- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ ఎమ్మా గేట్‌వుడ్... గిరిజ పైడిమర్రి
ట్రెక్కింగ్ అనేది కేవలం ప్రయాణం కాదు.. ప్రకృతితో మమేకమై జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకునే అనుభవం. ఎమ్మా గేట్‌వుడ్, గిరిజ పైడిమర్రి వంటి స్ఫూర్తిదాయక మహిళా ట్రెక్కర్ల ప్రయాణాలు, ప్రకృతి ప్రేమ, సాహస గాథలు

ట్రెక్కింగ్ అంటే, సెల ఏటి సంగీతాన్ని ఆస్వాదించడం. రాతి సితారపై జల సంగీతాన్ని మీటినట్టు, దుమికే జలపాతాల హోరును వింటూ, ఆ అందాల్ని వీక్షించడం. చెట్లు, పిట్టలు, పుట్టలను పలకరించడం. చీలిన రాతి కొండల్లోని మౌన శిలలతో ముచ్చటించడం. అడవి తల్లి చల్లని కనురెప్పల నీడల్లో సేదదీరడం. వెన్నెల్లో నిద్రించడం. ప్రకృతి ముందు మోకరిల్లడం. మనని మనం పునః సమీక్షించుకుని, విశ్వమానవులుగా అవతరించడం.
నీలాకాశంలో క్యాట్ వాక్ చేసే మేఘాలు. వెదురు పొదల్లోంచి వినిపించే వాయు లీనాలు. వీచే గాలికి తలలూపే రెల్లు పొదలు. తల విరబోసుకుని విరగబడి నవ్వినట్టుండే మహా వృక్షాలు. జాతి వివక్ష లేకుండా పెన వేసుకునే చెట్లు, తీగలు.. సమిష్టిగా జీవించే అడవి జంతువులు. చెట్ల కొమ్మల్లో గూళ్లు కట్టుకునే పక్షుల ముక్కెంత? వాటి బలమెంత? నింగి నుంచే అడవి అందాలను వీక్షిస్తాయి. చినుకు రాలినా, గాలి వీచినా, కిరణాలు తాకినా అడివి అడివంతా పులకరించిపోతుంది. ఈ ఆనందం ట్రెక్కింగ్ (హైకింగ్) లోనే సాధ్యమవుతుంది.
ఓదార్పు కోసం అడవిలోకి..
ట్రెక్కింగ్ (హైకింగ్)లో అమెరికాకు చెందిన గ్రాండ్ మా ‘ఎమ్మా గేట్ ఉడ్’ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన గిరిజా పైడిమర్రి కూడా గొప్ప ట్రెక్కర్, ట్రావెలర్. అందుకే ‘వెన్నెల గీత సాహిత్య సామాజిక అధ్యయన వేదిక’ ఎమ్మాగేట్ ఉడ్ ప్రేరణ తొలి అవార్డును గిరిజ పైడిమర్రికి ఈ నెల 12న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగే సభలో ప్రదానం చేయనుంది. ట్రెక్కింగ్‌లో ఎమ్మాగేట్ ఉడ్‌కీ, గిరిజ పైడిమర్రికి కొన్ని సారూప్యతలున్నాయి. అమెరికాకి చెందిన గ్రాండ్ మా ఎమ్మా గేట్ ఉడ్ తన అరవై ఏడవ ఏట 2050 మైళ్లున్న అపలాచియన్ ట్రయల్ ఒంటరిగా ఎక్కి, స్త్రీల ట్రెక్కింగ్ చరిత్రలో ఒక రికార్డు సష్టించింది. ఎమ్మాగేట్ ఉడ్‌ను భర్త దారుణంగా కొట్టేవాడు. అప్పుడామె తనను తాను ఓదార్చుకోడానికి అడవిలోకి పారిపోయేది. భర్త కొట్టే దెబ్బలకు పక్కటెముకలు విరిగిపోయాయి. భర్త నుంచి విడాకులు తీసుకుని పిల్లలంతా ప్రయోజకులయ్యాక, అన్నీ వదిలేసి 1951లో ట్రెక్కింగ్ మొదలు పెట్టింది.
