భారత్ ‘రాజీ విదేశాంగం’.. పశ్చిమాసియా సంక్షోభంలో మౌనంపై ప్రశ్నలు

by Ravi |   (  Updated:2026-03-22 00:45:57  IST  )

భారత్ పశ్చిమాసియా సంక్షోభంపై మౌనంగా ఉండటం, బ్రిక్స్ అధ్యక్ష పదవిని సక్రమంగా ఉపయోగించకపోవడం, నరేంద్ర మోడీ నాయకత్వంలోని విదేశాంగ వైఫల్యాలపై విశ్లేషణ. అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టపై ప్రభావం పార్లమెంట్ చర్చ అవసరం.

భారత్ ‘రాజీ విదేశాంగం’.. పశ్చిమాసియా సంక్షోభంలో మౌనంపై ప్రశ్నలు
X

అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఒక దేశం తన ప్రాధాన్యతలను, విలువలను, నైతిక బాధ్యతలను పక్కనపెట్టి మరొక దేశానికి లోబడి ప్రవర్తించడాన్ని 'రాజీ విదేశాంగ విధానం' అంటారు.. నేడు భారతదేశం ఆ స్థితికి చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, అత్యంత ప్రాచీన నాగరికతగా, అలీన ఉద్యమానికి మూలస్తంభంగా నిలిచిన భారత్, నరేంద్ర మోడీ నాయకత్వంలో దౌత్యపరమైన బలహీనతకు, నైతిక దివాళాకు ప్రతీకగా మారింది. బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న భారత్ పశ్చిమాసియా సంక్షోభంలో మౌనం వహించడం భారత విదేశాంగ వైఫల్యానికి నిదర్శనమని పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.... బ్రిక్స్ అధ్యక్ష పదవి కేవలం ముసుగు మాత్రమేనా, లేక నిజమైన బాధ్యతా అనేది స్పష్టం చేయాలి. లేనిపక్షంలో, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత దిగజారుతూనే ఉంటుంది.

సమిష్టి ప్రకటనకూ ధైర్యం చాలట్లేదు!

కేవలం ఇరాన్ దాడులు మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో అమెరికా నేవీ ఇరాన్ నేవీకి చెందిన యుద్ధ నౌకపై దాడి చేసింది. ఆ నౌక భారత దేశ ఆహ్వానం మేరకు ఇక్కడకు అతిధిగా వచ్చింది. అలాగే గల్ఫ్ దేశాలలోని సైనికే తర లక్ష్యాలపై ఇరాన్ చేస్తున్నదాడులు.. ఇవన్నీ భారత్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధించిన అంశాలే.. ఇంతటి సున్నితమైన సమయంలో సమష్టి ప్రకటన విడుదల చేయడా నికి కూడా భారత ప్రభుత్వం ధైర్యం చేయలేదు. ఎందుకు కారణం స్పష్టం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం. ఈ రాజీ వైఖరి కొత్తదేమీ కాదు.. గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యపై మోడీ మౌనంగా ఉండిపోయారు. 'చాబహార్' ఓడరేవు అభివృద్ధి ద్వారా ఆఫ్ఘని‌స్తాన్, మధ్య ఆసియాకు ప్రవేశ ద్వారంగా ఇరాన్ వ్యవహరిస్తోంది. కానీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయి, ఇజ్రాయెల్ అనుగ్రహం కోసం ఈ సంబంధాలను బలి ఇవ్వడానికి మోడీ సిద్ధపడ్డారు.

ప్రపంచాన్నే దూరం పెట్టారు..

జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కాలంలో భారత్ అంతర్జాతీయ వేదికలపై గళం విప్పి, అలీన దేశాల నాయకత్వం వహించింది. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రసంగాలు, కశ్మీర్ సమస్యపై భారత్ వాదన నేడు చరిత్ర పుటల్లో మిగిలిపోయాయి. నేడు మాత్రం అంతర్జాతీయ వేదికపై భారత్ స్వరం వినిపించడం లేదు. ప్రపంచంలో అత్యాచారాలు, అణచివేత, యుద్ధాలు జరుగుతున్నా భారత్ మౌనంగా ఉండిపోతోంది. ప్రధాని మోడీ తన అమెరికా, ఇజ్రాయెల్ స్నేహితుల కోసం బ్రిక్స్ అధ్యక్ష పదవి గౌరవాన్ని, బాధ్యతను, వాటి ఆదర్శాలు, లక్ష్యాలను త్యాగం చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంతో సమాన దూరం, సమాన సాన్నిహిత్యం అనే పంచశీల, అలీన విధాన సిద్ధాంతాన్ని విస్మరించి, కేవలం రెండు దేశాల అనుగ్రహం కోసం మిగిలిన ప్రపంచాన్ని దూరం పెట్టడం దేశ హితానికి విరుద్ధం.

ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు!

పశ్చిమాసియా సంక్షోభంపై పార్లమెంట్‌లో చర్చ జరిగి తీరాలి. భారత విదేశాంగ విధానం ఎటువైపు పయనిస్తోందో ప్రజలకు, ప్రతిపక్షానికి తెలియాలి. ప్రధాని మోడీ పార్లమెంటులో నిలబడి, తన విదేశాంగ విధానాన్ని వివరించాలి. ఇరాన్‌పై దాడులపట్ల మౌనంగా ఉండడానికి గల కారణాలను వివరించాలి. బ్రిక్స్ అధ్యక్ష పదవి కేవలం ముసుగు మాత్రమేనా, లేక నిజమైన బాధ్యతా అనేది స్పష్టం చేయాలి. లేని పక్షంలో, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్ట మరింత దిగజారుతూనే ఉంటుంది. ప్రపంచ దేశాలు భారత్‌ను విశ్వసించడం మానేస్తాయి. ఇది కేవలం ఒక ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయులకు అవమానం.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story