భారత్.. డీ గ్లోబలైజేషన్‌కు పోవాల్సిందేనా?

by Ravi |   (  Updated:2025-08-15 01:16:06  IST  )

79 సంవత్సరాల సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర స్వాతంత్ర్య భారతావనిని ట్రంప్ బెదిరించడం అనేది మనం 1990ల నుంచి

భారత్.. డీ గ్లోబలైజేషన్‌కు పోవాల్సిందేనా?
X

79 సంవత్సరాల సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర స్వాతంత్ర్య భారతావనిని ట్రంప్ బెదిరించడం అనేది మనం 1990ల నుంచి చేపట్టిన గ్లోబలైజేషన్ ఫలితమే.. శతాబ్దాల పాశ్చాత్య దేశాల దోపిడీని మరచి మళ్లీ మనం మన ఆర్థిక వ్యవస్థను ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ (LPG) విధానాలకు పోవడమే! అమెరికా అధ్యక్షులు ట్రంప్ మన భారతదేశ ఎకానమీని డెడ్ ఎకానమీ అని అవమానించిన తీరు చూస్తుంటే నిజంగానే భారత అమెరికాపై అంతగా ఆధారపడిపోయిందా?

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి పరిచింది మనం కాదా? మరి మనవారికి అమెరికా కంపెనీలలో ముఖ్యంగా గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి ప్రత్యేకమైన కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వరాదని ట్రంప్ బెదిరించడమేంటి? నయా ఉదారవాద విధానా‌లను చేపట్టినప్పటి నుంచే మన దేశ స్వాతంత్రం విషయంలో పరిమితులు ఏర్పడడం మొదలైంది. ఇప్పుడు ట్రంపు రౌడీయిజం చూస్తే ఈ వాస్తవం అందరికీ స్పష్టంగా బోధపడుతుంది.

మన ఫీజులపైనే ఆధారపడుతూ...

అమెరికాలో చాలా వరకు మన విద్యార్థులు చెల్లించే ఫీజులపై ఆధారపడే అమెరికా విశ్వవిద్యాలయాలు నడుస్తుంటే.. విద్యార్థుల‌పైన, ఆ యూనివర్సిటీల పైన ట్రంప్ ఆంక్షలు దేనికి? హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రసిద్ధమైన యూనివర్సిటీ‌లో మన విద్యార్థులకు సీట్లు ఇవ్వరాదని పేర్కొనడం ఏంటి? అమెరికాలో ఐదు మిలియన్ల మంది భారతీయులు ఆ దేశ జనాభాలో 1.5 శాతంగా ఉన్నారు. అక్కడ పనిచేసే డాక్టర్లలో 10% మనవారే. అక్కడ వివిధ కళాశాలలో ఉన్నత అధ్యాపకులు మనవారే. 60 శాతం వరకు హోటల్స్ నడుపుతున్నది భారతీయులేనని ట్రంప్‌‌నకు తెలియదా? భారతదేశం నుండి అమెరికా అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఫార్మా క్రిటికల్ మందులు ఇతర అనేక చిన్న తరహా పారిశ్రామిక వస్తువులు దిగుమతి చేసుకోవడం లేదా? ఇదంతా స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల అనుసంధానమే కదా.

స్వయం పోషకత్వం గాలికి వదిలి..

భారతదేశంలో 1990 వరకు జరి గిన ఆర్థిక స్వయం పోషకత్వ విధానాన్ని వదిలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ కరణ చేసే ప్రక్రియ మొదలైంది. అమె రికా కనుసన్నల్లో ఉన్న ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి భారీగా రుణాలు చేసి విదేశీ పెట్టుబడి దారుల లాభాల కోసం మన దేశ ఆర్థిక వ్యవస్థ దిశను దశను మార్చడం వలన మన దేశ స్వయం సమృద్ధిని, స్వయం పోషకత్వం ముఖ్యంగా దేశ సార్వభౌమత్వం అమెరికా కనుసనల్లోకి పోయింది. గత 78 ఏళ్లుగా చాలా సందర్భాల్లో అమెరికన్ సామ్రాజ్య వాదం ఇండియాను తన ఆదేశాలను పాటించాలని బెదిరిస్తోంది. అమెరికా చెప్పినట్లే భారతదేశం నడుచుకోవాలంటే, ఆ దేశ ప్రయోజనాల కోసం మనం బతకాలంటే మన దేశ భవిష్యత్తు సామ్రాజ్యవాద దేశాల చేతుల్లో పెడతామా? ఈ దేశాల అవసరాల కోసం మన ఆర్థిక విధానాలను మార్చుకోవాలా?

