భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణ అభివృద్ధికి కొత్త దిక్సూచి!

by Ravi |   (  Updated:2026-06-10 01:00:58  IST  )

హైదరాబాద్ విస్తరణకు, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ప్రతీకగా రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దేశంలోనే తొలి నెట్-జీరో నగరంగా, పెట్టుబడులు, పరిశ్రమలు, విద్య, క్రీడలు, ఆధునిక మౌలిక వసతులకు కేంద్రంగా ఎలా మారనుందో తెలుసుకోండి.

భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణ అభివృద్ధికి కొత్త దిక్సూచి!
X

‘నా నగరాన్ని చేపలతో నిండిన నదిలా ప్రజలతో నింపుము’ నాలుగు శతాబ్దాల క్రితం హైదరాబాద్ స్థాపన సమయంలో మహ్మద్ కులీ కుతుబ్ షా తన నగరం ప్రజలతో కళకళలాడాలని కోరుకున్నాడు. నేడు అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కానుంది. ఇది చారిత్రక తెలంగాణలో మరో కొత్త చరిత్రకు చిరునామాగా మారనుంది.

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందుతోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతూ, యావత్ ‘మినీ ఇండియా’ను తలపిస్తోంది. నగరంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలోని మీర్కాన్‌పేట్‌ కేంద్రంగా సుమారు 30 వేల ఎకరాల్లో, ఏడు మండలాలలోని 56 గ్రామాల్లో ఈ మహానగరం అభివృద్ధి కానుంది.

దేశంలోనే తొలి నెట్-జీరో సిటీగా..

గతేడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును టోక్యో, న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ తరహాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నగరాలు కాంక్రీట్ అడవులుగా మారుతూ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఈ సిటీని దేశంలోనే తొలి నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 30 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సిటీలో 50 శాతం ప్రాంతాన్ని పచ్చదనానికి కేటాయించనున్నారు.

అభివృద్ధికి చిరునామాగా ఫ్యూచర్ సిటీ..

అభివృద్ధికి కేంద్రబిందువుగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ విలువను మరింత పెంచేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడనుంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, హెల్త్ రంగాలకు హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకై ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ ప్రభు త్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాబోయే రోజుల్లో ఫార్చ్యూన్-500 కంపెనీలను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అయితే ఈ ఫ్యూచర్ సిటీపై రాజకీయ విమర్శలు గుప్పుమంటున్నా.. తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఫ్యూచర్ సిటీ పనులను వేగవంతం చేస్తుంది స‌ర్కార్. ప్రజల్లో విశ్వాసం నింపేందుకు వారంలో ఒకరోజు అక్కడ నుంచి పరిపాలన చేసేందుకు సిద్ధమవు తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

లైవ్–లెర్న్–వర్క్–ప్లే కాన్సెప్ట్‌తో..

భారత్ ఫ్యూచర్ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా సమగ్ర జీవన విధానాన్ని అందించే ఆధునిక నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం “లైవ్–లెర్న్–వర్క్–ప్లే” నమూ నాను అమలు చేస్తూ పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసు పత్రులు, క్రీడా సముదాయాలు, పార్కులు, షాపింగ్, వినోద కేంద్రాలను ఒకే ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్, ఆధునిక స్టేడియంలను ఏర్పాటు చేసి యువతకు ప్రత్యేక క్రీడా శిక్షణ అందించనున్నారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి నైపుణ్యవంతులైన మానవ వనరులను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

బుల్లెట్ రైలు.. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు..

ఫ్యూచర్ సిటీ, ORR, RRR మధ్యలో ఉండటంతో రవాణా రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాల రహదారులు, ఆధునిక మౌలిక వసతులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. సముద్ర తీర ప్రాంతాల అనుసంధానాన్ని మెరుగుపరిచేలా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానంగా అమరావతి మీదుగా ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం ప్రతిపాదించారు. జాతీయ రహదారులు, ORR, RRRలకు అనుసంధానంగా కొత్త రోడ్లు, రైల్వే మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధ మయ్యాయి. భవిష్యత్తులో అమరావతి, చెన్నై, బెంగళూరులకు నగరాలకు బుల్లెట్ రైలు కనెక్టివిటీ అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. అలాగే రాజీవ్ గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సౌకర్యాలు మరింత బలోపేతం కానున్నాయి.

సింగపూర్ కంటే పెద్దది!

ప్రపంచ ప్రఖ్యాత సింగపూర్‌ కంటే పెద్ద విస్తీర్ణంలో ప్రణాళి‌కాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా Future City Development Authority (FCDA)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ పరిధిలోని ఏడు మండలాలు, 56 గ్రామాల్లో అభివృద్ధి పనులు, అనుమతులు, అమలు ప్రక్రియలను పర్యవేక్షించనుంది.పెట్టుబడిదారులకు సింగిల్- విండో విధా నంలో అనుమతులు అందించడంతో పాటు ప్రత్యేక కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్న “చైనా ప్లస్ వన్” పెట్టుబడి వ్యూహంలో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రణాళికలు విజయవంతంగా అమలైతే ప్రపంచ నగరాలకు ధీటుగా ఎదిగి, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకురానుంది.

-ఏముల కొండల్ గౌడ్

94406 02724

Next Story