డ్రగ్స్ మూలాలపై శ్రద్ధ పెట్టకుండా.. కట్టడి సాధ్యమేనా?

by Ravi |   (  Updated:2025-05-07 01:00:52  IST  )

ఆదిమ మానవ సమాజం ప్రకృతిలో లభించే ఆకులు, పండ్లు, వేర్ల ద్వారా మత్తు పదార్థాలను ఒక సమూహం ఔషధాలుగా

డ్రగ్స్ మూలాలపై శ్రద్ధ పెట్టకుండా.. కట్టడి సాధ్యమేనా?
X

ఆదిమ మానవ సమాజం ప్రకృతిలో లభించే ఆకులు, పండ్లు, వేర్ల ద్వారా మత్తు పదార్థాలను ఒక సమూహం ఔషధాలుగా స్వీకరించింది. మరో సమూహం ఆ మత్తును దేవతల అనుగ్రహంగా భావించింది. శ్రామిక సమూహం ఆ మత్తు పదార్థాల ద్వారా ఉపశమనం కోరుకుంది. అయితే సమాజంలో మత్తు పదార్థాలు అనేక సామాజిక రుగ్మతలకు కారణమవుతున్నాయని ప్రపంచ తత్వవేత్తలందరూ దీనిని నిషేధించాలని పిలుపునిచ్చారు. కానీ నేడు ప్రభుత్వాలు.. పాలకులుగా ఉన్న దోపిడీ వర్గాలు వెనుకబడిన వర్గాలను మద్యం మత్తులో ఉంచి వారు రాజకీయ అధికార మత్తులో తేలుతున్నారు.

మూలాలపై శ్రద్ధ పెట్టకుండా..

తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాల్లో దక్షిణ భారతంలోనే ముందంజలో ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మద్యపాన వ్యసనంలో 43%తో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మద్యంతో పాటు రాష్ట్రంలో విస్తృతంగా లభ్యమవుతున్న గంజాయి, డ్రగ్స్ ఇటు సామాన్యుల్లోనూ అటు సామాజిక ఆలోచనా పరుల్లోనూ గుబులు పుట్టిస్తుంది. గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో దాదాపు 80 శాతానికి 15 నుండి 29 వయసు మధ్యవారు ఉండడం రాష్ట్ర భవిష్యత్‌కి భయాందోళనం. ఇటీవల నిర్వహించిన కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ సర్వే ప్రకారం 35% మంది 18 నుంచి 25 సంవత్సరాల యువకులే.. ఇంతకుముందు పట్నానికి పరిమితమై ఉన్న మత్తు పదార్థాలు నేడు బేషరతుగా పల్లెల్లో, పల్లె యువతలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ తెలంగాణ గడ్డకు ఇటువంటి సామాజిక చీడలను ఎదురుకున్న చరిత్ర కోకొల్లలుగా ఉన్నప్పటికీ.. మద్యం మత్తు పీడనలకు నేడు బలైపోతుంది. నేడు ప్రభుత్వాలు ఆదాయానికి మద్యమే ప్రధాన వనరుగా విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి. పట్నం చూట్టూరా రోజురోజుకు వంద కిలోల గంజాయి పట్టుబడుతున్న ప్రభుత్వాలు వాటి మూలా లపై శ్రద్ధ పెట్టడం లేదు. ఇక సరైన పర్యవేక్షణ లేని పల్లెల పరిస్థితి అగమ్యగోచరమే. ముఖ్యంగా టీనేజ్ యువత మద్యానికో.. మత్తు పదార్ధాలకో బానిసలై బంగారు భవిష్యత్‌ను కోల్పోతున్నారు.

కట్టడి చేయాలని ఆదేశించినప్పటికీ..

గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం మత్తులో ముంచుతుందని విమర్శ చేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను మూసి వేస్తామని హామీ ఇచ్చింది. కానీ నేడు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి బహిరంగంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుంది. ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్త బార్‌లకు పర్మిషన్ ఇచ్చుడే కాక.. కొత్త మద్యం బ్రాండ్‌లను కూడా అనుమతించింది. ఇటీవల మద్యంపై ధరలు పెంచింది. ఒకవైపు ప్రజా సంక్షేమం అంటూ వేల కోట్లతో అనేక పథకాలను రూపొందిస్తూ.. మరోవైపు మద్యం మత్తెక్కించి ప్రజలను దోచుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట్లో మాదకద్రవ్యాల కట్టడికి ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించినప్పటికీ.. రానురానూ మాదకద్రవ్యాలు వాటిని సరఫరా చేసే ముఠాలు ఊట శెలిమెల్లాగ పుట్టుకొస్తున్నాయి. మెల్లగా పట్నం నుండి పల్లెకు పాకిన గంజాయి డ్రగ్స్ లేలేత యువతను చిదిమేస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు రా కుండా కట్టడి చెయ్యాలి. మద్యం సీసాల్లో కూరుకుపోతున్న కుటుంబాలను ఒడ్డుకు చేర్చాలి. తెలంగాణ ఆడబిడ్డలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.

-నూకల మధు యాదవ్

63033 43359

Next Story