- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తు.. ఒక మహావిపత్తు..!
ఈ ప్రపంచంలో మత్తుకు మించిన మహా విపత్తు మరేది ఉండదు.. ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల వల్ల నష్టం అనుకోకుండా జరుగుతుంది.

ఈ ప్రపంచంలో మత్తుకు మించిన మహా విపత్తు మరేది ఉండదు.. ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాల వల్ల నష్టం అనుకోకుండా జరుగుతుంది. కానీ మత్తు అనే మహమ్మారి మనవ శరీరాన్ని అచేతనంగా మార్చేస్తుంది. ఒక్కసారి అలవాటైతే విపత్తుకు మించి వినాశనం వైపు నడిపిస్తోంది. మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మనిషిని మరింత కుంగదీస్తుంది. కర్రకు పట్టిన చెదపురుగులా నిలువెత్తు మానవ మెదడును కరగదీస్తుంది. భూకంపానికి మించిన అలజడులను సృష్టిస్తుంది. ఫలితంగా మనిషి తనకు తెలియకుండానే రోగిగా మారడంతోనే పాటు కుటుంబం అంతా తీవ్రమైన అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు దాపురించాయి. అటువంటి మత్తును నివారించడానికి ప్రతీ ఏటా జూన్ 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తారు..
30 శాతం ప్రజలు.. మత్తుకు బానిసలు
నొర్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో దాదాపు పది కోట్ల మందికి పైగా ప్రజలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు.. దాదాపు 30 శాతానికి పైగా ప్రజలు మత్తు పదార్థాలు లేనిదే తమ దైనందిన చర్యలు చేయలేకపోతున్నారని పలు పరిశీలనలు చెబుతున్నాయి.. ఇలా ఉన్న వారికి వెంటనే చికిత్స అవసరం. ఈ మత్తు పదార్థాలను సేవించిన తరవాత వ్యక్తుల ప్రవర్తన వింతగా ఉంటుంది. తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకూ అధికమవుతూ నిత్యం ఏదో ఒకచోట పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు పట్టుబడటం పరిపాటిగా మారింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన మత్తు పదార్థాల జాడ్యం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకింది. మత్తు పదార్థాలు రకరకాల రూపంలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు చేరుతున్నాయి. ధూమపానం, మద్యపానంతో సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా మాదక ద్రవ్యాల దాకా విస్తరిస్తోంది. దేశీయంగా ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ మార్గంగా చూస్తుండటంతో దాని వినియోగం అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది.
అవగాహన కార్యక్రమలు చేపట్టాలి!
సాధారణంగా యుక్త వయసు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. పలు రకాల సాహసాలు చేయాలని వారి మనసు ఆరాటపడుతుంటుంది. అది వారిని మత్తు పదార్థాల వైపు నడిపించే ప్రమాదం ఉంది. మొదట సరదాగా సాహసంగా ప్రారంభమై, ఆ తరవాత అది వ్యసనంలా మారుతుంది. చివరకు జీవితాన్ని నాశనం చేస్తుంది. మాదక ద్రవ్యాల వల్ల హుషారుగా ఉత్తేజంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది కొద్దిసేపే ఉంటుంది. మళ్లీ మళ్లీ మత్తు పదార్థాలు తీసుకోవాలని అనిపిస్తూ.. ఇలా క్రమంగా ఒక వ్యక్తి వాటికి బానిస అయిపోతాడు.. దానివల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కుటుంబాలు అల్లకల్లోలమవుతాయి. అందువల్ల తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు పిల్లలను నిత్యం గమనిస్తూ ఉండాలి.. మత్తు అనే మహా విపత్తును పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం సైతం పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. నిత్యం పాఠశాల స్థాయి నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వల్ల తలెత్తే నష్టాలపై సామాజిక, ప్రసార మాధ్య మాలు, పత్రికల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.. సరైన చికిత్స అందిస్తే ఆ విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉంది. మత్తును అరికట్టడానికి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాధికారులు కంకణ బద్ధులు కావాలి..
(నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం)
సంపత్ గడ్డం
78933 03516






