- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్షోభంలో భారత రోడ్డు భద్రత!
అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రతిసారీ భారత్‌లో రోడ్డు భద్రతా వ్యవస్థ గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయని

అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రతిసారీ భారత్‌లో రోడ్డు భద్రతా వ్యవస్థ గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగు తూనే ఉన్నాయని అందులో మనదేశ పనితీరు చాలా అధ్వాన్నంగా ఉన్నదని ప్రజల ప్రవర్తనలో మార్పు రాకుండా చట్టాలపై భయం కలగనంత కాలం దేశంలో మార్పు రాదని సంబంధిత శాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లోనే చేసిన ప్రకటనలో ముఖ్యమైనది. ఒక ప్రమాదం జరగగానే ఆవేశంగా తీర్పులిచ్చి తర్వాత పది మీటర్ల దూరానికీ రాంగ్ రూట్లోనే వెళ్లడం మన గొప్పదనం. ఇలాంటి ప్రత్యేకతలతోనే ఒక్క శాతం కూడా లేని వాహనాలతో 11% ప్రమాదాలతో కొన్నేళ్లుగా ప్రపంచంలో మొదటి స్థానంలో మనమే ఉంటున్నాం.
ప్రమాదం జరిగినప్పుడే అలర్ట్..
ప్రమాదం జరగ్గానే ఎక్కడ లేని అలర్ట్ చూపిస్తుంటారు. తక్షణమే ప్రజలిచ్చే తీర్పులూ, గట్టి చర్యలు తీసుకుంటామని యధావిధిగా చెప్పే నాయకులు, తమ పాపం ఏమీ లేనట్లు అప్పుడే ఉద్యోగంలో చేరినట్లు ఓ నాలుగు రోజులు హడావుడి చేసి గమ్మునుండే ప్రభుత్వ అధికారులు ఆనక కథ కంచికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే మళ్లీ మొదటికీ, ఎన్నేళ్లుగా చూడడం లేదీ ప్రహసనం. ఒక ప్రమాదం జరగగానే ఆవేశంగా తీర్పులిచ్చి తర్వాత పది మీటర్ల దూరానికీ రాంగ్ రూట్లోనే వెళ్లడం మన గొప్పదనం.
ట్రాఫిక్ సెన్స్ లేని మహానగరాలు..
ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు. మహానగరాలుగా మనం భావించే డిల్లీ, ముంబయి, చెన్నయ్, బెంగళూరు, హైద్రాబాద్ లాంటి నగర ప్రజలకూ ట్రాఫిక్ రూల్స్ పట్ల కనీస అవగాహన ఉండదు. లేన్ డ్రయివింగ్ గురించి అసలు తెలియదు. ఇక జాతీయ రహదారుల్లో వేగంగా వెళ్లాల్సిన లేన్లలో భారీ వాహనాలు మెల్లగా వెళుతూ వెనక వారిని ఇబ్బంది పెడతాయి. కానీ టోల్ వసూలులో కఠినంగా వ్యవహరించే సంస్థలు కానీ, సంబంధిత ప్రభుత్వ శాఖలవారు కానీ ఏ మాత్రం చలించరు, చర్యలు తీసుకోరు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి మధ్యనున్న డివైడర్లలో గడ్డి మేస్తున్న పశువులు కనబడతాయి. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.
దేవుడిపై భారంమోపి ఊరుకుందామా?
చిన్న మోపెడ్ నుంచి భారీ వాహనాల వరకు ఏది కొనాలన్నా 99% దేశ ప్రజలు చూసేది మంచి రోజుతోపాటు సమయం కూడా అడ్వాన్స్ చెల్లింపు నుంచి షోరూమ్కి వెళ్ళి వాహనం తెచ్చుకునే వరకూ దాన్ని ఆచరిస్తారు. కొనుక్కున్న వాహనం కొత్తదైనా, పాతదైనా దేవాలయానికి తీసుకెళ్ళి వాహనానికి పూజ చేయిస్తాం. ఇవన్ని ఎందుకంటే ప్రమాదం జరగకూడదనే భయం కల్పించిన నమ్మకం వల్ల. కానీ దేవుని ముందు దీపం వెలిగించి నీదే భారం అని వదిలేస్తామా, గాలికి ఆరకుండా దీపాగ్ని వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవద్దూ.. తను కష్టార్జితంతో కొనుక్కున్న వాహనంలో తమకు ఎలాంటి ప్రమాదం జరగరాదని దేవుడ్ని వేడుకొని ఆ భారాన్ని అక్కడితో వదిలేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నియమ నిబంధనలు తెలుసుకోకుండా, తెలిసినా ఆచరించకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రజలు ఇక్కడ బాధితులే కాదు, ముద్దాయిలు కూడా. సివిక్ సెన్స్... రహదారి ప్రమాదాలకే కాదు దేశంలోని అనేక రోగాలకు చికిత్స అదే. అది రావాలని కోరుకుంటూ...
(రేపు ప్రపంచ రోడ్డు భద్రత బాధితుల స్మారకదినం సందర్భంగా)
-నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
94407 34501






