- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరిట్, మౌనం, అసమానతల మధ్య భారత విద్యా వ్యవస్థ!
స్వాతంత్ర్యం తర్వాత విద్య విస్తరించినా భారత సమాజంలో కులం, లింగం, పేదరికం ఆధారిత అసమానతలు ఎందుకు కొనసాగుతున్నాయి? మెరిట్ అనే ముసుగు వెనుక దాగిన విద్యా వ్యవస్థ వైఫల్యాలను, బాలికల భద్రత, పిల్లల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలను విశ్లేషించే వ్యాసం.

స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడిచాయి. ఈ కాలంలో మన దేశంలో పాఠశాలలు పెరిగాయి, విశ్వవిద్యాలయాలు అనేకం విస్తరించాయి, డిగ్రీలు, పీజీలు సాధారణమ య్యాయి. అయినా సమాజం మౌలికంగా మారలేదు, మౌలికంగా మారినా మూలాలు ఇంకా ఏ కాస్త మార్పుకూ గురి కాలేదు.. కులం ఇంకా ఇక్కడి అత్యంత బలమైన శక్తిలా వ్యవహరిస్తోంది. లింగం ఇంకా పరిమితులే విధిస్తోంది. పేదరికం ఇంకా వ్యక్తిగత వైఫల్యంగా ముద్రవేయబడుతోంది.
విద్య ఉన్నా సమానత్వం లేదు. చదువు ఉన్నా న్యాయం లేదు. ఎందుకంటే మన విద్య ప్రశ్నించే మనిషిని తయారు చేయడం లేదు. అడ్జస్ట్ అయ్యే మనిషిని తయారు చేస్తోంది.
అందరికీ ఒకే పరీక్ష.. నిండా అన్యాయం
విద్య సమాజాన్ని మార్చాలంటే ముందు అది అసమాన తలను గుర్తించాలి. కానీ మన విద్య వాటిని గుర్తించదు. వాటి గురించి ప్రశ్నించదు, వాటిలోని లోపాలను ఆ లోపాలను సరిదిద్దుకోగలిగిన అంశాలను గురించి కనీసం ఒక చిన్న ఊహను కూడా చేయదు, మన విద్యా విధానం కేవలం వాటిని సహజ విషయాలుగా మారుస్తోంది, అత్యంత మామూలు అంశాలుగా చూస్తోంది. ఇక్కడ ఒకే సిలబస్, ఒకే పరీక్ష, ఒకే మూల్యాంకనం అనే మాటలు చాలా న్యాయంగా, ధర్మ బద్ధంగా అనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ అవి వాస్తవానికి అత్యంత హింసాత్మకమైన విధానాలు.. ఎందుకంటే ఒక పేద పిల్లాడు, ఒక సంపన్న పిల్లాడు, ఒక బాలిక, ఒక తొలి తరం విద్యార్థి... వీరందరూ ఒకేలా జీవితాన్ని ప్రారంభించలేరు, మరెలా ఒకే విద్యను స్వీకరించి ఒకే పరీక్ష రాసి, ఒకేలా ఉత్తీర్ణులు కాగలుగుతారు? మరెందుకు విద్యా వ్యవస్థ ఈ వాస్తవాన్ని విస్మరించి అందరికీ ఒకే పరీక్ష పెడుతోంది, అందరి నుంచీ ఒకేలాంటి ఫలితాలు ఆశిస్తోంది! అది వ్యవస్థాగత అన్యాయం కదా! అయినా అదే విధానం ఏళ్లకు ఏళ్లుగా కొనసాగుతోంది.
డబ్బున్న వాడికి మెరిట్ అవకాశాలు..
అప్పుడూ, ఇప్పుడు ఇక్కడ రాజ్యమేలుతున్న ఒకే ఒక్క పదం మెరిట్. ఈ పదమే విద్యా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేది. అది ఎప్పుడూ ప్రతిభకు ప్రతీక కాదు, అది అధికారానికి, అధికారిక మార్బలానికి ఒక మర్యాదపూర్వకమైన పేరు. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడగలగడం, కోచింగ్ సెంటర్లకు వెళ్లగలగడం డబ్బులు ఖర్చుపెట్టి ఙ్ఞానాన్ని కొనగలగడం, డిజిటల్ వనరులను వాడేలా ఉండగలగడం.. ఇవన్నీ వ్యక్తిగత కృషిగా, వ్యక్తిగత ఆస్తిగా చూడబడుతున్నాయి. లేనివాడి వెనుకబాటు అతని వైఫల్యంగా మారిపోతోంది. వ్యవస్థ ఎప్పుడూ తన లోపాలను వైఫల్యాలను తన బాధ్యతగా కాక వైయక్తిక లోపాలుగా, వైఫల్యాలుగా మార్చేస్తుంది, వ్యక్తుల మీదకు బాధ్యతను నెట్టేస్తుంది. ఇది కేవలం విద్యా వైఫల్యం కాదు. ఇది రాజకీయంగా అత్యంత సౌకర్యవంతమైన ఎత్తుగడ.
బాలికలకు బడిలో కనీస రక్షణ ఉందా?
