- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీయింబర్స్‌మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులా?
రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాసంస్థల ఆందోళన, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా

రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాసంస్థల ఆందోళన, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం 1200 కోట్ల రీయంబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌ని వెంటనే విడుదల చేస్తామని ప్రకటించింది. విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు సర్కార్ ప్రకటనను నమ్మాయి. కానీ పండగల పేరుతో కాలయాపన జరిగింది. గాని విద్యార్థులకు న్యాయం జరగలేదు.
ఫలితంగా ఎప్పటి లాగానే లక్షలాది మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ రాక, ఆర్థిక భారంతో చదువులను కొనసాగించలేక, ఉన్నత చదువులు చదువుకోలేక తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెంటనే చెల్లిస్తామని నమ్మ బలికింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. కానీ ఎన్నికల్లో గెలిచాక రీయంబర్స్‌మెంట్ హామీని అటకెక్కించింది.
రీయింబర్స్‌మెంట్ ఎత్తివేయడానికి...
పెండింగులో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మరొక కొత్త కుట్రకు తెరలేపింది. రీయింబర్స్‌మెంట్‌ను కాలేజ్ ఎకౌంక్‌లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్‌లో వేస్తామని ప్రకటించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా మొత్తం ఫీజు ముందు చెల్లిస్తేనే వారికి ఆయా కాలేజీల్లో సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన ఆర్థిక భారం పేద విద్యార్థులపై పడుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందుకు రాని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తోంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది.
ప్రజాధనం దుర్వినియోగం..
రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కానీ కాంట్రాక్టర్లుగా ఉన్న కాంగ్రెస్ మంత్రుల బిల్లులు ప్రతి నెల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అభివృద్ధి పనుల పేరుతో డబ్బులను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఉప ఎన్నిక సభలో ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలను నెలకొల్పుతామని హామీలు ఇస్తు న్నాడు. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ట్ర ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనుక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది. రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, జేఎన్టీయూ, తెలంగాణ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ వర్సిటీలకు కూడా వందల కోట్ల పెండింగ్ బిల్లులు రావలసి ఉంది. ఈ వర్సిటీలన్నీ నిధులు లేక, సౌకర్యాలు లేక, చదువు చెప్పే ప్రొఫెసర్లు లేక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతున్నాయి. ఈ పెండింగ్ నిధులు విడుదలయితే కొంతైనా పరిస్థితి మెరుగుపడవచ్చు.
విజిలెన్స్ దాడులు పరిష్కారమా?
ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీయంబర్స్‌మెంట్ అడిగిన విద్యార్థులపై విద్యార్థి సంఘాల నాయకులపై కక్ష గట్టింది. విద్యార్థుల పోరాటాన్ని నిర్ధాక్షిణంగా అణచివేసింది. రీయింబర్స్‌మెంట్ సాధించడం కోసం అనేకసార్లు ఆందోళనలు చేసినా, పోరాటాలు నిర్వహించినా, విద్యాసంస్థల బంద్ నిర్వహించినా కూడా కనీసం స్పందించలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించిన ఫలితంగా వారితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. నేడు వారి హామీని నెరవేర్చని ఫలితంగా మరొకసారి నిరవ ధికంగా మూసివేశాయి.
ఫ్యూడల్ మనస్తత్వానికి సంకేతం..
దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుంటే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నాడు చోద్యం చూసింది. అనేక ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఫీజులు పెంచుకున్నప్పుడు, సరైన సదుపాయాలు కల్పించనప్పుడు, నిబంధనలకు తూట్లు పొడిచినప్పుడు, విద్యారంగంపై ఉన్న జీవోలను అమలు చేయనప్పుడు విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే నాడు పట్టించు కోలేదు కానీ నేడు రీయింబర్స్‌మెంట్ అడగగానే విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించడం ఎంత మాత్రం సబబు కాదు. విజిలెన్స్ దాడులు రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వా మిక, నియంతృత్వ, ఫ్యూడల్ మనస్తత్వానికి సంకేతంగా నిలుస్తుంది.
-పి.మహేష్
పీడీఎస్‌యు జాతీయ నాయకులు
97003 46942






