- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక రోజు పనిచేసినా బీమా వర్తిస్తుంది.. ఆ చట్టం అందించే ఆశ్రిత హితలాభం
ప్రమాదంలో మరణించిన కార్మికుల ఆశ్రితులందరికీ కూడా నెల రోజులలోగా మొదటి నెల ఆశ్రిత హితలాభం చెక్కులు అందజేయబడ్డాయి.

వారి ఎదురుగా కూర్చున్న వ్యక్తిని చూపిస్తూ, 'వీరు ఫలానా జౌళిమిల్లు అధికారి. వారు పంపించిన ఆర్.సి. వెనక్కి పంపారట...' అశ్చర్యపోయారు బి.ఎస్.శ్రీకృష్ణమూర్తి. అప్పుడు వారు కార్మిక రాజ్య బీమా సంస్థ (కారాబి) మదురై ఉప ప్రాంతీయ కేంద్రం సంయుక్త నిర్దేశకుడు. నేను ఉప నిర్దేశికుడిని. ఆర్. సి. (రిటర్న్ ఆఫ్ కాంట్రిబ్యూషన్) అంటే, యాజమాన్యాలు కారాబి పరిధిలోకి వచ్చే తమ కార్మికుల బీమా చందా చెల్లింపుల వివరాలతో సమర్పించే అర్థ వార్షిక నివేదిక. నిజానికి అలా తిప్పిపంపకూడదని, కొత్తగా ఆ శాఖకు బదిలీ అయిన నన్ను, మా హితలాభ శాఖ సిబ్బంది హెచ్చరించారు. ఐతే, అలా చేయడానికి బలమైన కారణముంది.
ఆ యాజమాన్యం పంపిన ఆర్.సి. లో చాలామంది పేర్లైతే ఉన్నాయి గాని వారి, వారి బీమా సంఖ్యలు లేవు. అదే చెప్పాను. 'దానిదేముందండి. వారంతా రోజువారీ వేతనంపై పని చేస్తారు. ఒకరోజు పని ఉంటే రెండోరోజు లేకపోవచ్చు. ఐనా, వారి తరఫున కూడా చందా చెల్లించాం కదా' అని అధికారి జవాబు. కదా! అన్నట్టు చూసారు శ్రీకృష్ణమూర్తి. 'మరి అలాంటి వారికి పనిలో ప్రమాదం జరిగినా కారాబి నుండి హితలాభం కోరమని వ్రాతమూలకంగా తెలపగలరా' అని సందేహం వ్యక్తపరిచాను. ఎలాగైతే ఆర్.సి. తిప్పి పంపే అధికారం మాకు లేదో, అలా హామీ ఇచ్చే అవకాశం వారికీ లేదు. కథ సుఖాంతమైంది.
శివకాశిలో బీమా చట్టం పనిచేయదా?
నేను మదురైలో పనిచేస్తుండగా, ఆ మిల్లులో ఏ పెను ప్రమాదం జరగలేదు కానీ, నేను అక్కడ పనిచేస్తున్నప్పుడే శివకాశిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డాన్ ఫైర్ వర్క్స్ బాణాసంచా కర్మాగారంలో 1991 సెప్టెంబర్ 20న జరిగిన అగ్నిప్రమాదంలో 39 మంది కార్మికులు మరణించారు. మరో 65 మంది గాయపడ్డారు. దాంతో పరిశ్రమలలో భద్రతాలోపాలు పైన, ముఖ్యంగా బాణాసంచా కర్మాగారాలలో ప్రమాదకర పరిస్థితుల్లో బాలకార్మికులు కూడా పనిచేయాల్సి రావడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యకమయింది. అప్రమత్తమైన ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి తంగరాజును విచారణ అధికారిగా నియమించింది. వారి ముందు ఒకరోజు విచారణలో డాన్ ఫైర్ వర్క్స్ కారాబి చట్టం క్రింద నమోదయిందని, కానీ మరణించిన వారిలో 17 మంది సహా, కొందరిని యాజమాన్యం బీమావ్యక్తులుగా నమోదు చేయించలేదని బయటపడింది.
