- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయుధ రాజకీయాల ఉచ్చులో ఇరాన్!
అమెరికా ఆర్మీ హెడ్ జనరల్ మెక్ ఆర్థర్ అత్యంత భయంకరమైన పరమాణు బాంబును జపాన్ మీద అమెరికా ప్రయోగించినప్పుడు..

అమెరికా ఆర్మీ హెడ్ జనరల్ మెక్ ఆర్థర్ అత్యంత భయంకరమైన పరమాణు బాంబును జపాన్ మీద అమెరికా ప్రయోగించినప్పుడు.. ఆ ప్రళయకాండ చూసి తట్టుకోలేకపోయాడు. ఇంత పెద్ద విధ్వంసం ఒక ఆటంబాంబు సృష్టించగలదా? అని విలపిస్తూ అతడు అన్న వాక్యాలు ఇవి 'The supreme value of human life and human dignity has been forgotten'. కాలం మారినా యుద్ధాలు అందించిన పాఠాల నుండి ఇంకా ప్రభుత్వాలు ఏం నేర్చుకోలేదని తెలుస్తోంది. ఇటీవల జూన్ 22న అమెరికా మళ్లీ ఇరాన్ అణ్వాయుధాలని చెబుతున్న స్థావరాల మీద చేసిన దాడుల్ని చూస్తే యుద్ధాలు ఆనాడే కాదు.. ఏనాడు కూడా ఆగవు అని తెలుస్తుంది.
ఎప్పుడో 2015కు ముందు ఇరాన్ దగ్గర పరమాణు బాంబుకు సంబంధించిన ఏవో పదార్థాలు ఉన్నాయని, వాటితో అది పరమాణు బాంబు తయారు చేసుకోగలుగుతుందని ఒక అస్పష్టమైన రిపోర్టుని ఈ రోజు బయటకు తెచ్చి ఐఏఈఏ సంస్థను ముందుకు పెట్టి చర్చల పరంపర పూర్తి కాకుండానే ప్రపంచం ముందు ఇరాన్‌ను దోషిగా నిల్చోబెట్టి ఇరాన్ మీద ఇటు అమెరికా, అటు ఇజ్రాయిల్ దాడి చేసే నేపథ్యం వెనుక జాతీయ, అంతర్జాతీయ కుట్రలు ఎన్నో దాగి ఉన్నాయి..
అణుబాంబుల గురించి నీతి కథలు వద్దు!
ఏ దేశమైనా పరమాణు బాంబు తయారు చేయాల నుకుంటే దాన్ని మానవాళి ఎప్పుడూ కూడా సమర్థించదు. సాధారణ ప్రజలు ఏ దేశం వారైనా వారికి యుద్ధాలతో పనిలేదు.. రోజువారీ జీవితం సక్రమంగా కొనసాగితే చాలు అని కోరుకుంటారు. బాంబులైనా, బాలిస్టిక్ మిస్సైల్స్ అయినా, అణ్వాయుధాలైనా, వివిధ రకాల యుద్ధ సామాగ్రి అయినా అవసరం ప్రజలకు ఉండదు. ఆనాడు ఇరాక్‌లో పరమాణు బాంబులు ఉన్నాయని ఇరాక్ మీద దాడి చేసి దాన్ని సర్వనాశనం చేసింది అమెరికా. కానీ, వెదికి రుజువు చేయలేకపోయింది. అంతకుముందు, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పూర్తిగా ఓడిపోయి లొంగిపోయిన తర్వాత కూడా తమ దగ్గర ఉన్న పరమాణు బాంబు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని గొప్ప ఉత్సాహంతో.. జపాన్ మీద వేయాల్సిన అవసరం లేకపోయినా సరే హిరోషిమా, నాగసాకి మీద అమెరికా ప్రయోగించింది. దీంతో ప్రపంచం ఏనాడూ చూడని, కనీవినీ ఎరగని అత్యంత మానవ విషాదం జపాన్‌లో మనం చూశాం. ఆ ప్రభావంతో ఈ రోజుకి కూడా జపాన్ ప్రజలు రేడియేషన్‌కి గురవుతూనే ఉన్నారు. అలాంటి పరమాణు బాంబుని ప్రపంచం మీద ప్రయోగించిన అమెరికా, ప్రపంచశాంతికి భగ్నం కలిగించిన అమెరికా ఈ రోజు ఆటం బాంబుల గురించి నీతి కథలు, పంచతంత్ర కథలు వల్లిస్తోంది.
