అప్పుల ఉరిలో అన్నదాత.. సంస్కరణలే మార్గం!

by Ravi |   (  Updated:2026-04-28 01:15:46  IST  )

భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల అప్పుల భారం, పెరుగుతున్న ఆత్మహత్యలు, తెలుగు రాష్ట్రాల పరిస్థితి, సమస్యల పరిష్కార మార్గాలపై విశ్లేషణాత్మక వ్యాసం.

అప్పుల ఉరిలో అన్నదాత.. సంస్కరణలే మార్గం!
X

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశ జనాభాలో అత్యధికులు ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడులకు లోనవుతూనే ఉంది. రైతు లేనిదే రాజ్యం లేదని పాలకులంటున్నా .. వివిధ పథకాలు అమలు చేస్తున్నా, రైతన్నల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవు తోంది. నిజానికి రైతు శ్రమకు తగ్గ గుర్తింపు, గౌరవం ఇస్తున్నామా అనేది ప్రభుత్వాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.

భారతీయ వ్యవసాయ రంగం దేశ జీడీపీలో 18.2 శాతం వాటాతో సుమారు 42.3 శాతం జనాభాకు జీవనా ధారాన్ని అందిస్తుందని 2024 నాటి ఆర్థిక సర్వే పేర్కొంది. పారిశ్రామిక, సాంకేతిక, సేవారంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా, జాతీయ స్థూల విలువ జోడింపు (జీఏవి)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తగ్గుతోంది.

అప్పుల సుడిగుండంలో రైతులు..

ఏఐ అన్ని రంగాల్లోనూ ప్రవేశించి ప్రగతి పరుగులు పెట్టిస్తుంటే వ్యవసాయ రంగం మాత్రం తిరోగమనంలో ఉంది. దేశానికి ఆహార భద్రత కల్పించే రైత‌న్న అప్పుల ఉబిలో పీక‌ల‌ లోతు దాకా కూరుకుపోతున్నాడు.. పాల‌కులు మారినా.. ప్రభుత్వాలు రుణమాఫీ చేసినా స‌గ‌టు రైతుకు అప్పుల భారం త‌ప్ప‌డం లేదనేది జగమె రిగిన సత్యం. ఆలిండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2019 పేరిట దేశంలోని 5,940 గ్రామాల్లో ఉన్న 69, 455 కుటుంబాలు, 3,995 పట్టణాల్లో ఉన్న 47,006 కుటుంబాల ఆర్ధిక స్థితిపై ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నిర్వహించిన సర్వే దేశంలోని రైతుల దీన స్థితిని వెల్లడించింది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున లక్ష రూపాయల పైన రుణ భారం ఉన్న రాష్ట్రాలు ఎనిమిది ఉంటే వాటిలో దక్షిణాది నుండే నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అప్పుల సుడిగుండంలో కూరుకుపోయారని ఇటీవల పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఇచ్చిన సమాచారంతో తేటతెల్లం అయ్యింది.

రికార్డు స్థాయిలో రైతుల రుణాలు..

దీని ప్రకారం దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రూ.31,34,807 కోట్లు కాగా వీటిలో పంట రుణాలు రూ.16,34,219 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.15,00,588 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల రుణాలు రూ.3,75,254 కోట్లు (పంట రుణాలు రూ.2,01,744 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.1,73,510 కోట్లు), తెలంగాణాలో రూ.1,75,960 కోట్లు (పంట రుణాలు రూ.96,167 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.80,792కోట్లు). దేశంలోనే అత్యధికంగా రైతుల అప్పులున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిస్తే, రెండు ఏడవ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే నివేదిక ప్రకారం జాతీయ సగటు రైతు కుటుంబ అప్పు రూ.74.121లు కాగా, సగటు నెలసరి వ్యవసాయ ఆదాయం రూ.10,218. అయితే అత్యంత వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాలలో రైతు కుటుంబాల సగటు నెలసరి ఆదాయం రూ.16,863 కాగా సగటు రుణ భారం రూ.13,642 మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితి

ఏపీలో రైతు కుటుంబాల సగటు నెలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా 2.56 శాతం (రూ.10,480) మేర ఎక్కువగా ఉన్నప్పటికీ అప్పులు మాత్రం సుమారు మూడింతలు (రూ.2,35,554)అధికం. అదే సమయంలో తెలంగాణ రైతు కుటుంబాల ఆదాయం జాతీయ సగటు వ్యవసాయ ఆదాయం కంటే 7.9శాతం తక్కువగా ఉన్నా (రూ.9,403) అప్పులు దాదాపు రెండింతలు (రూ.1.52,000) అధికం. ఏపీలో 92.9శాతం, తెలంగా ణాలో 89.1 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయన్న సత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రైతుల దయనీయ ఆర్థిక స్థితికి నిదర్శనం.

ఏటా పది వేలకు పైగా ఆత్మహత్యలు..

అనేక మంది రైతులు, కౌలు రైతులు భారీగా పెరిగిన వ్యవసాయ అవసరాలకు సరిపడా రుణాలు బ్యాంకుల నుండి పొందలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీలకు డబ్బు తీసుకుంటున్నారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే వెల్లడించింది. ధరల్లో స్థిరత్వం లేక పోవడం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అప్పుల భారాన్ని మోయలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2023లో దేశవ్యాప్తంగా 10,700 మంది (4,690 మంది రైతులు, 6,096 మంది వ్యవసాయ కార్మికులు) వ్యవ సాయదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. రైతు ఆత్మహత్య కేసులు ఎక్కువగా మహారాష్ట్ర (38.5 శాతం), కర్ణాటక (22.5 శాతం), ఆంధ్రప్రదేశ్ (8.6 శాతం), మధ్యప్రదేశ్ (7.2 శాతం), తమిళనాడు (5.9 శాతం)లలో నమోదయ్యాయి. 2021 నుండి ప్రతి ఏడాది పది వేల మందికి పైగా వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని నివేదిక హెచ్చరించింది.

పరిష్కారాలు ఎలా..?

వ్యవసాయానికి అత్యంత కీలకమైన రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా అందించి అన్నదాతలను ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల బారి నుండి ప్రభుత్వాలు కాపాడాలి. రైతుకు సాగు ఖ‌ర్చు తగ్గే విధంగా స‌హ‌జ, సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హించడంతో పాటుగా అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందించాలి. పండించిన పంటకు సబబైన మద్దతు ధరను నిర్ణయించి, పటిష్టంగా అమలు చేయాలి. రైతులు ద‌ళారీల‌పై ఆధార పడకుండా పంట‌ను నేరుగా అమ్ముకునేలా మార్కెటింగ్ వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి. ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల పంట‌ న‌ష్ట‌పోయిన రైతుల‌కు వెంట‌నే ప‌రిహారం అందించేలా పంట‌ల బీమా స‌క్ర‌మంగా అమ‌లు చేయాలి. వ్యవసాయం లాభసాటి కావాలంటే రుణ మాఫీలు, రైతు పథకాలు సరిపోవని.. పంటలకు సరైన ధర, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, పంటల బీమాతో పాటు మార్కెట్ సంస్కరణలు కలిసి పని చేస్తే సత్ఫలితాలు అందుతాయని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

-లింగమనేని శివరామ ప్రసాద్

రాజకీయ, సామాజిక విశ్లేషకులు

79813 20543

Next Story