అంతర్జాతీయ వాణిజ్యం ప్రమాదకరమే...

ఏ దేశమైనా అంతర్జాతీయ వాణిజ్యం మీద ప్రధానంగా ఆధారపడడం మొదలైతే ఆ వాణిజ్యంలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా ఆ దేశం బాగా దెబ్బతింటుంది. అందుచేత ఒక దేశ సామ్రాజ్యవాదం బెదిరింపులకు దిగిన ప్రతిసారి మరొక దేశం రాజీ చేసుకోవడానికి తయారవుతుంది. అయితే రాజీ చేసుకునే క్రమంలో ఆ దేశం కనుక తన ఆర్థిక వ్యవస్థలో పెద్ద స్థాయిలో సర్దుబాట్లు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడితే అప్పుడు అది తన దేశంలోనే బడా బూర్జువా వర్గం నుండి పట్టణ మధ్యతరగతి వర్గాల నుండి వ్యతిరేకత చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఇండియా అనుసరించిన నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రధానంగా ప్రయోజనాలు పొందినవి ఆ రెండు వర్గాలే.. ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పుడు అమెరికా బెదిరింపులకు లొంగి ఆ వర్గాలకే ఇబ్బంది కలిగించే విధంగా ఆర్థిక విధానాలను మార్చుకుంటారా?

డీ గ్లోబలైజేషన్‌ అంత సులభం కాదు..

నయా ఉదారవాద విధానాల నుండి డీ గ్లోబలైజేషన్‌కు వెళ్లాలి. అలా విధానాన్ని మార్చితే అప్పుడు బడా బూర్జువా వర్గం దానిని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఆ వర్గం ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో మమేకం అయిపోయి ఉంది. బడా బూర్జువా వర్గ ప్రయోజనాలు నెరవేరుస్తున్న ప్రభుత్వం డీ గ్లోబలైజేషన్ వైపు మళ్లి ఆలోచన కూడా చేయలేదు. అందుకే సామ్రాజ్యవాద దేశం బెదిరించినప్పుడల్లా రాజీ పడేందుకే సిద్ధమవుతుంది. సామ్రాజ్యవాద పెత్తనం నుండి బయటపడి స్వతంత్ర దేశంగా మనగలడం అంటేనే నయా ఉదారవాద వ్యూహాన్ని తిరస్కరించడం. 1990లకి మునుపు నడిచిన ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని గ్రహించాయి గనుకే ఆ కాలంలో సామ్రాజ్యవాదుల ఎత్తుగడలకు అవి భయపడలేదు.

ప్రభుత్వ విధానాలు ఇలా ఉండాలి..

నయా ఉదారవాద విధానాలను ఎప్పుడైతే చేపట్టడం జరిగిందో అప్పటి నుంచే మన దేశ స్వాతంత్రం విషయంలో పరిమితులు ఏర్పడడం మొదలైంది. జాతీయవాదంతో మనం వలస పాలనను పారదోలినట్టుగా, ఈ సామ్రాజ్య వాదుల నయా వలస పాలనను కూడా పారదోలాలి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలపై ఆధారపడే ప్రభుత్వ విధానాల నుంచి తప్పించి స్వయం పోషకత్వ విధానాల వైపు ప్రభుత్వ విధానాలు ఉండాలి.

డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్,

98663 22172

Next Story