వ్యాపారంలో పోటీ పడితే చాలు.. విలన్లే
ఆయుధాల ఫ్యాక్టరీలకు యుద్ధాలు కావాలి.. వాటిని కొనసాగించేందుకు ట్రంప్ లాంటి పెద్ద నియంత కావాలి. యుద్దాలకు ఒక కథ కావాలి. స్క్రీన్ ప్లే కావాలి. దర్శకత్వం కావాలి. ఆయుధాల ఫ్యాక్టరీలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి అంటే, ఆయుధాల ఫ్యాక్టరీల కార్పొరేట్లు విపరీతమైన లాభాలతో సర్వసుఖాలు అనుభవించాలి. అంటే, దేశ దేశాల మధ్య సంఘర్షణలు ఉండాలి. లేకపోయినా, ఈ మహానుభావులు కొత్త కథలు అల్లుతారు. మరి యుద్ధాలు జరిగితేనే కదా ఆయుధాల స్టాక్ ఖాళీ అవుతుంది. ఆయుధాలు చెల్లితేనే కదా మరలా ఆయా ఫ్యాక్టరీల్లో కొత్త అప్డేటెడ్ ఆయుధాలు తయారవుతాయి. ప్రతి దేశంలో సంఘర్షణ కోసం వీరికి ఒక కథ అవసరం. కథా రచయితలు వీరి సీఐఏ ఆస్థానంలో ఎల్లప్పుడూ ఉండనే ఉంటారు. క్షణాల్లో స్క్రిప్ట్ అందించేస్తారు.. ఎవరిని విలన్ చేయాలో, ఎవరిని హీరో చేయాలో జీ హుజుర్ అని ఈ కథకులు సిద్ధంగా ఉంటారు. గాజాను నెలల తరబడి స్మశాన వాటికగా మార్చేస్తున్న ఇజ్రాయిల్ నెతన్యాహుని ఈ కథకులు హీరోగా మార్చేస్తారు.. తమ వ్యాపార అవసరాలకు భగ్నం కలిగిస్తూ వ్యాపారంలో దూసుకుపోతున్న ఇరాన్ లాంటి దేశాలను విలన్ చేసేస్తారు.
చైనాకు, రష్యాకు బుద్ధి చెప్పాలని..
ఈ రోజు శత్రువుగా ఉన్న ఇరాన్ ఒకప్పుడు అమెరికాతో ఆత్మబంధువుగానే ఉండేది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అధికార పీఠాలు మారిపోయినప్పుడు, ఇరాన్‌కు అమెరికాకు మధ్య మిత్ర సంబంధాలు తగ్గిపోయినప్పుడు దాంతో పాటు చైనా, రష్యా ఇరాన్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ ముగ్గురి త్రయం దౌత్య సంబంధాలను, చమురు సంబంధాలను పెంచుకున్నప్పుడు అమెరికా విలన్‌కు కాస్త కష్టంగానే ఉంటుంది. తనకు ఎదురు తిరిగి ఎవరు నిలబడకూడదు కదా.. ఇరాన్ మీద చిన్న దెబ్బ వేయక తప్పదు. అలా వేస్తేనే కదా అటు చైనాకు, రష్యాకు బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇటు ఇజ్రాయిల్‌ను సమర్ధించినట్టు ఉంటుంది. మరోవైపు తమ దేశంలో ఉన్న ప్రైవేటు ఆయుధాల కర్మాగారాలకు మంచి డిమాండ్‌ను అందించినట్టు ఉంటుంది. మానవ సంహారం జరిగితేనే కదా ఆ బాంబులు ఎలా పనిచేస్తున్నాయో తెలిసేది. అప్పుడే కదా అంతకంటే మరింత భయంకరంగా, మరింత సాంకే తికంగా, మరింత కర్కశంగా నరసంహారం చేయగలిగే బాంబుల్ని, విమానాల్ని తయారు చేయగలదు.
పెట్టుబడుల మధ్య ఘర్షణే యుద్ధం!
పెట్టుబడిదారీ వ్యవస్థకి పెట్టుబడులే ముఖ్యం. అదనపు ఉత్పత్తి చెల్లగొట్టడమే ముఖ్యం. అది కన్జ్యూమర్ గూడ్స్ అయినా, ఆయుధాలైనా ఈ వ్యవస్థకి ఒక్కటే. యుద్ధాలు సామ్రాజ్యవాదుల వికృత చేష్టలు. ఆర్థిక ప్రయోజనాల కోసం, పెట్టుబడుల కోసం, లాభాల కోసం, సామ్రాజ్యాల కోసం ఎంతటికైనా తెగించే వ్యవస్థ గతంలో రెండు ప్రపంచ యుద్ధాల్లో చూశాం. గాజాలో చూసాం. నేడు ఇరాన్‌లో కూడా చూడ బోతున్నాం. ఇది అంతర్జాతీయ పెట్టుబడుల సమస్య. అంతర్జాతీయ పెట్టుబడులకు మధ్యనే సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణల ఫలితంగానే యుద్ధాలు కూడా ఆరంభం అవుతాయి. ఇందులో నలిగిపోయేది సాధారణ ప్రజలే..
-కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213






