- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కులరహిత సమాజం స్వప్నవాస్తవమేనా?
ఒక్కోసారి మనం ఆలోచించే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇంతవరకూ మా అమ్మాయికి మా కులం గురించి ఎప్పుడూ చెప్పలేదు.

ఒక్కోసారి మనం ఆలోచించే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇంతవరకూ మా అమ్మాయికి మా కులం గురించి ఎప్పుడూ చెప్పలేదు. మాకు దాని అవసరం కూడా రాలేదు. బెంగాలీ వాళ్ళ మధ్య ఉండటం వల్ల బహుశా ఆ అవసరం రాలేదు. ఆంధ్రప్రదేశ్ వెళితే ఎవరో ఒకరు అడిగేవారు. అయితే అది అంత అవసరమా అని అనేవాళ్ళం. స్కూల్లో గానీ కాలేజీలో కానీ మా అమ్మాయికి కులం గురించి చెప్పాల్సిన అవసరం రాలేదు. మేము కూడా ఆ చర్చ ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. మా అమ్మాయి కూడా మనది ఏ కులం అని మమ్మల్ని అడిగే అవసరం రాలేదు. అలాంటి కుల చర్చ లేని ఇంటి నుండి బయటికి వెళ్ళింది. చాలా మంచి భావాలతో కుల, మతాల ప్రమేయం లేకుండా పెరిగిన మా అమ్మాయికి అకస్మాత్తుగా తన కులమేదో యూనివర్సిటీలో చెప్పాల్సిన అవ సరం ఏర్పడింది.
మన కాస్ట్ ఎంటమ్మా?
గురువారం యూనివర్సిటీ సమయంలో కాల్ చేసింది. 'ఎప్పుడూ ఈ సమయంలో కాల్ చేయవు కదా నాన్నా' అన్నాను. 'అమ్మా మన కాస్ట్ ఏంటి' అని అడిగింది. ఒక్క క్షణం నిర్ఘాంత పోయాను. కానీ తేరుకొని 'ఎందుకు' అని తిరిగి ప్రశ్నించాను. 'యూనివర్సిటీలో చెప్పాలి' అంది. ఒక్క క్షణం తటపటాయిస్తూ చెప్పాను. 'సరే అమ్మా' అని ఫోన్ పెట్టేసింది.
సమాజం మనల్నే ఊబిలోకి లాగేస్తే...
మనం ఎంత జాగ్రత్తగా కుల, మత ప్రమేయం లేకుండా, అవసరం లేకుండా పెంచినా ఎక్కడో ఒకచోట ఇలా చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ కుల, మతాలు మనిషి నరనరాల్లో చొచ్చుకు పోయాయి. వీటిని విడదీయడం అంతా ఆషామాషీ విషయం కాదు. ఇదో పెద్ద వ్యూహం. దీన్ని ఛేదించలేము. ఇన్నేళ్లుగా దేని ప్రస్తావన లేకుండా బ్రతికేశామో అదే ఈరోజు నేనే చెప్పాల్సి వచ్చింది. మన ఆలోచనలు ఎలా ఉన్నా సమాజం మనల్ని ఒక్కోసారి తన వైపుకు లాగేసుకుంటుంది.
ఏది ఏమైనా ఇలా మళ్ళీ మా మధ్య ఈ చర్చ జరగక పోవచ్చు. తనూ ఈ విషయం మరిచి పోతుంది. కానీ ఈ ఫారమ్స్‌లో క్యాస్ట్ కోలమ్స్‌లో ఆప్షన్ ఉంటే, ఇష్టం ఉన్న వాళ్ళు రాస్తారు లేని వాళ్ళు స్కిప్ చేస్తారు. ఇలాంటి గొప్ప సమాజం ఎప్పుడు ఏర్పడుతుందో మరి. అలాంటి సమాజం కోసం ప్రయత్నం చేద్దాం. ఆకాంక్షిద్దాం.
సర్వమంగళ
89616 26848