ఒక రోజు పనిచేసినా బీమా వర్తిస్తుంది
సహజంగానే అందరిలో ఆందోళన వ్యక్తమయింది. నేను కలగజేసుకుని కారాబి చట్ట నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన నాటికి, నమోదు చేయబడని కార్మికులు కూడా, వారిని ఆ రోజే పనిలో పెట్టుకున్నా, బీమా వ్యక్తులు( ఇన్స్యూర్ఢ్ పర్సన్) గానే పరిగణించబడతారని, వారి కుటుంబాలకి నిబంధనల ప్రకారం ఆశ్రిత హితలాభం ( డిపెండెంట్స్ బెనిఫిట్) చెల్లించబడుతుందని, తెలియపరిచాను. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ ప్రమాదంలో మరణించిన వారందరి ఆశ్రితులకు, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా, మరణించిన కార్మికుల నెల జీతాలలో దాదాపు 90 శాతం, మొదటి నెల ఆశ్రిత హితలాభం అందజేయబడింది.
నెలరోజుల్లోపే ఆశ్రిత హితలాభం
సెప్టెంబర్ 14, 1997 న విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 56 మంది మరణించారు. 150 పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు కాంట్రాక్ట్ కార్మికులు. ప్రమాదం జరిగేనాటికి యాజమాన్యం కారాబి చట్టం క్రింద నమోదు చేయని 37 మందితో సహా, ఆ ప్రమాదంలో మరణించిన కార్మికుల ఆశ్రితులందరికీ కూడా నెల రోజులలోగా మొదటి నెల ఆశ్రిత హితలాభం చెక్కులు అందజేయబడ్డాయి. పనిలో చేరిన రెండో రోజునో, మూడో రోజునో ప్రమాదానికి గురై ఒక కార్మికుడు మరణించడం నేను 1998 లో కేరళ రాష్ట్ర కారాబి ప్రాంతీయ నిర్దేశకుడిగా పనిచేస్తున్నప్పుడు ఉద్యోగ మండల్‌లో ఉన్న ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ కర్మాగారంలో సంభవించింది. ఆ కార్మికుని ఆశ్రితులకు కూడా మొదటి నెల హితలాభం నెల దాటకుండానే చెల్లించబడింది.
అమలు కంటే అతిక్రమణలే సాధారణం
1940ల నాటి మన దేశ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కారాబి (కార్మిక రాజ్య బీమా సంస్థ) చట్టం ఆశ్రితులు పదాన్ని విపులార్ధంలో నిర్వచించింది. మరణించిన ఉద్యోగి భార్య, 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన కుమారులు, వివాహం కాని కుమార్తెలు, వితంతు తల్లి ఆశ్రితులు (డిపెండెంట్స్)గా పరిగణించబడతారు. వీరెవరూ లేనిపక్షంలో, ఆ ఉద్యోగిపై వాస్తవంగా ఆధారపడి జీవిస్తున్నారని నిర్ధారించబడిన భర్త, తండ్రి, తల్లి, ఉద్యోగి తల్లిదండ్రులు మరణించిన పక్షంలో తాత, అమ్మమ్మ, నానమ్మతోపాటు వివాహం కాని లేదా విధవ సోదరి, తలిదండ్రులు ఇద్దరూ మరణించినటువంటి, చనిపోయిన కుమారుడు లేదా కుమార్తె యొక్క పిల్లలు, వివాహం కాని మైనర్ సోదరుడు లేదా సోదరి కూడా ఆశ్రితులు నిర్వచనం పరిధిలోకి వస్తారు. ఈ చట్టం ప్రకారం నెల నెలా అందే ఆశ్రిత హితలాభంతో పాటు, ఆశ్రితులకు ఉచితంగా సంపూర్ణ వైద్య చికిత్స కారాబి ఆసుపత్రుల ద్వారా అందుతుంది. అతి తక్కువ చందాతో ఇట్లాంటి బీమా సదుపాయాలు సమకూర్చే చట్టం అమలు కంటే అతిక్రమణలే సాధారణం కావడం అందరం సిగ్గుపడాల్సిన విషయం.
మల్లాప్రగడ రామారావు
99898 63398






