మావోయిస్టు రహిత దేశం సాధ్యమా!

by Bhoopathi Nagaiah |

కాంగ్రెస్ పాలనలోనే ‘ఎన్ కౌంటర్’లు మొదలైనప్పటికీ, బీజేపీ పాలనలో అవి తారాస్థాయికి అందుకున్నాయి. మావోయిస్టులను ప్రత్యక్షంగా చంపివేయడానికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది.

మావోయిస్టు రహిత దేశం సాధ్యమా!
X

‘‘కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'తో అనేక మంది మావోయిస్టులను తుడిచి పెట్టేస్తున్నారు.’’ ఇది మొన్నటి వార్త. ‘‘మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావును, మావోయిస్టుల సాయుధ వ్యూహకర్త హిడ్మాను ఎన్‌కౌంటర్‌లో అంతమొందించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న సహా వందలాది మంది లొంగిపోయారు.’’ ఇది నిన్నటి వార్త.

‘‘ చివరికి మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి, అలియాస్ దేవ్ జీ, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. మోడీ ప్రభుత్వం మావోయిస్టులను పూర్తిగా తుడిచి పెట్టేస్తోంది.’’ అన్నది తాజాగా వెలువడిన వార్త. ఇలాంటి వార్తలను, వారు ఉపయోగించిన భాషను గమనిస్తే, నిజమేనని నమ్మే అవకాశమే ఎక్కువ. కానీ ఇందులో కొన్ని సత్యాలతోపాటు అసత్యాలు, అర్ధసత్యాలు కూడా ఉన్నాయి.

గ్రీన్ హంట్ నుంచి కగార్ దాకా

కాంగ్రెస్ పాలనలోనే ‘ఎన్ కౌంటర్’లు మొదలైనప్పటికీ, బీజేపీ పాలనలో అవి తారాస్థాయికి అందుకున్నాయి. మావోయిస్టులను ప్రత్యక్షంగా చంపివేయడానికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వంటి పేర్లతో మావోయిస్టుల ఏరి వేత మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే, పన్నెండేళ్ళ క్రితం కేంద్రంలో అధికారంలోకొచ్చిన హిందుత్వ వాద బిజేపి ప్రభుత్వం నేటి మావోయిస్టు పార్టీ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఏడాది క్రితం ‘కగార్’ ఆపరేషన్‌ను ప్రారంభించిన కేంద్రం, ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత భారత దేశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

సాయుధ పోరాటం గాల్లో పుట్టలే..

తమకు జీవనాధారమైన భూమిని నిలబెట్టుకోవడం ప్రజలకు జీవన్మరణ పోరాటమైనప్పుడు, వారి ఆందోళనలు తిరుగుబాట్లు అనివార్యమై, అవి సాయుధ రూపాన్ని సంతరించకుంటాయి. భూమి కోసం, భుక్తికోసం ఉద్భవించిన తెలంగాణా సాయుధపోరాటం నిజాం పాలనను అంతమొందించింది. ప్రజలు కోరిన భూమి సమస్యను పరిష్కరించకుండా, నిజాంను రాజ్ ప్రముఖ్‌గా చేసి, అతని ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వేల సంఖ్యలో కమ్యూనిస్టులను చంపేసింది. భూమి సమస్య వల్లనే 1967లో నక్సల్ బరీ ఉద్యమం తలెత్తింది. సాయుధ పోరాట మార్గంతో 1969లో ఏర్పడిన సిపిఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో శ్రీకాకుళ రైతాంగ ఉద్యమంగా ఊపందుకుంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారులను ప్రభుత్వం ఎన్‌కౌంటర్ల పేరుతో చంపేయడం మొదలు పెట్టింది. అదే సమయంలో తెలంగాణా ప్రాంతంలో కూడా లెక్కలేనన్ని ‘ఎన్‌కౌంటర్లు’ జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపట్టిన భూసంస్కరణలు, ప్రజల మౌలికమైన భూమి సమస్యను పరిష్కరించలేకపోయింది. అత్యధిక ప్రజల జీవనాధారం భూమి కావడంతో, భూమి కోసం అనేక మంది యువకులు ప్రాణాలను లెక్కచేయకుండా సాయుధ పోరాట పంథాను అనుసరించారు.

