- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం వర్క్‌కు ఏఐ ఉపయోగించడం మంచిదేనా?
నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI) అనేది ప్రతి రంగంలో విప్లవం సృష్టిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు

నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI) అనేది ప్రతి రంగంలో విప్లవం సృష్టిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు కూడా దీనికి మినహాయింపు కావు. గణితం సమస్యల పరిష్కారం నుండి వ్యాస రచన వరకు, అనువాదం నుండి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ డిజైన్ వరకు ఏఐ విద్యార్థుల రోజువారీ విద్యా కార్యకలాపాల్లో భాగమవుతుంది. ఈ క్రమంలోనే ఒక పెద్ద ప్రశ్న ముందుకు వస్తోంది ‘విద్యార్థులు హోం వర్క్ చేయడానికి ఏఐ వాడటం మంచిదేనా?’
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేముందు. దీని వెనుక అనేక కోణాలు ఉన్నాయి అవి విద్యా ప్రయోజనాలు, నైతిక అంశాలు, భవిష్యత్‌లో నైపుణ్యాలపై ప్రభావం, టెక్నాలజీ పట్ల ఆధారపడే మానసికత.
ఇందులో పాజిటివ్ కోణం..
హోం వర్క్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా విద్యార్థులు పాఠశాల నుండి వచ్చి హోం వర్క్ చేయడానికి చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. దీనికి ఏఐ సహాయం తీసుకుంటే, క్లిష్టమైన ప్రశ్నలకు సైతం త్వరగా సమాధానాలు లభిస్తాయి. ఉదాహరణకు, గణిత సమస్యల కోసం Photomath, భాషా అనువాదం కోసం Google Translate, వ్యాసరచన కోసం ChatGPT వంటివి సమయాన్ని బాగా ఆదా చేస్తాయి. ఇది ముఖ్యంగా సులభంగా అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్లాస్‌లో ప్రతీ విద్యార్థి నేర్చుకునే విధానం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది విద్యార్థులు క్లాస్‌లో బోధించిన పాఠాన్ని ఒకసారిగా అర్థం చేసుకోలేరు. అదే క్లాస్‌కు ఏఐ టూల్ యూజ్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ వివరణ ఇస్తే, వారిలో కాన్సెప్ట్‌పై అవగాహన పెరుగుతుంది. అలాగే ఏఐ ద్వారా ఆలోచనలను సేకరించడం, కొత్త పద్ధతులను తెలుసుకోవడం, వివిధ రకాలుగా సమాధానం ఇవ్వడం విద్యార్థుల సృజనాత్మకతను పెంచుతుంది.
ప్రతికూల కోణం..
హోం వర్క్ చేయడానికి ఏఐపై ఆధారపడితే ఇది అలవాటుగా మారుతూ ఎప్పుడూ ఏఐ సహాయం లేకుండా హోం వర్క్ చేయలేరు. విద్యార్థులు స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. ఇది వారి మానసిక బలహీనతకు దారి తీస్తుంది. అలాగే ఇది విద్యార్థి నిజాయితీని దెబ్బతీస్తుంది. ఇది భవిష్యత్‌లో నకలు చేసే అలవాటు పెరగడానికి కారణమవుతుంది. ఇక అతిగా దీనిపై ఆధారపడితే స్వయంగా నేర్చుకునే అవకాశం కోల్పోతారు. సాధారణంగా హోం వర్క్ ఉద్దేశం క్లాస్‌లో నేర్చుకున్న పాఠాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం. కానీ అలా గుర్తుచేసుకోకుండా ఏఐనే అన్ని సమాధానాలు ఇస్తే, ఆత్మపఠనం తగ్గిపోతుంది. ఇక ఏఐ సమాధానం ఎల్లప్పుడూ వందశాతం సరిగా ఉండదు. అది తప్పు సమాధానాలు ఇచ్చే అవకాశమూ ఉంది. దీనివల్ల విద్యార్థులు తప్పుడు జ్ఞానం పొందే ప్రమాదం ఉంటుంది.
ఏఐ గురువు కాదు..
అలాగని ఏఐ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం సరికాదు, అలాగే నియంత్రణ లేకుండా వాడనివ్వడం కూడా మంచిది కాదు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కొన్ని మార్గదర్శకాలు పాటిస్తే, ఏఐ ఒక మంచి సహాయకుడిగా మారుతుంది. ఇది విద్యార్థుల ఆలోచనలకు మార్గదర్శనం చేయాలి కానీ వారి బదులు ఆలోచించకూడదు. ఏఐను పుస్తకాల మాదిరిగా ఉపయోగించాలి. అదనపు వివరణ, సమాచారం కోసం మాత్రమే వాడుకోవాలి. అలాగే హోం వర్క్ విషయంలోనూ కొంత భాగం మాత్రమే ఏఐ సహాయం తీసుకుని చేయాలి. మిగతా భాగం విద్యార్థి స్వయంగా చేయాలి. ఏఐ ఇచ్చిన సమాధానాలను క్రాస్-చెక్ చేయడం నేర్పాలి. అలా చేస్తే తప్పు సమాచారం వల్ల నష్టమవదు. ఏఐ ఇచ్చిన సమాధానం కంటే, సమాధానానికి దారి తీసే విధానంపై దృష్టి పెట్టాలి. ఏఐ గురువు కాదు, సహాయకుడు మాత్రమే.
విద్యా విధానంలో మార్పులు అవసరం!
ప్రతీరంగంలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యం లో మన విద్యా విధానం కూడా కొన్ని మార్పులు స్వీకరించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏఐ ఎలా పనిచేస్తుందో, దాని పరిమితులు ఏంటో బోధించా లి. కేవలం జ్ఞాపకం ఆధారిత ప్రశ్నల బదులు, విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచన అవసరమయ్యే ప్రశ్నలు ఇవ్వాలి. విద్యార్థులు నిజంగా అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి మౌఖిక పరీక్షలు, ప్రాక్టికల్ ప్రాజెక్టులు ఉండాలి. ఏఐను నియంత్రణలో, సరైన ఉద్దేశంతో వాడితేనే అది సమయాన్ని ఆదా చేయగలదు, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచగలదు. అందువల్ల, ఏఐ వాడకం విషయంలో ‘సరియైన మోతాదు – సరియైన విధానం’ అనే సూత్రం పాటించాలి. ఇదే ఈ కాలంలో ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన విషయం.
- కమలహాసన్ తుమ్మ
95056 18252






