కర్ణాటక పీఠం ‘మార్పు’ సంకేతాలు..

by Ravi |   (  Updated:2025-12-02 00:45:31  IST  )

కర్ణాటక ఆధికార పీఠం సమరానికి తెరపడే సమయం ఆసన్న‌మైంది. సందిగ్ధతను తొలగించేందుకు బెంగళూరు, ఢిల్లీల్లో వేదికలు సిద్ధమైనట్లే. ఈ పరిస్థితి 'చేయి'దాటి పోకూడదనే అధిష్టానం‌ రాష్ట్ర పరిస్థితులను దగ్గరుండి

కర్ణాటక పీఠం ‘మార్పు’ సంకేతాలు..
X

కర్ణాటక ఆధికార పీఠం సమరానికి తెరపడే సమయం ఆసన్న‌మైంది. సందిగ్ధతను తొలగించేందుకు బెంగళూరు, ఢిల్లీల్లో వేదికలు సిద్ధమైనట్లే. ఈ పరిస్థితి 'చేయి'దాటి పోకూడదనే అధిష్టానం‌ రాష్ట్ర పరిస్థితులను దగ్గరుండి సమీక్షించగా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యద ర్శులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ తదితరులు పరిస్థితులను చక్కబెట్టేందుకు పూనుకున్నారు. రాష్ట్రంలో విధానసభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ లోగా కర్ణాటక రాజకీయ సంక్లిష్టతను నివారించాలని అధిష్టా‌నం తీర్మానించింది.

సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే తనకు డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి పోటీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. అధిష్టా నం తీసుకున్న నిర్ణయం.. సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి, శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టి తాత్కాలిక శాంతి ఒప్పందంకింద పరిష్కరించినా, అది శాశ్వత పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఆ సమీకరణం మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.. పార్టీ అంతర్గత వర్గాల ప్రకారం, శివకుమార్‌ను త్వరలోనే సీఎం పదవికి తీసుకురావచ్చన్న ఊహాగానాలు వేగంగా వ్యాపి స్తున్నాయి. మరోవైపు, సిద్ధరామయ్య మాత్రం పూర్తి ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేయాలని హైకమాండ్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది. తదుపరి ఎన్నికల్లో శివకుమార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఫార్ములాను కూడా ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం.

ముఖ్యమంత్రి పదవికి డీకే అర్హుడే..

కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు ఇద్దరు శక్తివంతమైన నేతల మధ్య ముఖ్య అనిశ్చితి దశలో నిలబడి ఉంది. సిద్ధరామయ్యకు ఉన్న పరిపాలనా అనుభవం, సామాజిక సమీకరణలపై ప్రభావం బలంగా ఉండగా, శివకుమార్‌కు ఉన్న నిర్వహణా దృఢత్వం, సంక్షోభ సమయాల్లో పార్టీని నిలబెట్టిన తీరు ఆయనను సీఎంగా అర్హుడిగా నిలబెడుతున్నాయి. రాబోయే నెలలు కర్ణాటక కాంగ్రెస్‌కు రాజకీయంగా అత్యంత సున్నితమైనవి. సీఎం కుర్చీపై ఎవరి ఆధిపత్యం బలపడుతుంది అధిష్టా‌నం మరో వ్యూహాన్ని తెరమీదకు తీసుకుని రాబోతోందా? మరో సమీకరణం ఆలోచిస్తుందా? లేక 2023 ఒప్పందమే కొనసాగు తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంది.

ప్రభుత్వంలో అస్థిరత్వం ప్రమాద సంకేతం..

ఇక్కడ కూడా నాయకత్వ మార్పులు జరుగుతున్నాయన్న చిత్రం బయటకు వెళితే, జాతీయస్థాయిలో ‘కాంగ్రెస్‌లో స్థిరత్వం లేదు’ ఆనే భావన బలపడుతుంది. 2029 ఎన్నికలకు ఇది కాంగ్రెస్‌కి ప్రారంభ నష్టమే అవుతుంది. డీకే శివకుమార్ సీఎం కావచ్చన్న చర్చలో మరో కీలక అంశం ఆయనపై ఉన్న గత ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు.. ఇవి బీజేపీ చేతిలో ఎప్పుడైనా తిరిగి ప్రయోగించగల రాజకీయ ఆయుధాలు. ఈ సమీకరణ దెబ్బతింటే కర్ణాటక మాత్రమే కాదు, మొత్తం దక్షిణాదిలో పార్టీకి ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు.

కాంగ్రెస్ వేసే ప్రతి అడుగూ కీలకమే

రాజకీయాలు కేవలం గణితం కాదు. భావాలు, నమ్మకం, స్థిరత్వం అన్నీ కలిసిన వ్యవస్థ. ఓటములు వచ్చినప్పుడు ప్రజలు మార్పుల కన్నా, స్థిర నాయకత్వాన్నే కోరుకుంటారు. కర్ణాటకలో సీఎం మార్పు ఆ చిత్రాన్ని ఇవ్వకపోవచ్చు.. కానీ కొత్త రిస్కులను మాత్రం తెస్తుంది. 2029 ఎన్నికల దిశగా పార్టీ తీసుకునే ప్రతి అడుగు ఇప్పుడు మరింత కీలకంగా మారింది. పట్టువీడని సిద్ధు, శివకుమార్ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వారి మద్దతు దారుల్లో అసంతృప్తి పెల్లుబుకే ప్రమాదం లేకపోలేదు. అధిష్టాన నిర్ణయం ఏమాత్రం సమతౌల్యాన్ని కోల్పోయినా పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాత్కాలిక పరిష్కారం ప్రస్తుతానికి గట్టెక్కించినా మళ్లీ మళ్లీ సమస్య రేగుతుందని అధిష్టానం గ్రహించడం ఆవశ్యం.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story