అరవయ్యవ ఏట గిరిజ ట్రెక్కింగ్
గిరిజ పైడిమర్రికి ఎమ్మా గేట్ ఉడ్ లాగా భర్త వేధింపులు, కుటుంబ సమస్యలు లేవు. ఇద్దరు పిల్లలూ ప్రయోజకులయ్యాక, ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశాక, తన అరవైయ్యవ ఏట మేఘాలయలో ట్రెక్కింగ్ మొదలు పెట్టారు. కన్యాకుమారి నుంచి, కశ్మీర్ వరకు దేశమంతా పర్యటించారు. జపాన్, మలేషియా వంటి దేశాలు సందర్శించారు. వెళ్లిన చోటల్లా కనిపించే గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలూ చూశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న విభిన్న జీవన శైలులను పరిశీలించారు.
కష్టాలను అధిగమించడానికి ట్రెక్కింగ్
ఓహియోలోని గేయన్ టౌన్‌షిప్‌లో 1887లో జన్మించిన గ్రాండ్‌మా ఎమ్మా గేట్‌వుడ్ చిన్నతనం నుంచే ప్రకృతి, సాహిత్యంపై ఆసక్తి పెంచుకుంది. వన్య ప్రాణులు, ఔషధ మొక్కలు, అటవీ ఆహార వనరులపై అధ్యయనం చేసి కవిత్వం కూడా రాసేది. 67 ఏళ్ల వయసులో 1954లో తొలిసారి ట్రెక్కింగ్ ప్రారంభించిన ఆమె అనేక కష్టాలను ఎదుర్కొంటూనే అపలాచియన్ ట్రైల్‌ను పూర్తి చేసింది. అడవి ఆకులను పరుపుగా చేసుకుని నిద్రిస్తూ, అడవి పండ్లు, మొక్కలను ఆహారంగా తీసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. తరువాత కూడా ఎన్నో పర్వతారోహణలు, సుదీర్ఘ నడకలు చేసిన ఎమ్మా గేట్‌వుడ్ 86 ఏళ్ల వయసు వరకు సాహస జీవితం గడిపింది. ఆమె జీవితంలో మొత్తం సుమారు 23 వేల కిలోమీటర్లు నడిచి, ట్రెక్కింగ్ ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది.
‘గిరిగమనం’లో భారత దర్శనం
మెదక్ జిల్లాకు చెందిన గిరిజ పైడిమర్రి ఎంఫిల్ చేసి, మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. విద్య, పిల్లల మనస్తత్వం, సామాజిక అంశాలపై అవగాహనతో పాటు సాహిత్య పఠనాన్ని అలవాటుగా చేసుకున్నారు. తాను చేసిన ప్రతి ట్రెక్, సందర్శించిన ప్రతి ప్రదేశం గురించి వ్యాసాలు రాసి, ఆ అనుభవాలను ‘గిరిగమనం’లో పొందుపరిచారు. శేషాచలం కొండల్లోని తుంబురు తీర్థం, సలేశ్రం వంటి కఠినమైన ట్రెక్కింగ్‌లను పూర్తి చేశారు. నదీ ప్రయాణాలు, జలపాతాలు, పర్వతాలు, సముద్ర గర్భ యాత్రలు, చారిత్రక ప్రదేశాల సందర్శనల ద్వారా ప్రకృతి, సంస్కృతి, చరిత్రలను ఆవిష్కరించారు. లక్షద్వీప్ నుంచి జయసల్మేర్ కోట వరకు, మెదక్ కోట నుంచి భిలార్ పుస్తక గ్రామం వరకు ఎన్నో అనుభవాలను లిఖించిన ‘గిరిగమనం’ ఒక రకంగా భారతదేశ దర్శనాన్ని అందించే రచన.
- రాఘవ
94932 26180