బడిలో బాలికల నమోదు శాతం పెరిగిందని మనల్ని సంబరపడేలా చేస్తుంది. కానీ పాఠశాలలు బాలికలకు నిజంగా సురక్షితమా? వారి శరీరంపై వారికి మాట్లాడే హక్కు ఉందా? వేధింపులను ప్రశ్నించే ధైర్యం, వేధింపులపై ప్రశ్నించే చోటు ఉందా? నిజంగా విద్యాలయాల్లో మెన్స్ట్రువేషన్, శరీర స్వస్థత, భద్రత.. ఇలా వీటి గురించైనా విపులంగా తెలుసుకోగలిగే సౌకర్యాలు ఉన్నాయా! మౌనాన్ని వీడి, నిశ్శబ్దాన్ని జయించి బాలికలు తమ హక్కుల్ని, తమ కలల్ని తాము కాపాడుకోగలరా! అన్నీ రేపటికీ ప్రశ్నలే. ఈ మౌనం అమాయకత్వం కాదు, ఈ నిశ్శబ్దం గోప్యమైనదీ కాదు. ఇది లింగ సమానత్వాన్ని ఏనాటికీ తీసుకురాదలచని అతి పెద్ద నిశ్శబ్దం. బాలికను చదివించడం ఒక రకం అయితే ఆమెను స్వతంత్ర వ్యక్తిగా గుర్తించడం మరొక ముఖ్య విషయం. మన విద్య మొదటిదానితోనే సరిపెట్టుకుంటోంది, అసమానతలను సజీవంగా బతికిస్తోంది.
పిల్లలను మాట్లాడనివ్వని విద్య!
పిల్లలకి హక్కులున్నాయని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ పాఠశాలల్లో పిల్లలకు ఇంకా భయం ఉంది, శిక్షణ చాటున ఒక శిక్ష ఉంది. అవమానం ఉంది, ఆందోళన ఉంటోంది, మార్కులు, ర్యాంకులు బెదిరింపుగా మారుతున్నాయి. పిల్లల అభిప్రాయాలకు అసలు విలువ లేదు. పిల్లల్ని వినకుండా వారి భవిష్యత్తును నిర్ణయించడం ఇక్కడ జరిగే అతిమామూలు విషయం. బహుశా ఇది విద్య కాదు.. ఒక అధికార దుర్వినియోగం. అయినా ఇది కొనసాగుతోంది. ఎందుకంటే వినే వ్యవస్థ కంటే ఆదేశించే వ్యవస్థే పాలకులకు అనుకూలం. ప్రశ్నించే పౌరుడు ప్రమాదకరం. ఆలోచించే విద్యార్థి అసౌకర్యం. అందుకే విద్యను ఉద్యోగానికి కట్టిపడేశారు..
చదువుకున్న సమాజం.. విముక్త సమాజం
అందుకే ఈ దేశంలో ఇప్పటికీ చదువుకున్న సమాజం ఉంది. కానీ విముక్త సమాజం లేదు. డిగ్రీలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్య చైతన్యం లేదు. పరీక్షలు ఉన్నాయి. కానీ న్యాయం లేదు. ఇవేవీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఇవి విధానపరంగా ఏళ్లకేళ్లుగా పేర్చుకుంటూ వచ్చిన ప్రయత్నాలు. విద్య సమాజాన్ని మార్చలేకపోతోందని చెప్పడం అందరికీ సులువే కానీ దాని వెనుక ఉన్న నిజాన్ని అంగీకరించడం పరమ చేదు. విద్య సమాజాన్ని మార్చకుండా ఉంచడానికే పనిచేస్తోంది ఇదే నిజం. ఈ నిజాన్ని ఒప్పుకోకుండా చేసే ప్రతి కొత్త విద్యా సంస్కరణ కూడా పాత అసమానతలకు కొత్త రూపమే ఇస్తుంది.
మెరిట్ ముసుగును చించి పారేయాలి!
విద్య నిజంగా మారాలంటే కొత్త పాలసీలను మార్చడం కాదు.. పాత అబద్ధాలను వదిలేయగలగాలి. సమానత్వం అనే మాటను అలంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకో గలగాలి. మెరిట్ అనే ముసుగును చించి పారేయాలి. మౌనాన్ని, నిశ్శబ్దాన్ని విద్యా విధానంగా కాకుండా వాటిని ఒక హింసగా గుర్తించగలగాలి. పిల్లల స్వరాన్ని వినాలి, బాలికల ఆలోచనలకు, ఆశయాలకు, అంతర్ముఖ అలజడులకు ఒక పరిష్కారం కనుగొనాలి, దిగువన, మధ్యన, అంచున ఉన్న వారి అనుభవాలను విద్య తన ముఖ్య కేంద్రంలో పెట్టగలగాలి. అది జరగనంత వరకు.. విద్య ఉంటుంది. సమాజం కూడా ఏ మార్పూ లేనిదై అలాగే ఉంటుంది. తేడాల్లేవని తెలుసుకునేందుకే కదా చదువుకునేది. అదే తేడాలతో చదువుకుంటే ఇంకేం తెలుసుకుంటాం?
- సుధా మురళి
83096 22246