‘నీ కాల్మొక్త దొర’కు మంగళం పాడి....

సిపిఐ(ఎంఎల్) పీపుల్స్ వార్ 1980లో ఏర్పడి, ప్రజలకు సాయుధ మద్దతుగా నిలబడింది. తెలంగాణా గ్రామాల్లో ‘నీ బాంచెన్ దొర’ ‘ నీ కాల్మొక్త దొర’ అనే స్థాయి నుంచి, భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డేలా ప్రజలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలిగింది. ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగినా, ఎంత మంది యువకులను, నాయకులను పోగొట్టుకున్నా, పోలీసులు, ప్రభుత్వాధికారులు, పెత్తందార్ల దౌర్జన్యాలను పీపుల్స్ వార్ చాలా మటుకు నిలువరించగలిగింది. పీపుల్స్ వార్ దెబ్బకు కొందరు భూస్వాములు గ్రామాలను వదిలిపెట్టి నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళారంటే, ఆ ఉద్యమం ఎంత బలంగా పాదుకుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో పీపుల్స్ వార్‌తో చర్చలు కూడా జరిపింది. ఆ చర్చల చివరి రోజునే పీపుల్స్ వార్ కాస్తా మావోయిస్టు పార్టీగా ఆవిర్బవించింది.

ఆపరేషన్ కగార్ అందుకే..

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున భూములను కార్పొరేట్ శక్తులకు బదలాయించడం మొదలైంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో విలువైన ఖనిజాలకోసం ఆదివాసీలను వారి భూముల నుంచి తరిమేయడానికి కేంద్రం చేపట్టిన చర్యలను మావోయిస్టులు ఆదివాసీలతో కలిసి ప్రతిఘటించడం మొదలుపెట్టారు. మావోయిస్టులను అంతం చేయందే కార్పొరేట్ శక్తులకు భూముల బదలాయింపు సాధ్య కాదన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. దీంతో మావోయిస్టులకు, కేంద్ర బలగాలకు ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఫలితంగా కేంద్రం మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ యుద్ధం ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు(బస్వరాజు), చలపతి, గాజర్ల గణేశ్, రామచంద్రారెడ్డి వంటి అగ్ర నాయకులను ఎన్ కౌంటర్ పేరుతో చంపేశారు. ఆదివాసీ అయిన హిడ్మా వంటి మిలటరీ వ్యూహకర్తను పట్టుకుని ఎన్‌కౌంటర్ పేరుతో చంపేశారు. హిడ్మాతో దొరికిన మరో 60మందిని అరెస్టు చూపించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న వంటి వారి ఆధ్వర్యంలో వందలాది మంది ఆయుధాలతో లొంగిపోయారు.

ప్రాణరక్షణ కోసం లొంగిపోయారా?

కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి మావోయిస్టు ఉద్యమం బాగా దెబ్బతింది. ఒక్క ఏడాదిలోనే 300 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో చంపేశారు. వేల సంఖ్యలో లొంగుబాట్లు జరుగుతున్నాయి. అగ్రనాయకత్వం కూడా లొంగిపోతోంది. తిండి తీర్థం దొరికినా దొరకకపోయినా, కనీస సదుపాయాలకు నోచుకోకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, నాలుగైదు దశాబ్దాలపాటు అడవుల్లో సాయుధంగా పోరాడిన నాయకులు, కేవలం ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం లొంగిపోతున్నారంటే నమ్మగలమా! ప్రస్తుత పరిస్థితిలో సాయుధ పోరాటం సాధ్యంకాదని, లీగల్ పద్దతిలో పనిచేయడానికి లొంగిపోతున్నారా! భవిష్యత్తు వ్యూహంతో లొంగిపోతున్నారా! హర్రీడ్ జస్ట్ స్ ఈజ్ బర్రీడ్ జస్టిస్ (తొందరపడి చెప్పే తీర్పు న్యాయానికి సమాధి). ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కానంత వరకు, అసమానతలు, దోపిడీ అంతమయ్యేవరకు సాయుధ తిరుగు బాట్లు జరుగుతూనే ఉంటాయన్నది చరిత్ర చెప్పే పాఠం.

రాఘవ

94932 26180

Next Story