- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కో-లివింగ్‌తో సంస్కృతికి చేటా..?
భారతదేశంలోకి పాశ్చాత్య విష సంస్కృతి చొరబడడం దేశ ప్రజలను కలవరపరుస్తున్నది. ఇప్పటికే గంజాయి

భారతదేశంలోకి పాశ్చాత్య విష సంస్కృతి చొరబడడం దేశ ప్రజలను కలవరపరుస్తున్నది. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్, పబ్బుల సంస్కృతి వచ్చి పడగా, ఇప్పుడు కొత్తగా కో లివింగ్ స్పేస్ పేరిట వసతి గృహాలు ఆరంభమయ్యాయి. పెళ్లి కావడానికి ముందే మహిళలు, పురుషులు కలిసి ఉండడానికే కో లివింగ్ స్పేస్ వసతి గృహాలు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీలో మొదలై ఇవి మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. మహిళలకు విడిగా, పురుషులకు విడిగా వసతి గృహాలు (హాస్టల్స్) ఉన్నాయి. ఆ గృహాలకు ఏ విధంగా అయితే అనుమతి లభిస్తున్నదో వీటికీ ఆ విధంగా అనుమతి పొందుతున్నారు. కో లివింగ్‌లో ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, మంచి ఉద్యోగం చేస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఉంటున్నారు.
అర్థం చేసుకునేందుకేనా..
కో లివింగ్ రెసిడెన్స్ యజమాని ఒక్కొక్కరి దగ్గర నుంచి సుమారు ఇరవై ఐదు వేల రూపాయల వరకు నెలకు అద్దె తీసుకుంటున్నారు. ఆ రెసిడెన్స్‌లో అన్ని ఆధునిక హంగు లతో వసతి సౌకర్యాలు ఉంటాయి. కొన్ని రెసిడెన్స్‌లలో ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో ఉంటున్నాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు. వారు ఇష్టం ఉన్నంతకాలం ఉండవచ్చు. కొంతమంది విడిపోయి ఆ తర్వాత వివాహాలు చేసుకుంటున్నారు. కో లివింగ్‌లో ఉండడం వల్ల వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని, వారికి ఇష్టమైతేనే జీవిత భాగస్వాములుగా మారేందుకు వివాహం చేసుకుంటారని, లేకపోతే అక్కడే విడిపోయేందుకు కో లివింగ్ రెసిడెన్స్ ఉపయోగపడుతుందని బ్రిటీష్ రచయిత ఒకరు పేర్కొన్నారు. కావచ్చు, కానీ వివాహం జరగకుండా యువతీ - యువకులు కలిసి ఉండడాన్ని మన సమాజం ఒప్పుకోదు.
పోలీసులను ఆశ్రయించినా..
జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంటున్నట్లు, స్వేచ్ఛ కోసమే ఉంటున్నట్లు కో లివింగ్‌లో ఉండే వారిలో కొందరి అభిప్రాయం. ఇదంతా తల్లిదండ్రులకు తెలిసే జరుగుతున్నది అని చెప్పలేం. కానీ చాలామంది కో లివింగ్ పేరిట విష సంస్కృతి వలయంలో చిక్కుకోవడం ఆందోళన కలిగించే అంశం. మాదాపూర్‌లోని ఓ కో లివింగ్ రెసిడెన్స్‌పై పోలీసులు దాడి చేసి పదిమంది విదేశీ అమ్మాయిలను పట్టుకోవడంతో కో లివింగ్ రెసిడెన్స్‌లు చర్చనీయాంశమయ్యాయి. కో లివింగ్ రెసిడెన్స్‌ల్లో ఉండే వారి సంగతి ఎలా ఉన్నా, చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెసిడెన్స్‌ల వల్ల తమ పిల్లలపై ప్రభావం పడుతున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే తాము చేయగలిగింది ఏమీ లేదని, ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని, పైగా కో లివింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది.
ఒకవైపు చట్టం.. ఇంకో వైపు సంస్కృతి
దేశపౌరులు స్వేచ్ఛగా ఎక్కడైనా జీవించేందుకు రాజ్యాంగంలోని 19వ అధికరణతో పాటు మరికొన్ని అధికరణలు ఉన్నాయి. కో లివింగ్ తప్పుకాదని సుప్రీం తేల్చేయడంతో చట్టం వారికి అండగా నిలబడింది. కానీ మన దేశ సంస్కృతి అది కాదు. సంస్కృతి మార్గదర్శనం చేస్తుందే తప్ప చట్టంలా శాసించలేదు. కాబట్టి ఈ కో లివింగ్ సంస్కృతి పట్ల చైతన్యం రావాలి. అదే విధంగా సుదూర ప్రాంతాల్లోని వసతి గృహాల్లో ఉంటున్న పిల్లలను (అందరినీ ఉద్దేశించి కాదు) ఓ కంట కనిపెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంది.
-వీరన్నగారి ఈశ్వర్‌రెడ్డి
98499 98086






