ్‌ని ఎంతో కొంత మెరుగుపర్చుకోవడానికి సహాయపడుతుందనడంలో సందేహమే లేదు.. జాతీయ పార్టీని స్థాపించడం ద్వారా కేసీఆర్ రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నారని విమర్శకుల అభిప్రాయం. ఒకటి. బీఆర్‌ఎస్(barat rastra samiti) మరికొన్ని పార్లమెంట్ సీట్లు అదనంగా గెలిస్తే కేంద్రంలో బేరసారాలు జరిపే శక్తి రావొచ్చు.

రెండు. తెలంగాణ ప్రజల దృష్టిని రాష్ట్రం నుంచి ఢిల్లీ రాజకీయాల పట్ల మళ్లించడం ద్వారా రాష్ట్రంలోని కొన్ని వైఫల్యాల నుంచి ప్రజలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శకుల అభిప్రాయం.. అటు సంక్షేమ పథకాలు. ఇటు రిజర్వేషన్ల ద్వారా దేశంలో తెలంగాణ అభివృద్ధి నమూనాను ప్రచారం చేయడం ద్వారా చాలా ప్రాంతాలలో అధికార పార్టీల వ్యతిరేక ఓట్లను చీల్చడం, బీఆర్ఎస్ పార్టీకీ 4 శాతం ఓట్లను గంపగుత్తగా పొంది, జాతీయ పార్టీగా విజయం సాధించాలని కేసీఆర్ రహస్య వ్యూహంతో ముందుకు సాగుతున్నారనీ మీడియా వర్గాల్లో టాక్.

త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిది?

తెలంగాణలో ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. బీఆర్ఎస్‌కి మిత్ర పక్షంగా ఎంఐఎం ఉండగా, వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు టీడీపీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్‌పీ, వైఎస్ షర్మిల వైఎస్ఆర్‌టీపీ, కోదండరాం టీజేఎస్, విశారదన్ డిఎస్‌పీ లాంటి పార్టీలు విడివిడిగా పోటీచేస్తే వ్యతిరేక ఓట్లు చీలి అధికార పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుంది. ఇప్పటివరకు చేయించిన చాలా సర్వేల్లో, ప్రతి పక్షాల నుంచి భారీ ఎత్తున పోటీ వచ్చినప్పటికి కూడా, ఓట్ల చీలికల వ్యూహం ఫలితంగా బిఆర్‌ఎస్ ముందంజలో ఉందని, బీజేపీ తెలంగాణలో కొత్త యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతుండటంతో పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.

రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్‌గా తన పార్టీ పేరును మార్చుకొని, జాతీయ పార్టీగా ముందుకు వెళుతున్న వేళ, కేసీఆర్‌కు పార్టీ మార్పు తన ఆశయసాధనకు దోహదపడుతుందా లేదా అనేది రానున్న కాలమే నిర్ణయిస్తుంది..

డాక్టర్ బి కేశవులు ఎండీ

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

8501061659

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

317 జీఓ బాధితులకు న్యాయం జరిగేనా?




Next Story

Most Viewed