ట్రంప్ ఆగ్రహాన్ని లెక్కచేయని దోస్తీ..

by Ravi |   (  Updated:2025-12-16 00:45:34  IST  )

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విశేషమైంది. ఇది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మొట్టమొదటి భారత సందర్శన.

ట్రంప్ ఆగ్రహాన్ని లెక్కచేయని దోస్తీ..
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన విశేషమైంది. ఇది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మొట్టమొదటి భారత సందర్శన. ఈ కలయిక రెండు దేశాల మధ్య చరిత్రాత్మక స్నేహాన్ని మరోసారి రుజువు చేసింది. అయితే ఈ సన్నిహితత్వం పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాకు నచ్చటం లేదు.

చిరకాల బాంధవ్యం.. చెరగని స్నేహం

భారత్-రష్యా సంబంధాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ సమ్మిట్‌లో భారతదేశ అవసరాలకు రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పటిష్టతలపై పదహారు కీలక ఒప్పందాలు రష్యాతో కుదుర్చుకొన్నాం. భారత్ ఇప్పటికీ తన రక్షణ ఆయుధాల్లో 60 శాతానికి పైగా రష్యా నుండే కొంటోంది. (ఎస్-400 )వ్యవస్థ తర్వాత మరిన్ని ఆధునిక ఆయుధ ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇక ఈ ఒప్పందాల్లో అతి ముఖ్యమైనది ఇంధన రంగం. యుద్ధం తర్వాత భారత్ రష్యా నుండి భారీగా డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేసింది. 2022లో 10 బిలియన్ డాలర్లున్న వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రతి బ్యారెల్‌కు సగటున 12 డాలర్ల ఆదా అవుతోంది. పుతిన్ ‘భారత‌దేశ అవసరాలకు సరిపడా ఆంక్షలు లేని ఇంధనం సరఫరా’కు హామీ ఇచ్చారు. రెండు దేశాలూ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

భారత్-రష్యా... డీ-డాలరేజేషన్ బంధం

డాలర్‌ను దాటవేసి రూపాయి-రూబుల్ లావాదేవీలు, రష్యన్ బ్యాంకులు భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు. ఇవన్నీ డీ-డాలరైజేషన్ దిశగా వేగంగా వేస్తున్న చిన్న అడుగులు.. గ్లోబలైజేషన్ నియమాల ప్రకారం ఎవరు ఎవరితోనైనా అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు, దిగుమతులు వాళ్ల దేశ అవసరాలకు అనుగుణంగా స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఇప్పుడు భారత్‌కు రష్యా ఇచ్చే ధరకు ఏ దేశం క్రూడాయిల్ సరఫరా చేసినా కొనుగోలుకు భారత్ సిద్ధంగా ఉంది. కానీ, రష్యాతో ఈ సన్నిహితత్వం అమెరికాకు కంటగింపుగా మారింది. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అడ్డు రాకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది.

రష్యా చమురు కొనుగోలు ఆగదు..

ట్రంప్ తన దేశాన్ని బలోపేతం చేసుకోవటం తప్పు కానప్పుడు... అదే మార్గంలో భారత్ అనుసరిస్తే తప్పేముంది? భారత్ రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా ఆపే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇంధన భద్రత, దేశంలో ధరల స్థిరత్వం కీలకం. అమెరికా నుండి కొంత ఆయిల్ కొంటూ రష్యాతోనూ సంబంధాలు కాపాడుకుంటుంది. రక్షణ ఒప్పందాలు కూడా కొనసాగుతాయి. ఎందుకంటే భారత సైన్యానికి రష్యన్ ఆయుధాల స్పేర్ పార్ట్స్, సాంకేతికత అత్యవసరం. అమెరికాతో క్వాడ్, ఐ2, యూ2 వంటి వేదికల ద్వారా సహకారం పెరుగుతూనే ఉంటుంది. రష్యా-చైనా దోస్తీ భారత్‌కు పూర్తిగా వ్యతిరేకం కాదు. బదులుగా రష్యా ఒక బ్యాలెన్సింగ్ శక్తిగా పనిచేస్తుంది.

నూతన భారత్ తలవంచదు..

అంతిమంగా పుతిన్ ఢిల్లీ సందర్శన ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. భారత్ ఎవరి ఒత్తిడికీ లొంగని స్వతంత్ర శక్తిగా ఎదుగుతోంది. గ్లోబల్ ఆర్డర్ మారుతోంది. బ్రిక్స్, షాంఘై కో-ఆపరేషన్ వంటి వేదికల్లో భారత్-రష్యా భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ దోస్తీ భారత్ జాతీయ ప్రయోజ నాలకు అనుకూలంగా ఉంటూనే, ప్రపంచ రాజకీయాల్లో దాని స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తుంది. ట్రంప్ గానీ, యూరప్ గానీ, ఈ కొత్త భారత్‌ను గౌరవించక తప్పదు. ఒక దేశం మెరమెచ్చుల కోసం మన విధానాలు మారవు.

-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story